*అలోపతి వైద్యాన్ని కించపరిచేలా ప్రకటనలు..
* కోర్టును ఆశ్రయించిన ఐఎంఏ
* రాందేవ్ బాబా, మేనేజింగ్ డైరెక్టర్ బాలకృష్ణపై మండిపాటు
ఆకేరు న్యూస్, న్యూ ఢిల్లీ :
పతంజలి వ్యవహారం క్రమక్రమంగా ముదురుతోంది. దేశం అత్యున్నత న్యాయ స్థానం పతంజలి నిర్వాహకుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తుండడంతో ఉత్పత్తులపై తీవ్ర ప్రభావం చూపుతోంది. తాజాగా బుధవారం వారి తీరుపై మరోసారి మండిపడింది. పరిస్థితి చూస్తుంటే సమస్య ఇప్పట్లో పరిష్కారమయ్యేలా కనబడడం లేదు. ఈ కేసు ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం, ఉత్తరాఖండ్ ప్రభుత్వానికి చుట్టుకోవడంతో కేసు రోజుకో ములుపు తిరుగుతోంది.
అసలు కేసు ఏంటి..?
కరోనా తొలివిడతలో విజృంభించిన విషయం తెలిసిందే. కరోనాకు మందు లేకపోవడంతో చాలా మంది అలోపతితోపాటు ఆయుర్వేదం, యునానీ చికిత్సను ఆశ్రయించారు. యోగా గురువు రాందేవ్ బాబా ఆధ్వర్యంలో మేనేజింగ్ డైరెక్టర్ ఆచార్య బాలకృష్ణ పతంజలి పేరుతో ఆయుర్వేద ఉత్పత్తులను విక్రయిస్తున్న విషయం తెలిసందే. వీటికి దేశ వ్యాప్తంగా మంచి గుర్తింపు కూడా ఉంది. ఇదిలా ఉంటే కరోనా సమయంలో కరోనా నివారణకు కరోలిన్ పేరుతో ఓ ఉత్పత్తిని అందుబాటులోకి తెచ్చింది. పెద్ద ఎత్తున పత్రికలు, వివిధ చానళ్లలో వాణిజ్య ప్రకటనలు ఇచ్చింది. ఇక్కడే అసలు చిక్కు వచ్చింది. ఈ ప్రకటనలు అలోపతి వైద్యాన్ని, వైద్యుల్ని కించపరిచేలా ఉన్నాయని ఇండియన్ మెడికల్ అసోసియేషన్(ఐఎంఏ) కోర్టును ఆశ్రయించింది. అప్పటి నుంచి ఈకేసు నడుస్తోంది. సుప్రీం కోర్టు తీర్పునేపథ్యంలో ఇప్పుడు పతంజలి ఉత్పత్తులపై తీవ్ర ప్రభావం పడుతోంది. కరోలిన్ ఉత్పత్తులపైనే కాకుండా కొన్ని దీర్ఘకాలిక వ్యాధులను నయం చేస్తాయని పేర్కొంటున్న వాటిపై కూడా చర్యలు తీసుకునే అవకాశముంది. ఈ కేసులో సుప్రీం కోర్టు రూ.కోటి వరకు పరువునష్టం దావా విధించే అవకాశాలు లేకపోలేదు.
పతంజలి నిర్వాహకుల నిర్లక్ష్యం…
కేసు విచారణ చేపట్టిన సుప్రీం కోర్టు దీనిపై సీరియస్ అయింది. ఇది ముమ్మాటికీ డ్రగ్స్ అండ్ రెమెడిక్స్ యాక్ట్ 1954 లోని 3, 4 సెక్షన్ల ఉల్లంఘనే అని తేల్చింది. దీంతో నిర్వాహకులను హెచ్చరించింది. వ్యక్తిగతంగా కోర్టులో హాజరు కావాలని కోర్టు ఆదేశించినప్పటికీ పతంజలి నిర్వాహకులు ఖాతరు చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేసింది . క్షమాపణల అంశం కూడా మీడియాకు లీకు లు ఇవ్వడం పట్ల కూడా న్యాయమూర్తులు అసహనం వ్యక్తం చేశారు. సరైన ఆధారాల ఇవ్వకుండా పబ్లిసిటీ కోసం క్షమాపణలు చెప్పడంపై సుప్రీం మరింత ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇదిలాఉంటే 2023 నవంబరు 21న మరోసారి నిబంధనలు ఉల్లంఘించమని హామీ ఇస్తూ ప్రమాణ పత్రం సమర్పించారు. అయినా ఆ ప్రకటల్ని నిలిపి వేయకపోవడంతో ఏప్రిల్ 10(2024)న సుప్రీంకోర్టు మరోసారి మండిపడింది. పతంజలి క్షమాపణలను అంగీకరించేది లేదని స్పష్టం చేసింది. రాందేవ్ బాబా, మేనేజింగ్ డైరెక్టర్ ఆచార్య బాలకృష్ణ వేరువేరుగా సమర్పించిన తాజా అఫిడెవిట్లపైనా అభ్యంతరాలను వ్యక్తం చేసింది. చివరకు ఏప్రిల్ 16కు విచారణ వాయిదా వేసింది.
కేంద్రం , ఉత్తరాఖండ్ ప్రభుత్వాలపై ఆగ్రహం..
పతంజలి కేసు వ్యవహారం అటు కేంద్రానికి, ఇటు రాష్ట్రం ఉత్తరాఖండ్ మెడకు చుట్టుకుటోంది. ఈరెండు ప్రభుత్వాల్ని కేంద్రం చివాట్లు పెట్టింది. 2021లో కేంద్ర ఆయుష్ మంత్రిత్వ శాఖ, ఉత్తరాఖండ్ అథారిటీకి సుప్రీం లేఖ కూడా రాసింది. కాగా, ఈ ప్రకటన విషయమై 2020లో ఉత్తరాఖండ్ ప్రభుత్వానికి లేఖ రాసినట్టు కేంద్ర కోర్టుకు వివరించింది. పలుమార్లు హెచ్చరించినా స్పందించని ఉత్తరాఖండ్ ప్రభుత్వంపై సుప్రీం ఆగ్రహం వ్యక్తం చేసింది.
మరి ఇతర కంపెనీల మాటేమిటీ…?
పతంజలి ప్రాజెక్టులపై తీవ్రంగా స్పందించిన కోర్టు మరి ప్రకటనలతో వినియోగదారుల్ని పక్కదారి పట్టిస్తున్న కంపెనీలపై ఎలాంటి చర్యలు తీసుకోబోతోందనని వారు ఎదురుచూస్తున్నారు. కొన్ని కంపెనీలు వాస్తవికతను దూరంగా ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలో ఇచ్చే ప్రకటనలపై కూడా చర్యలు తీసుకోవాలని వినియోగదారులు డిమాండ్ చేస్తున్నారు.
—————————–