* కాంగ్రెస్ లోకి ఆరుగురు ఎమ్మెల్సీలు
* ఇప్పటికే ఆరుగురు ఎమ్మెల్యేలు చేరిక
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : రాజకీయ నాయకులు రాత్రికి రాత్రే కండువాలు మార్చడం మామూలే. కానీ.. సీఎం ఎప్పుడొస్తారా.. అని అర్ధరాత్రి వరకూ వేచి చూసి మరీ పార్టీలోకి చేరారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు (MLCs). ఇప్పుడిదే హాట్ టాపిక్ గా మారింది. ఆపరేషన్ ఆకర్ష్ ను విస్తృతంగా చేపడుతున్న కాంగ్రెస్ పార్టీ.. వలసలను ప్రోత్సహిస్తోంది. ఇప్పటికే ఆరుగురు ఎమ్మెల్యేలను పార్టీలోకి చేర్చుకోగా, తాజాగా ఆరుగురు ఎమ్మెల్సీలు కాంగ్రెస్ లో చేరారు. ఎమ్మెల్సీలు దండె విఠల్, భానుప్రసాద్ రావు, ఎం.ఎస్.ప్రభాకర్, బొగ్గారపు దయానంద్, ఎగ్గే మల్లేశం, బస్వరాజు సారయ్య అధికార పార్టీలోకి చేరారు. జూబ్లీహిల్స్ లోని రేవంత్ నివాసంలో నిన్న అర్ధరాత్రి కండువాకప్పి పార్టీలోకి సిఎం రేవంత్ రెడ్డి, ఏఐసీసీ ఇంచార్జ్ దీపాదాస్ మున్షీ ఆహ్వానించారు.
బీఆర్ ఎస్‌కు ఇది గట్టి షాకే..
ఇప్పటి వరకూ శాసనమండలిలో బలం ఉందని ధీమాగా ఉన్న బీఆర్ఎస్కు ఒకేసారి ఆరుగురు పార్టీ ఫిరాయించడంతో ఉన్న సంతోషం ఆవిరయింది. ఇప్పటి వరకూ ఎమ్మెల్యేలు పార్టీ మారుతున్నారన్న ప్రచారం జరిగింది. అయితే ఎమ్మెల్సీలు ఇంత పెద్ద స్థాయిలో పార్టీ మారతారని గులాబీ బాస్ సైతం ఊహించలేదు. ఇది తెలిసిన తర్వాత గులాబీ దళం షాక్ కు గురైంది. అంతకు ముందు నుంచే ఎమ్మెల్సీలు కాంగ్రెస్ అగ్రనాయకత్వంతో మంతనాలు జరుపుతున్నప్పటికీ బయటకు రాకుండా జాగ్రత్త పడ్డారు. ముఖ్యమంత్రి ఢిల్లీ పర్యటన ముగించుకుని ఆయన నివాసం చేరుకున్న వెంటనే అక్కడకు వచ్చిన ఎమ్మెల్సీలు కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు.
—————————