ఆకేరు న్యూస్, డెస్క్: తెలంగాణ రాష్ట్రంలోని కోటి మంది మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయడమే కాకుండా, వారి ఆరోగ్యం మరియు భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి మరియు మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క (ధనసరి అనసూయ) సచివాలయంలో నిర్వహించిన ఉన్నత స్థాయి సమీక్షలో కీలక ఆదేశాలు జారీ చేశారు.
* ప్రతి డ్వాక్రా మహిళకు సమగ్ర హెల్త్ ప్రొఫైల్..
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న స్వయం సహాయక సంఘాల (SHG) సభ్యులందరికీ ప్రత్యేకంగా ‘హెల్త్ ప్రొఫైల్’ రూపొందించనున్నారు. గ్రామ స్థాయిలో హెల్త్ క్యాంపులు నిర్వహించి, మహిళలకు ముఖ్యంగా రక్తహీనత (Anaemia), బ్రెస్ట్ క్యాన్సర్, మరియు సర్వైకల్ క్యాన్సర్ పరీక్షలు ఉచితంగా చేస్తారు. రిపోర్టుల ఆధారంగా అవసరమైన వారికి మెరుగైన వైద్యం మరియు పోషకాహారం అందిస్తారు.
*పని ప్రదేశాల్లో రక్షణ – ‘షీ సైబర్ ల్యాబ్’ ఏర్పాటు!!
మహిళల భద్రత కోసం సాంకేతికతను జోడిస్తూ మంత్రి సీతక్క కొత్త నిర్ణయాలు తీసుకున్నారు.. డేటింగ్ యాప్‌లు మరియు సైబర్ వేధింపుల నుండి మహిళలను రక్షించడానికి ప్రత్యేక ల్యాబ్‌ను ఏర్పాటు చేయనున్నారు. రాత్రి 8 గంటల తర్వాత పనిచేసే మహిళా ఉద్యోగుల కోసం GPS అనుసంధానిత రవాణా సదుపాయం కల్పించాలని ప్రైవేట్ సంస్థలకు ఆదేశాలు జారీ చేశారు. ప్రైవేట్ రంగంలో పనిచేసే మహిళలకు ‘మెటర్నిటీ బెనిఫిట్ యాక్ట్’ ద్వారా ప్రసూతి సెలవులు మరియు ఆర్థిక సాయం ఖచ్చితంగా అందేలా ఆడిట్ నిర్వహిస్తారు.
*ఆర్థిక చేయూత – వడ్డీ లేని రుణాలు…
మహిళలు కేవలం కూలీలుగా కాకుండా పారిశ్రామికవేత్తలుగా ఎదగాలన్నదే ప్రభుత్వ లక్ష్యం.
డ్వాక్రా సంఘాలకు వడ్డీ లేని రుణాలు అందించడంతో పాటు, వారు తయారు చేసిన ఉత్పత్తులకు అంతర్జాతీయ మార్కెట్ సౌకర్యం కల్పించనున్నారు.
చిన్న పిల్లల్లో పోషకాహార లోపాన్ని నివారించేందుకు అంగన్వాడీల్లో ‘బ్రేక్‌ఫాస్ట్ స్కీమ్’ మరియు పాలు, చిరుధాన్యాల పంపిణీని రాష్ట్రవ్యాప్తంగా విస్తరిస్తున్నారు.
*విద్యాసంస్థల్లో మార్పులు:
స్కూల్ స్థాయి నుంచే బాలికలకు స్వీయరక్షణ (Self-defense) శిక్షణ ఇవ్వాలని, పాఠ్యాంశాల్లో లింగ సమానత్వం (Gender Equality) గురించి చేర్చాలని మంత్రి సూచించారు. వేధింపులపై ఫిర్యాదు చేయడానికి అంతర్గత కమిటీల (ICC) పనితీరును షీ టీమ్స్ పర్యవేక్షిస్తాయి.
మహిళల సంక్షేమం కోసం పోలీస్, వైద్య, విద్య మరియు పంచాయతీరాజ్ శాఖలు సమన్వయంతో పనిచేయాలని సీతక్క స్పష్టం చేశారు. “మహిళా శక్తి” పథకం ద్వారా ప్రతి మహిళా ఆర్థిక స్వవలంబన సాధించే వరకు ప్రభుత్వం అండగా ఉంటుందని ఆమె భరోసా ఇచ్చారు.
