* ఎన్నికల ప్రచారంలో ఉండగా ఘటన
* సర్వీస్ ఏజెంట్ల ఎదురు కాల్పుల్లో ఓ దుండగుడి మృతి
* ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ట్రంప్
* ట్రంప్ కు అమెరికా అధ్యక్షుడు బైడెన్ ఫోన్.. ఆరోగ్యం గురించి ఆరా
* నా స్నేహితుడిపై కాల్పులతో కలత చెందా : ప్రధాని మోదీ
* కాల్పుల్లో మరణించిన కుటుంబానికి సానుభూతి : ట్రంప్
* గాడ్ బ్లెస్ అమెరికా అంటూ ట్రంప్ ట్వీట్
ఆకేరు న్యూస్, డెస్క్ : ఎన్నికల ప్రచారంలో ఉండగా, అమెరికా మాజీ అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ పై దుంగులు కాల్పులు జరిపారు. పెన్సిల్వేనియా రాష్ట్రంలో జరిగిన ఈ ఘటన ప్రపంచం వ్యాప్యంగా కలకలం రేపింది. ట్రంప్ ర్యాలీలో పలుమార్లు తుపాకీ కాల్పుల శబ్దం వినిపించింది. దీంతో వెంటనే స్పందించిన సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు ఆయన్ను వేదికపై నుండి దించి కారు వద్దకు తీసుకెళ్లారు. సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు డోనల్డ్ ట్రంప్‌ను చుట్టుముట్టారు. అప్పటికే ఆయన చెవి దగ్గర, చెంపల మీద రక్తం కనిపించింది. కట్టుదిట్టమైన భద్రతా వలయంలో ట్రంప్‌ను స్టేజి మీద నుంచి కిందికి తీసుకువచ్చారు. స్టేజి మీద నుంచి కిందికి దించుతుండగానే పిడికిలి బిగించి సభకు వచ్చిన ప్రేక్షకులకు చూపిస్తూ వారిని ఉత్సాహపరిచే ప్రయత్నం చేశారు ట్రంప్. కాల్పులు శబ్దం వినిపించడం, ట్రంప్ గాయాలతో కనిపించడంతో సభకు వచ్చిన ప్రేక్షకులు ఒక్కసారిగా హాహాకారాలు చేశారు. సర్వీస్ ఏజెంట్ల ఎదురు కాల్పుల్లో ఓ దుండగుడు మృతి చెందాడు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలు అయ్యాయి. ప్రస్తుతం ట్రంప్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆరోగ్యం నిలకడగానే ఉందని తెలిపారు.
గాడ్ బ్లెస్ అమెరికా అంటూ ట్రంప్ ట్వీట్
కాల్పుల అనంతరం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ట్రంప్ ఈ ఘటనపై స్పందించారు. ‘‘నా చెవుల దగ్గర ఏదో శబ్దం వినిపించింది. బుల్లెట్ నా చర్మాన్ని చీల్చుకుంటూ వెళ్లినట్లు అనిపించింది. ఈ దేశంలో ఇలాంటి ఘటన జరుగుతుందని నేను ఊహించలేదు. కాల్పులు జరిపిన వ్యక్తి ఎవరో ఏంటో ఇంకా తెలియదు. అతను ఇప్పుడు చనిపోయాడు. ఈ ఘటనలో మరణించిన వ్యక్తి కుటుంబానికి, గాయపడిన వారికి సానుభూతి తెలుపుతున్నాను. గాడ్ బ్లెస్ అమెరికా’’ అని ట్రంప్ అక్కడి సామాజిక మాధ్యమాల్లో ట్వీట్ చేశారు.
ట్రంప్ కు ఫోన్ చేసిన బైడెన్
ఆస్పత్రిలో ఉన్న ట్రంప్‌కు అమెరికా అధ్యక్షుడు బైడెన్ ఫోన్ చేశారు. ఆరోగ్యం ఎలా ఉందని ఆరా తీశారు. తాను బాగానే ఉన్నానని ట్రంప్ తెలిపినట్లు శ్వేతశౌదం నుంచి ప్రకటన వెలువడింది. ప్రస్తుతం ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని, క్షేమంగానే ఉన్నారని రిపబ్లికన్ పార్టీ వర్గాలు వెల్లడించాయి. ట్రంప్‌పై కాల్పులను అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ సహా పలు దేశాల అధినేతలు ఖండించారు. ‘‘ట్రంప్ త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను. వెంటనే స్పందించిన సీక్రెట్ సర్వీస్ ఏజెన్సీకి కృతజ్ఞతలు. ఈ తరహా హింసకు అమెరికాలో చోటు లేదు. దేశమంతా ఇలాంటి ఘటనలను ముక్తకంఠంతో ఖండించాలి.’’ అని జోబైడెన్ ఎక్స్ లో చేసిన ఒక ప్రకటనలో అన్నారు. ట్రంప్ క్షేమంగా ఉండటంతో తాను ఊపిరి పీల్చుకున్నానని అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ అన్నారు.
దాడి నన్ను కలిచివేసింది.. నరేంద్ర మోదీ
ట్రంప్‌పై కాల్పుల ఘటనను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఖండించారు. ఎక్స్‌లో ఆయన స్పందిస్తూ … ‘‘నా స్నేహితుడు, మాజీ అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్‌పై దాడి నన్ను తీవ్రంగా కలచివేసింది. ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నాను. రాజకీయాలు, ప్రజాస్వామ్యంలో హింసకు తావు లేదు. ఆయన తొందరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను’’ అని అన్నారు. అమెరికా మాజీ అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్‌పై హత్యాయత్నం విచారకరమని, ఇలాంటి ఘటనలను అందరూ ఖండించాలని ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ అన్నారు. ట్రంప్ త్వరగా కోలుకోవాలంటూ ఎక్స్ లో చేసిన ఒక ప్రకటనలో ఆకాంక్షించారు.
—————————