* భారీ వర్షాలతో తెలుగు రాష్ట్రాలు ఆగమాగం..
* ఇల్లు కూలి నారాయణపేట జిల్లాలో తల్లీకూతురు మృతి
* రైల్వే ట్రాక్ ధ్వంసం.. నిలిచిన రైళ్లు
* రాకపోకలు బంద్ : 10 గంటలుగా బస్సులోనే ప్రయాణికులు
* చిన్న పిల్లల హాహాకారాలు
* ఖమ్మం జిల్లా కాకర్వల్ లో 52.9 సెంటిమీటర్ల వర్షపాతం నమోదు
* వణుకుతున్న విజయవాడ..
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : భారీ వర్షాలు (Heavy Rains)తెలుగు రాష్ట్రాల్లో బీభత్సం సృష్టిస్తున్నాయి. జనజీవనాన్ని స్తంభింపచేస్తున్నాయి. కొన్నిచోట్ల ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రాలేని పరిస్థితి నెలకొంది. బయటకు వెళ్లిన వారు ఇళ్లకు రాని దుస్థితి వచ్చింది. పలుచోట్ల రాకపోకలు నిలిచిపోవడంతో ఎక్కడివారు అక్కడే నిలిచిపోయారు. మరోవైపు రహదారులు చెరువులుగా మారాయి. వరద ఏరులై పారుతోంది. అలాగే, వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి.
నారాయణపేట జిల్లాలో తీవ్ర విషాదం..
నారాయణపేట జిల్లా (Narayanapeta District) లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. కొత్తపల్లి మండలంలో భారీ వర్షాలకు ఇల్లు కూలడంతో తల్లీకూతురు హనుమమ్మ(78), అంజిలమ్మ (38) మృతి చెందారు. దీంతో స్థానికంగా విషాదఛాయలు అలుముకున్నాయి. 24 గంటలుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో అటు రాష్ట్రంలో రికార్డ్ స్థాయిలో వర్షపాతం నమోదవుతోంది. అత్యధికంగా ఖమ్మం జిల్లా కాకర్వల్(kaakarwal)లో 52.9cm వర్షం కురిసింది. మహబూబాబాద్ జిల్లాలోని ఇనుగుర్తి(Inugurthy) లో 45.5 సెంటిమీటర్లు, చిన్నగూడూర్ లో 45 సెంటిమీటర్లు, వరంగల్ జిల్లా రెడ్లవాడలో 45 సెంటిమీటర్లు, సూర్యాపేటలో 44 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.
రైల్వే ట్రాక్ ధ్వంసం.. ఎక్కడిరైళ్లు అక్కడే..
మహబూబ్‌నగర్ జిల్లా(Mahaboobnagar District)లో రైల్వే ట్రాక్ ధ్వంసం కావడంతో విజయవాడ-కాజీపేట(Vijayawada-Khajipeta) మార్గంలో వెళ్లాల్సిన 24రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. మచిలీపట్నం, గౌతమి, సంఘమిత్ర, గంగా-కావేరి, చార్మినార్, యశ్వంత్‌పూర్ సహా పలు రైళ్లను మహబూబాబాద్, డోర్నకల్, వరంగల్, పందిళ్లపల్లి సహా మరికొన్ని స్టేషన్లలో నిలిపివేశారు. చాలా రైళ్లు 5 నుంచి 6 గంటలు ఆసల్యం కావడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. ఇంకొన్ని రైళ్లను దారి మళ్లించారు.
10 గంటలుగా బస్సులోనే..
వర్షాలకు కొన్నిచోట్ల రహదారులు తెగిపడ్డాయి. ఇంకొన్నిచోట్ల రోడ్లపై నీరు నిలిచిపోవడంతో రాకపోకలు స్తంభించిపోయాయి. వేములవాడ నుంచి మహబూబాబాద్‌కు శనివారం రాత్రి బయలుదేరిన ఆర్టీసీ బస్సు(Rtc Bus) వరంగల్ జిల్లా(Warangal District) వెంకటాపురం-తోపనపల్లి మధ్య నిలిచిపోయింది. వాగు ఉధృతంగా ప్రవహిస్తుండంతో 10 గంటలుగా బస్సులోనే బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నామని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కనీసం తాగడానికి నీళ్లు కూడా లేక చిన్నారులు ఇబ్బంది పడుతున్నారని వాపోతున్నారు. అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. మరోవైపు ఏపీ కూడా వర్షాలకు విలవిలలాడుతుంది. నాలుగు రోజుల పాటు వర్షం కురుస్తూనే ఉంది. భారీ వానలకు విజయవాడ(Vijayawada) వణుకుతోంది. కేవలం 24 గంటల్లోనే 29 సెంటిమీటర్ల వర్షపాతం నమోదైంది.