
* అక్కను చంపిన తమ్ముడు
ఆకేరు న్యూస్, రంగారెడ్డి : ప్రేమికుడితో మాట్లాడుతున్న అక్కను తమ్ముడు చంపిన సంఘటన సోమవారం రోజున రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండలం పెంజర్లలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి. పెంజర్లకు చెందిన మేస్త్రీ దేశాల రాఘవేందర్-సునీత దంపతులకు ఇద్దరు కుమార్తెలు, ఓ కుమారుడు ఉన్నారు. పెద్దకుమార్తె రుచిత (21) డిగ్రీ పూర్తి చేసింది. ఎంబీఏ అడ్మిషన్ కోసం ఎదురుచూస్తోంది. కాగా, పెంజర్ల గ్రామానికి చెందిన యువకుడితో ప్రేమ వ్యవహారం నడుస్తోంది. ఈ విషయంపై కుటుంబంలో గొడవలు జరుగగా, పెద్దల సమక్షంలో పంచాయితీకి వెళ్లారు. పెద్దమనుషుల వద్ద తాము మాట్లాడుకోబోమని చెప్పడంతో సమస్య సద్దుమణిగింది. మళ్లీ కొంతకాలం నుంచి ప్రేమికులు ఫోన్ చేసుకుని మాట్లాడుకుంటున్నారు. ఈ విషయంలో సోదరుడు రోహిత్ రుచితను మందలిస్తున్నాడు. ఈక్రమంలో సోమవారం నాడు తల్లిదండ్రులు పనులకు వెళ్లారు. రోహిత్, రుచిత ఇంట్లో ఉండగా, అక్క ప్రేమికుడితో ఫోన్లో మాట్లాడాన్ని గమనించాడు. మన పరువు తీసిన అతడితో ఎందుకు మాట్లాడుతున్నావంటూ అక్కతో తమ్ముడు గొడవకు దిగి, కోపంలో మెడకు వైరు బిగించి ఊపిరాడకుండా చేయడంతో చనిపోయింది. అనంతరం రోహిత్ బంధువులకు ఫోన్‌చేసి అక్క స్పృహకోల్పోయిందని తెలిపాడు. వారు వచ్చి పరిశీలించి పోలీసులకు సమాచారం చేరవేరశారు. పోలీసులు కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
…………………………………….