Kamalapur Congress Party Joinings
* ప్రభుత్వ సంక్షేమ పథకాలే శ్రీరామరక్ష
* కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటా..
* బీఆర్ఎస్ మునిగిపోతున్న నావ.. అధికారంలోకి రావడం భ్రమ
* నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ వొడితల ప్రణవ్
ఆకేరు న్యూస్, కమలాపూర్:
కమలాపూర్ మండలంలోని పలు గ్రామాలకు చెందిన బీజేపీ, బీఆర్ఎస్ ముఖ్య నాయకులు, కార్యకర్తలు హుజురాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇంచార్జి వొడితల ప్రణవ్ సమక్షంలో బుధవారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. ప్రణవ్ కండువా కప్పి వారిని పార్టీలోకి ఆహ్వానించారు. అంతకుముందు నియోజకవర్గ ఇంచార్జికి పార్టీ శ్రేణులు భారీ బైక్ ర్యాలీతో ఘన స్వాగతం పలికాయి. కమలాపూర్ కమ్యూనిటీ హాల్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో ప్రణవ్ మాట్లాడుతూ, గత పదేళ్లుగా ఎన్నో ఒడిదుడుకులు, శ్రమ కోర్చి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి కృషి చేసిన ప్రతి కార్యకర్తను కంటికి రెప్పలా కాపాడుకుంటామని హామీ ఇచ్చారు. ప్రస్తుత రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం రైతు, ప్రజా సంక్షేమంలో దేశంలోనే మొదటి స్థానంలో నిలుస్తుందని అన్నారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం, పేదలకు సన్నబియ్యం పంపిణీ వంటి పథకాలు క్షేత్రస్థాయిలో ప్రజలకు ఎంతో మేలు చేకూరుస్తున్నాయని వివరించారు.
స్థానిక ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి గతంలో ఎమ్మెల్సీగా, విప్ హోదాలో ఈ ప్రాంత అభివృద్ధికి ఎంతవరకు నిధులు తీసుకువచ్చారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. గత పదేళ్ల కాలంలో బీఆర్ఎస్ నాయకులు అభివృద్ధి చేయలేకపోయారని, ఇప్పుడు అధికారంలోకి వస్తామని కలలు కనడం భ్రమ మాత్రమేనని అన్నారు. హుజురాబాద్ మున్సిపల్ ఎన్నికల ఫలితాల తరహాలోనే రాబోయే రోజుల్లో హుజురాబాద్, కమలాపూర్ ప్రాంతాల్లో కాంగ్రెస్ పార్టీ ఆధిపత్యం కొనసాగుతుందని ధీమా వ్యక్తం చేశారు. మహిళా సాధికారతకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని, రాబోయే రోజుల్లో మహిళల కోసం మరిన్ని సంక్షేమ పథకాలు రానున్నాయని తెలిపారు.
* ఓటరు జాబితా సవరణపై దిశానిర్దేశం
ఓటరు జాబితా సవరణ ప్రక్రియ విషయంలో బూత్ లెవెల్ ఏజెంట్లు, పార్టీ నాయకులు అత్యంత అప్రమత్తంగా వ్యవహరించాలని ప్రణవ్ సూచించారు. ప్రజాస్వామ్యంలో ప్రతి ఓటు కీలకమైనదని, ఇతర రాష్ట్రాల అనుభవాలను దృష్టిలో ఉంచుకుని ఇక్కడ ఒక్క ఓటు కూడా వృథా కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ప్రణవ్ అన్నారు. కార్యక్రమంలో మండల పరిధిలోని వివిధ గ్రామాలకు చెందిన ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, భారీ సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు.
Please tell us what is wrong. Your report will be sent to the website team.
