* తొలితరం తెలుగు న్యూస్ రీడర్
ఆకేరు న్యూస్ , హైదరాబాద్ : తొలితరం తెలుగు న్యూస్ రీడర్ శాంతి స్వరూప్ (Shanthi Swarup ) గుండెపోటుతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందారు. ఆయనకు భార్య రోజా రాణి, ఇద్దరు కుమారులు ఉన్నారు. ఆయన 41 ఏళ్ళ క్రితమే దూరదర్శన్ తెలుగు చానల్లో వార్తలు చదివిన మొదటి వ్యక్తి. ఆయనను చాలా మంది న్యూస్ రీడర్లు గురువుగా భావిస్తారు. 2011లో పదవీ విరమణ చేశారు. దూరదర్శన్ కంటే ముందు ఏడాది పాటు రేడియోలో కూడా పనిచేశారు. ఆ కాలంలో లైవ్ లో ఎలాంటి టెలి ప్రామ్టర్ లేకుండా వార్తలు చదివే వారు. పేపర్ మీద రాసిన వార్తలను కంఠతా పట్టి తప్పులు లేకుండా లైవ్లో చదవడం అద్భుతమైన ప్రతిభగా ఇప్పటికీ చెప్పుకుంటారు. న్యూస్ రీడర్గా చాలా ప్రజాధరణ పొందాడు. మిమిక్రీ కళాకారులు అప్పట్లో శాంతి స్వరూప్ వార్తలు చదివే విదానం గురించి అనుకరించకుండా వారి కార్యక్రమాలు ఉండేవి కావంటారు. ఆయన న్యూస్ రీడర్గానే కాకుండా మంచి రచయితగా కూడా రాణించారు. రాతి మేఘం అనే నవల రాశారు. భోపాల్ లో గ్యాస్ లీకేజీతో జరిగిన మారణ హోమాన్ని వివరిస్తూ రాశారు. అదే విదంగా సతీహగమనానికి వ్యతిరేకంగా అర్థాగ్ని అనే నవల రాశారు. నీళ్ళు నిద్ర లేచాయి. ఈ చావు నాది కాదు లాంటి చాలా నాటికలు కూడా రాసి రవీంద్రభారతిలో ప్రదర్శించే వారు. క్రికెట్ ఆటకు సంబందించి క్రేజ్ అనే నవల రాశారు. ప్రముఖ శాస్త్రవేత్త శాంతి స్వరూప్ భట్నాగర్ మీద అభిమానంతో తండ్రి తనకు శాంతి స్వరూప్ అని పేరు పెట్టారని ఒక ఇంటర్వ్యూ లో చెప్పారు. తండ్రి హైదరాబాద్ , తల్లి గుంటూరు జిల్లా బాపట్లకు చెందిన వారు. హైదరాబాద్లో పుట్టి పెరిగినప్పటికీ పాఠశాల విద్య , కళాశాలల్లో కృష్ణా జిల్లా అద్యాపకులు ఉండేవారు. దీంతో తనకు తెలంగాణ యాస పరిమళం నాకు అంటుకోలేదన్నారు.
———————