* రాజ్‌తరుణ్‌ను ఉద్దేశించి లావణ్య లేఖ
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : రాజ్ తరుణ్ – లావణ్య (Raj Tharun-Lavanya) కేసు సినిమా ట్విస్ట్ లను తలపిస్తోంది. రోజుకో వివాదం, రోజుకో కొత్త అంశం తెరపైకి వస్తోంది. శుక్రవారం అర్ధరాత్రి మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. ఇప్పటికే తన ప్రియుడు తనకు దక్కాలని వాదిస్తున్న లావణ్య.. అలా జరగకపోతే చనిపోతానంటూ ఆత్మహత్య లేఖ రాసి కలకలం సృష్టించింది. లావణ్య తరఫు న్యాయవాది అర్ధరాత్రి పోలీసులు, మీడియాకు సమాచారం అందించారు. దీంతో నార్సింగి పోలీసులు ఆమె ఇంటికి వెళ్లి కౌన్సిలింగ్ ఇచ్చి కాపాడారు. రాజ్ తరుణ్ లేని ప్రపంచంలో తాను ఉండలేనని, కానీ అతడు మారిపోయాడని లావణ్య అన్నారు. అతను తన చావును కోరుకున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. దీనంతటికి మాల్వీనే కారణమని.. తన దగ్గర వాళ్లు కూడా తనను అర్థం చేసుకోలేదని తెలిపారు. అయితే పోలీసులకు సూసైడ్ లెటర్ పంపిన కాసేపటికే తన అడ్వకేట్‌తో లావణ్య చాట్ చేసింది. తాను వెళ్లిపోతున్నానని ‘I am done with life’ అంటూ మెసేజ్ పెట్టడంతో సదరు అడ్వకేట్ పోలీసులకు సమాచారం చేరవేశారు. అప్రమత్తమైన పోలీసులు లావణ్యను కాపాడారు.
నిందలు వేయకండి.. లావణ్య తండ్రి
కాగా, ఈ కేసుపై లావణ్య తండ్రి స్పందించారు. అనవసరంగా తమ అమ్మాయిపై నిందలు వేయవద్దని, ఆమెకు డ్రగ్స్ అలవాటు లేదని తెలిపారు. అల్లుడని భావించి కరోనా సమయంలో రాజ్ తరుణ్‌కు ఆర్థిక సహాయం కూడా చేశామని వివరించారు. రాజ్ వచ్చి ఘనంగా తమ కుమార్తెను పెళ్లి చేసుకోవాలని కోరారు.
————————