* ప్రీ లాంచ్ ఆఫర్ల పేరిట మాయ
* మోసపోతూనే ఉన్న మధ్యతరగతి వర్గాలు
* ఆకర్షణీయ ప్రకటనలతో ఆకట్టుకుంటున్న సంస్థలు
* ఫ్లాట్లు అప్పజెప్పకుండా చేతులెత్తేస్తున్న వైనం
* కొందరు అప్పగించినా ముందు చెప్పిన సదుపాయాల కల్పనలో మోసం
* మోసపోతే బాధితుల పక్షాన నిలబడేదెవరు..
ఆకేరు న్యూస్ ప్రతినిధి, హైదరాబాద్ :
రండి బాబూ రండి.. బ్రహ్మాండమైన ప్రీ-లాంచ్ ఆఫర్. ఆలసించిన ఆశా భంగం. వాస్తవ ధర కంటే అతి తక్కువకే ఫ్లాట్లు. ప్రకటించిన గడువు లోపల గృహప్రవేశాలు చేయించే బాధ్యత మాది.. మధ్యతరగతి ప్రజల సొంతింటి కలను ఆసరాగా చేసుకుని.. వారిని ఆకర్షించేందుకు కొన్ని సంస్థలు చేసే ప్రకటనలు ఇవి. ప్రీ-లాంచ్ పేరుతో నిర్మాణ సంస్థలు చేస్తున్న మోసాల తీరిది. కాస్త తక్కువ ధరకే సొంతింటి కల తీరబోతుందన్న ఆశతో డబ్బులు కట్టిన వినియోగదారులను మోసం చేసి కొన్ని సంస్థలు బోర్డు తిప్పేస్తుంటే., మరికొన్ని సంస్థలు ఎమినిటీస్ కల్పనలో… డబ్బులు కట్టించుకున్నాక ఒకలా, ఫ్లాట్లు అప్పగించేటప్పుడు మరొకలా వ్యవహరిస్తున్నాయి. కొంపల్లిలో జరిగిన తాజా ఘటనతో ప్రీ లాంచ్ మాయాజాలం మరోసారి తెరపైకి వచ్చింది.
ఫ్లాటు.. ప్లాటూ పోయి పాట్లు మిగిలాయి..
కొంపల్లిలో భారతీ లేక్ వ్యూ అపార్టమెంట్ పేరుతో ఓ సంస్థ ప్రీ లాంచ్ ఆఫర్లను ప్రకటించింది. కొంత డబ్బు చెల్లించి ఫ్లాట్లు బుక్ చేసుకున్న వారికి, మా వ్యాపారాభివృద్ధికి తోడ్పడినందుకుగాను మార్కెట్ ధర కంటే తక్కువకే అప్పగిస్తామని ప్రకటనలు ఇచ్చింది. కమీషన్ ఆశచూపి దాదాపు వంద మందికి పైగా ఏజెంట్లను నియమించుకుంది. సంస్థను నమ్మిన ఆ ఏజెంట్లు కూడా తమకు తెలిసిన వారితో డబ్బు కట్టించి ఫ్లాట్లు బుక్ చేయించారు. అలా ఆ సంస్థ దాదాపు 350 మంది కొనుగోలుదారుల నుంచి ముందుగానే 60 కోట్లు వసూలు చేసింది. నిర్మాణాలు ప్రారంభించకుండా కాలయాపన చేసింది. కొంత కాలానికి 6.23 ఎకరాల సంస్థ స్థలాన్ని 100 కోట్లకు బిల్డర్లు అమ్మేశారు. ఈ విషయం తెలిసిన కొనుగోలుదారులు లబోదిబోమంటూ ఆందోళన చేపట్టడంతో ముగ్గురు బిల్డర్లను పోలీసులు అరెస్టు చేశారు. ఇప్పుడు డబ్బులు డిపాజిట్ చేసిన వారి పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఫ్లాటు లేక, తమ వాటం స్థలమూ పోవడంతో బోరుమంటున్నారు. ఆ కేసులు, గొడవలు తేలేసరికి ఎన్నేళ్లు పడుతుందో తెలియని పరిస్థితి.
మోసపోతూనే ఉన్నారు..
భారతీ లేక్ వ్యూ అపార్టమెంట్ పేరుతోనే కాదు.. ఇలాంటి మోసాలు జరుగుతూనే ఉన్నాయి. ఇదే నెలలో ప్రీ లాంచ్ ఆఫర్ పేరుతో రూ. 15 కోట్ల మేర కాజేసిన మరో నేరగాడిని సైబరాబాద్ ఆర్థిక నేరవిభాగం పోలీసులు అరెస్టు చేశారు. సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలం వెంకటాపురం గ్రామ పరిధిలో 200 ఎకరాల్లో భారీ వెంచర్ పేరుతో ఈ మోసం జరిగింది. గత నెలలో కూడా ప్రీ లాంచ్ పేరిట డబ్బులు వసూలు చేసి బాధితులను మోసగించిన ఆరుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్లో అయితే గతంలో ఏకంగా 1500 కోట్ల రూపాయల మేర ఓ సంస్థ భారీ మోసానికి పాల్పడింది. వందల మంది ఆ సంస్థలో భారీ మొత్తంలో పెట్టుబడులు పెట్టారు. కొవిడ్ పరిస్థితులు అంటూ అక్కడ ఎలాంటి పనులు ప్రారంభించలేదు. కొనుగోలుదారులు బాధితుల సంఘంగా ఏర్పడి ప్రతినిధుల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. అలాగే, కోకాపేటలో ఓ సంస్థ 7.5 ఎకరాల్లో వాణిజ్య సముదాయం కడతామని చెప్పి 600 కోట్ల రూపాయలు వసూలు చేసింది. అయిదు అంతస్తులు నిర్మించగా ఆరునెలలుగా పనులు ఆగిపోయాయి. చెప్పిన సమయం కంటే ఆ సంస్థ రెండేళ్ల పాటు ఆలస్యంగా ఫ్లాట్లను అందజేసింది. అందులోనూ సదుపాయాలు అంతంతమాత్రంగానే ఏర్పాటు చేసింది. మిగిలినవి మరింత డబ్బు పెట్టి కొనుగోలుదారులే ఏర్పాటు చేసుకున్నారు. ఐటీ కారిడార్లో కార్యాలయాల భవనాలను నిర్మించే మరో సంస్థ ప్రీలాంచ్ పేరుతో 2వేల కోట్ల రూపాయలు వసూలు చేసింది. గ్రేటర్ హైదరాబాద్, శివారు ప్రాంతాల్లో ఈ తరహా మోసాలు ఇటీవలికాలంలో ఎక్కువయ్యాయి.
ఎందుకిలా జరుగుతోంది..?
కరోనా వంటి విపత్తులు, ఎన్నికలు జరిగే సమయాల్లో అపార్టుమెంట్లకు భారీగా డిమాండ్ తగ్గుతుంది. దీంతో కొందరు రియల్ ఎస్టేట్ వ్యాపారులంతా ప్రీలాంచ్ ఆఫర్లతో కొనుగోలుదారులకు రంగుల వలను విసురుతారు. రెండేళ్ల ముందే అపార్టుమెంట్లను బుక్ చేసుకుంటే మీకు లక్షల్లో ఆదా అవుతుందని, బడా రియల్టర్లు హైదరాబాద్ లో ప్రీలాంచ్ పబ్లిసిటీ చేసుకుంటున్నారు. జీహెచ్ఎంసీ (GHMC), హెచ్ఎండీఏ (HMDA) అనుమతులు రాకముందే 10 నుంచి 15 ఎకరాల్లో భూములు కొనుగోలు చేయడం, భూముల ఓనర్లకు కొంతమేరకు మాత్రమే అడ్వాన్స్ ఇవ్వడం జరుగుతోంది. భూమి రిజిస్ట్రేషన్ అయ్యాక అసలుసిసలు అపార్టుమెంట్ల ప్రీలాంచ్ దందాకు తెరలేపుతున్నాయి రియాల్టీ సంస్థలు. భూమి పూజ చేయడం, ఓ మోస్తరు లెవెల్లో ఫ్లోర్లు వేయడం, ప్రీలాంచ్ ఆఫర్లు ప్రకటించడం జరుగుతోంది.దానికి ఆకర్షితులై చాలా ముందస్తుగానే సొమ్ములు చెల్లిస్తుంటారు. ఆపై అనుమతులు లేకపోవడం, ఆశించిన స్థాయిలో పెట్టుబడులు లేకపోవడంతో కొన్ని సంస్థలు కొనుగోలుదారులను మోసం చేస్తుంటాయి. వచ్చిన సొమ్ముతో బిచాణా ఎత్తేస్తుంటాయి. గ్రేటర్ హైదరాబాద్ లో కీలక ప్రాంతాలైన తెల్లాపూర్, మాదాపూర్, మియాపూర్, కొండాపూర్, నల్లగండ్ల, నార్సింగ్, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, నానక్ రామ్ గూడ, కూకట్ పల్లి, కొంపల్లి, ప్రగతి నగర్, బాచుపల్లి ఏరియాలు ఇప్పుడు ప్రీలాంచ్ ఆఫర్లకు కేంద్రాలుగా మారాయి.
సకాలంలో ఫ్లాట్లను అందించకపోతే ఎలా?
ఫ్లాటు ఎంత వరకు పూర్తయ్యిందో.. ఎలాంటి సౌకర్యాలను అందిస్తున్నారో అన్న అప్ డేట్లను సదరు బిల్డర్ ఎప్పటికప్పుడు కస్టమర్లకు తెలియ జేయాలి. అత్యవసర సర్వీసులను బిల్డర్ రీజనబుల్ రేట్లకే అందించాలని రెరా చెబుతుంది. మెజారిటీ బుకింగ్స్ పూర్తైనా మూడునెలల్లోనే అసోసియేషన్ లేదా సొసైటీ, కో ఆపరేటివ్ సోసైటీల ను ఏర్పాటు చేయాలి. కస్టమర్లకు తప్పుడు హామీలివ్వడం ..ఫ్లాట్ లేదా బిల్డింగ్ బుక్ చేసుకున్న తర్వాత మాట మార్చడం..అనుమతించిన ప్లాంస్,లే ఔట్ ల స్పెసిఫికేషన్ లను ఇష్టం వచ్చినట్టుమార్చడం కూడా రెరా నేరంగా పరిగణిస్తుంది. అగ్రిమెంట్ ప్రకారం అంతా జరగపోతే..కస్టమర్లు..ప్రాజెక్టు నుండి..విత్ డా చేసుకునే అవకాశం కూడా రెరా చట్టంప్రకారమే నడవాలి. అప్పుడు ముందుగా చెల్లించిన మొత్తం అడ్వాన్స్ ను బిల్డర్ వినియోగదారు లకు చెల్లించాల్సిన బాధ్యత ఉంటుంది.
మోసపోతే ఎవరిని సంప్రదించాలి..
2017 రెరా నిబంధనల ప్రకారం.. యూడీఎస్, ప్రీ-లాంచ్ విధానంలో డెవలపర్లు వినియోగదారులను మోసం చేయడం నేరం. యూడీఎస్, ప్రీ-లాంచ్ పేరుతో ఆఫర్లు ప్రకటిస్తున్న డెవలపర్లు, రియల్ ఎస్టేట్ సంస్థలు చేపట్టే ప్రాజెక్టులో 10 శాతం వరకు జరిమానా విధించవచ్చు. ప్రీ-లాంచ్ పేరిట మోసం చేసినా, అగ్రిమెంట్ ప్రకారం సదుపాయాలు ఏర్పాటు చేయకపోయినా కొనుగోలుదారులు వినియోగదారుల ఫోరాన్ని ఆశ్రయించవచ్చు. ఆ ఫోరం వాస్తవాలను పరిశీలించి వినియోగదారులకు తగిన న్యాయం చేసేందుకు కృషి చేస్తుంది. పది శాతం పెనాల్టీతో కట్టిన సొమ్ము తిరిగి ఇచ్చేలా ఆయా సంస్థలను ఆదేశిస్తుంది. లేనిపక్షంలో ఆర్థిక నేర పరిశోధనా సంస్థల చర్యలకు సిఫార్సు చేస్తుంది. అలాగే, తెలంగాణ రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీని ఆశ్రయించవచ్చు. అయితే రెరా ఆయా సంస్థలకు నోటీసులు జారీ చేసి మమ అనిపిస్తోందని, బాధితుల పక్షాన నిలబడి వారికి న్యాయం జరిగే వరకూ కృషి చేయడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
————