* 141 ఏళ్లు జైలు శిక్ష
* కేరళలోని మలప్పురం జిల్లాలో ఘటన
ఆకేరున్యూస్, తిరువనంతపురం: ఒక వ్యక్తి సవతి కూతురుపై పలు ఏళ్లుగా అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ విషయం తెలుసుకున్న తల్లి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఆ వ్యక్తిని అరెస్ట్ చేశారు. విచారణ జరిపిన ఫాస్ట్ ట్రాక్ కోర్టు నిందితుడికి 141 ఏళ్లు జైలు శిక్ష విధించింది. కేరళలోని మలప్పురం జిల్లాలో ఈ సంఘటన జరిగింది. తమిళనాడుకు చెందిన కుటుంబం పని కోసం కేరళకు వలస వచ్చింది. అయితే 2017 నుంచి 2020 వరకు సవతి తండ్రి సవతి కుమార్తెపై ఆమె తల్లి ఇంట్లో లేనప్పుడు ఆ బాలికపై అత్యాచారం చేసేవాడు. కాగా, బాధిత బాలిక ఈ విషయాన్ని తన స్నేహితురాలికి చెప్పడంతో ఆమె తల్లికి వివరించింది. దీంతో 2021లో ఆ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో తండ్రిని అరెస్ట్ చేశారు. 2022లో బెయిల్పై విడుదలైన ఆ వ్యక్తి సవతి కుమార్తెపై మళ్లీ లైంగిక దాడికి పాల్పడడంతో బాధితురాలి ఫిర్యాదుతో అతడిపై మరో కేసు నమోదైంది. మరోవైపు మంజేరి ఫాస్ట్ ట్రాక్ స్పెషల్ కోర్టు ఈ రెండు కేసులపై విచారణ జరిపింది. నవంబర్ 29న జడ్జి అష్రఫ్ ఏఎం తీర్పు ఇచ్చారు. పోక్సో, జువెనైల్ జస్టిస్ చట్టాలతో పాటు ఐపీసీలోని పలు సెక్షన్ల ప్రకారం రెండు కేసుల్లో మొత్తం 141 సంవత్సరాలు కఠిన కారాగార శిక్ష విధించారు.
…………………………………