
* గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ను ఉద్దేశించేనా?
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : బీజేపీ తెలంగాణ అధ్యక్షుడిగా ఎన్.రామచంద్రరావు (Ramachandra Rao) ఈరోజు బాధ్యతలు స్వీకరించారు. అధ్యక్షుడిగా ఎన్నిక కాగానే తాను ఎవరికీ భయపడే వ్యక్తిని కానని, విద్యార్థి దశలోనే ఎన్నోసార్లు జైలుకెళ్లానని, పోరాట యోధుడినని చెప్పుకున్న ఆయన తాజాగా మరోసారి తనదైన శైలిలో వ్యాఖ్యానించారు. ఎవరు పార్టీని వీడినా నష్టం లేదని అన్నారు. బీజేపీ (Bjp) విధానాలు నచ్చే పార్టీలో ఉండాలని పేర్కొన్నారు. పార్టీని నమ్ముకున్నవారిని బీజేపీ ఎప్పుడూ మోసం చేయదని, అందుకు తానే ఉదాహరణ అని చెప్పారు. పార్టీని నమ్ముకుని పనిచేసే వారు అందరికీ అవకాశాలు వస్తాయని, ఓర్పుతో ఉండాలని సూచించారు. కాగా, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి(Kishanreddy), ఎంపీ డీకే అరుణ, పలువురు సీనియర్ నేతల సమక్షంలో ఆయన బాధ్యతలు స్వీకరించారు. అంతకుముందు ఆయన చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయం వద్ద ప్రత్యేక పూజలు చేశారు. రామచంద్రరావును అధ్యక్షుడిగా ప్రకటించిన వెంటనే పార్టీకి రాజీనామా చేసిన గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్(Rajasingh)ను ఉద్దేశించే రామచంద్రరావు ఈ వ్యాఖ్యలు చేశారనే ప్రచారం జరుగుతోంది.
…………………………………………………