* వైస్ చాన్స్‌లర్ అప్పారావుకు సంబంధం లేదు
* రోహిత్ ఎస్సీ సామాజికవర్గానికి చెందిన వ్యక్తి కాదు
* హైకోర్టుకు నివేదిక సమపర్పించిన పోలీసులు
* కేసు క్లోజ్ చేసిన హైకోర్ట్
ఆకేరు న్యూస్ , హైదరాబాద్ : దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటి ( Hyderabad Central University ) పీహెచ్ డీ విద్యార్థి రోహిత్ వేముల ( Rohith Vemula ) ఆత్మహత్య కేసు ను మూసివేశారు. 8 ఏళ్ళుగా కొనసాగుతున్న ఈ కేసులో పోలీసులు హైకోర్ట్ కు క్లోజర్ రిపోర్ట్ ( Closer Report )అందజేశారు. ఇందులో అనేక సంచలన విషయాలు వెల్లడించారు. రోహిత్ వేముల ఆత్మహత్యకు సంబందించి కారణాలు, సాక్ష్యాలు ఏమి లేవు. వైస్ చాన్స్‌లర్ ప్రొఫెసర్ అప్పారావు, ఏబీవీవీ విద్యార్థులకు ఇతర బీజేపీ నాయకులకు ఎలాంటి సంబంధం లేదని పోలీసులు తేల్చేశారు. ఈ మేరకు శుక్రవారం హైకోర్టు ( High court )కు పోలీసులు నివేదిక సమర్పించారు. నివేదికలో అనేక సంచలన విషయాలను కోర్టుకు నివేదించారు. రోహిత్ వేముల అసలు షెడ్యూల్ కులాలకు సంబందించిన వ్యక్తి కాదని న్యాయ స్థానానికి తెలిపారు. హైకోర్టులో కేసు మూసి వేసినప్పటికీ కింది కోర్టులను ఆశ్రయించే అవకాశం న్యాయమూర్తి కల్పించారు.
* రోహిత్ వేముల ఆత్మహత్య జాతీయ స్థాయిలో చర్చ
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ సోషియాలజీ లో పీహెచ్ డీ చేస్తున్న రోహిత్ వేముల 2016 లో ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన నెలల తరబడి విశ్వవిద్యాలయాన్ని అట్టుడికే టట్టు చేసింది. జాతీయ స్థాయిలో పెద్ద ఎత్తున చర్చ జరిగింది. రోహిత్ వేముల ఆత్మహత్యకు కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ, అప్పటి సికింద్రాబాద్ ఎంపీ బండారు దత్తాత్రేయ, రామచందర్ రావులతో పాటు ఏబీవీపీ విద్యార్థులతో పాటు అప్పటి వైస్ చాన్స్‌లర్ ప్రొఫెసర్ అప్పారావులను నిందితిలుగా చేర్చి 306 ఐపీసీ సెక్షన్‌తో పాటు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ నమోదు చేశారు. రోహిత్ వేముల ఆత్మహత్యకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా విశ్వవిద్యాలయాల్లో నిరసన ప్రదర్శనలు జరిగాయి. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ కొన్ని నెలల పాటు పోలీస్ క్యాంప్‌గా మారిపోయింది. దళిత వర్గాల పట్ల విశ్వవిద్యాలయం అమానుషంగా వ్యవహరిస్తోందని , వైస్ చాన్స్‌లర్ అనాలోచిత నిర్ణయం వల్లనే రోహిత్ వేముల ఆత్మహత్యకు పాల్పడ్డారని ఆందోళన కారులు తీవ్రంగా విమర్శించారు. అంబేద్కర్ స్ట్యూడెంట్ అసోసియేషన్ అద్వర్యంలో రోహిత్ వేముల దళిత విద్యార్థుల సమస్యల పట్ల పోరాడేవాడని దళిత విద్యార్థి నాయకులు చెబుతున్నారు. ఏబీవీపీ నాయకులతో ఘర్షణ తర్వాత రోహిత్ వేములతో పాటు అంబేద్కర్ స్ట్యూడెంట్ అసోసియేషన్ విద్యార్థులను సస్పెండ్ చేశారు. అప్పటికే రోహిత్ వేములకు చెల్లించాల్సిన పీహెచ్డీ స్కాలర్ షిప్ ఆపేశారు. క్యాంపస్ గేటు దగ్గర టెంట్ వేసుకుని రోహిత్ వేములతో పాటు విద్యార్థులు నిరసన తెలిపారు. 2016 జనవరి 17 న సుధీర్ఘమైన లేఖ రాసి ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో విశ్వవిద్యాలయంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చెలరేగాయి. రాజకీయ పార్టీలు సంఘీభావాన్ని ప్రకటించాయి. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలో భాగంగా హైదరాబాద్‌లో రోహిత్ వేముల తల్లి రాధికను కలిసారు. సమాజంలోని అన్యాయాలకు వ్యతిరేకంగా రోహిత్ వేముల పోరాటమే నాకు స్పూర్తిగా నిలిచిందని ప్రకటించారు.
* ఇంటి నుంచే వివక్ష ఎదుర్కొన్న రోహిత్
ఎస్సీ మాల సామాజికవర్గానికి చెందిన రోహిత్ తల్లి రాధిక వలస కూలీల బిడ్డ. ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరుకు వడ్డెర సామాజిక వర్గానికి ( బీసీ ) చెందిన అంజనీ దేవి తన కూతురు చనిపోవడంతో రాధికను చిన్నప్పుడే పెంచుకున్నది. ఆ తర్వాత ఆమెకు సంతానం కలిగింది. అంజనీ దేవి తన వడ్డెర సామాజిక వర్గానికే చెందిన యువకుడికి ఇచ్చి పెళ్లి చేసింది. అతనికి ఐదేండ్ల తర్వాత రాధిక తన కులం కాదని తెలిసిపోయింది. దీంతో భార్య రాధికతో తరచూ గొడవలతో పాటు భౌతిక దాడులకు కూడా పాల్పడే వాడని రోహిత్ తన మిత్రలకు చెప్పుకునేవాడట. ఉన్నత విద్యావంతురాలైన అంజనీదేవి ( రాధిక పెంపుడు తల్లి ) రాధికను సొంత కూతురిగా భావించినప్పటికీ చదువు చెప్పించలేక పోవడంలో కులం అడ్డొచ్చి వుంటుందన్న భావన రోహిత్‌కు ఉండేదటా.. అంజనీ దేవి మిగిలిన సంతానం కూడా ఉన్నత విద్యవంతులు కావడం కూడా తన తల్లి పట్ల వివక్షకు సాక్ష్యంగా నిలుస్తందనేవాడటా.. ఒక్క మాటలో చెప్పాలంటే తాము ఆ ఇంటి మనుషులం కాము.. పని మనుషులుగానే పెరిగామని చాలా సార్లు చెప్పుకుని బాధపడేవాడంటారు. ఇలాంటి సమస్యలు ఎన్ని ఉన్నప్పటికీ చదువు విషయంలో ఎంతో ముందుండేవాడంటారు. అంబేద్కర్ రచనలు, విప్లవ సాహిత్యం లోతుగా అధ్యయనం చేసేవాడంటారు. జాతీయ, అంతర్జాతీయ అంశాల పట్ల ఎంతో అవగాహన కలిగి ఉండేవాడంటారు.
* తండ్రి కులమేనా ..?
రోహిత్ వేముల ఆత్మహత్య కేసు మూసి వేయడంలో అనేక అంశాలకు సంబందించి సరికొత్త చర్చకు తెరలేపుతోంది. తల్లి, తండ్రి వేర్వేరు కులాలకు సంబందించిన వారైతే పిల్లలకు కేవలం తండ్రి కులం మాత్రమే వర్తిస్తుందని చట్ట చెబుతోంది. మాల సామాజిక వర్గానికి చెందిన రోహిత్ వేముల తల్లి రాధిక కులం కాకుండా , తండ్రి కులం వడ్డెర ( బీసీ ) మాత్రమే వర్తించడం వల్ల రోహిత్ వేముల ఇపుడు ఎస్సీ కాకుండా పోయాడు. నిజానికి చట్ట ప్రకారం బీసీ అయినప్పటికీ జీవితాంతం ఎస్సీలుగా ఎదుర్కొనే కుల వివక్ష, అంటరానితనాన్ని అనుక్షణం అనుభవించాడు. బయటి సమాజం నుంచి కాకుండా సొంత కుటుంబం ముఖ్యంగా తండ్రి నుంచే ఈ కుల వివక్షను ఎదుర్కోవాల్సి వచ్చిందంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో రోహిత్ వేముల తీవ్ర స్థాయి మానసిక వేదనకు గురయ్యే వాడని మిత్రులు చెబుతారు. తల్లి పెంపకంలో పిల్లలు పెరిగిన ప్రత్యేక పరిస్థితుల్లో తల్లి కులం కూడా వర్తిస్తుందని వరంగల్ కు చెందిన ప్రముఖ న్యాయవాది గుడిమళ్ళ రవికుమార్ అన్నారు.
* ఇదీ చాలా దారుణం – సీఎం రేవంత్ రెడ్డి కలుస్తాం
– రోహిత్ సోదరుడు వేముల రాజా
ఇదీ చాలా దారుణం. పోలీసుల వాదన సరియైంది కాదు. కుల ధృవీకరణకు సంబందించి అన్నీ ఆధారాలు అధికారులకు అందజేశాం. పోలీసులు ఏక పక్ష నిర్ణయం తీసుకున్నారు. మరో సారి రోహిత్ వేములకు తీరని అన్యాయం జరిగింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి న్యాయం చేయాలని కోరుతాం.
* ఆంధోళనకు సిద్దమవుతున్న దళిత సంఘాలు
రోహిత్ వేముల కేసులో పోలీసులు అన్యాయంగా వ్యవహరించారని దళిత , ఇతర ప్రజా సంఘాలు అంటున్నాయి. కాంగ్రెస్ పార్టీ సరియైన నిర్ణయం తీసుకోక పోతే ఆంధోళనకు వెనుకాడేది లేదని స్పష్టం చేస్తున్నాయి.
——————————–