* మహిళల ఆశ నిరాశే!
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : సంక్షేమం-అభివృద్ధిని సమపాళ్లలో రంగరించి జోడు గుర్రాల తరహాలో సుపరిపాలనా రథాన్ని పరుగులు పెట్టించడంలో సఫలీకృతమయ్యాం.. అంటూ అసెంబ్లీలో 2025-26 వార్షిక బడ్జెట్ను ఉపముఖ్యమంత్రి, ఆర్థిక శాఖామాత్యులు భట్టి విక్రమార్క బుధవారం ప్రదేశం పెట్టారు. ఆయన ప్రసంగం మొదట్లో చెప్పినట్లుగానే సంక్షేమం-అభివృద్ధికి దృష్టిలో పెట్టుకునే బడ్జెట్ను రూపొందించినట్లు కనిపిస్తోంది. అయితే వాటిలోనూ కొన్ని కీలక అంశాలను మిస్ చేయడం, అందుకు ఆర్థిక పరిస్థితులనే కారణంగా చెబుతుండడం గమనించాల్సిన విషయం. పదేళ్ల బీఆర్ ఎస్ అప్రతిహత పాలనలకు బ్రేక్ వేస్తూ, గత అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టారు. అందుకు గత పాలనపై ఉన్న వ్యతిరేకత కొంతయితే, కాంగ్రెస్ ఇచ్చిన హామీలు, ఆరు గ్యారెంటీలను ప్రధాన కారణంగా చెప్పవచ్చు. అధికారంలోకి వచ్చిన రెండు రోజులకే ఆరు గ్యారెంటీల్లో ఒకటైన మహిళలకు ఉచిత ప్రయాణం హామీని నెరవేర్చి పాలనపై ప్రజల్లో ఆసక్తిని రేకెత్తించింది.
మహిళల అసంతృప్తి
ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇది కాంగ్రెస్కు రెండో బడ్జెట్. ఇప్పటి వరకు ఆరు గ్యారెంటీల్లో ప్రధానమైన హీమీలను ప్రభుత్వం నెరవేర్చలేకపోయింది. ఆ విషయాన్ని సర్కారు పెద్దలు కూడా చాలాసార్లు అంగీకరిస్తున్నారు. అందుకు గత ప్రభుత్వం సృష్టించిన ఆర్థిక విధ్వంసమే కారణంగా చెబుతూ వచ్చారు. అయితే తాజా బడ్జెట్లో అయినా ఆరు గ్యారెంటీలకు ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తుందని చాలా మంది భావించారు. అనుకున్నట్లుగానే కేటాయింపులు చేసినప్పటికీ, మహిళలకు చెందిన కీలక హామీ ఊసే ఎత్తలేదు. అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే మహిళల ఖాతాల్లో ప్రతీ నెలా రూ. 2500 ఇస్తామని ప్రకటించారు. అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర గడిచినప్పటికీ, ఇప్పుడు కూడా ఆ ప్రకటన లేకపోవడంపై మహిళలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మిగతా వాటిని దృష్టిలో పెట్టుకుని నిధులు కేటాయించడం ఆహ్వానించదగిన పరిణామం.
ఆరు గ్యారంటీలకు చెందిన కొన్నింటికి కేటాయింపులు ఎలా ఉన్నాయంటే..
* మహాలక్ష్మి (ఆర్టీసీ బస్సు) రూ.4,305 కోట్లు
* గృహజ్యోతి (200 యూనిట్ల ఉచిత విద్యుత్) రూ.2,080 కోట్లు
* ఇందిరమ్మ ఇళ్లు – రూ.12,571 కోట్లు
* రైతు భరోసా – రూ.18 వేల కోట్లు
* చేయూత పింఛన్లు – రూ.14,861 కోట్లు
* సన్నాలకు బోనస్ – రూ.1,800 కోట్లు
* రాజీవ్ ఆరోగ్యశ్రీ – రూ.1,143 కోట్లు
* గ్యాస్ సిలిండర్ రాయితీ – రూ.723 కోట్లు
* ఇందిరమ్మ ఆత్మీయ భరోసా – రూ.600 కోట్లు
* రాజీవ్ యువ వికాసం రూ.6 వేల కోట్లు
………………………………
