
ఆకేరు న్యూస్, ములుగు:ఈ నెల 4వ తారీఖున మావోయిస్టులు అమర్చిన ప్రషర్ బాంబు పేలడంతో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతూ మరణించిన ముకునూరు పాలెం గ్రామానికి చెందిన సోయం కామయ్య కుటుంబాన్ని ములుగు జిల్లా ఎస్పీ శబరీష్. మృతుని ఇంటికి వెళ్ళి పరామర్శించారు. మృతుని భార్య సోయం సమ్మక్క యొక్క ఆరోగ్య పరిస్థితినీ అడిగి తెలుసుకున్నారు. కుటుంబ పెద్ద లేకపోవటం కుటుంబానికి తీరని లోటు అని, ఆ విధంగా ఎవరికి జరగకూడదని సోయం కామయ్య మృతిపై ఎస్ పి తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మావోయిస్టులు చేసిన ఇట్టి దుశ్చర్యను ప్రజలందరూ ఖండించాలని అన్నారు. మృతుని కుటుంబానికి తాము ఎల్లవేళలా అండగా ఉంటామని, ప్రభుత్వం ద్వారా త్వరగా నష్ట పరిహారం అందేలా కృషి చేస్తామని హామీ ఇచ్చారు. మృతుని కుమారుడు తన తల్లి పక్షవాతం రోగం తో ఇబ్బంది పడుతుందని, అతని సోదరి మంద బుద్ధితో బాధపడుతున్నదని, వారికి పెన్షన్లు రావటంలేదని ఎస్ పి తెలిపారు.వెంటనే స్పందించి సంబంధిత శాఖ అధికారులతో మాట్లాడి వీలైనంత త్వరగా పెన్షన్లు మంజూరు అయ్యేలా చర్యలు తీసుకోవాలని వెంకటాపురం సిఐ కుమార్ ను ఆదేశించారు.
అన్నివిధాలా అండగా ఉంటాం
మృతుని కుటుంబానికి ఎటువంటి సాయం కావాలన్నా పోలీస్ యంత్రాంగ తరుపున తాము అన్ని విధాలా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. బాధిత కుటుంబానికి ములుగు జిల్లా పోలీస్ శాఖ తరుపున ఆర్థిక సహాయం అందించారు. నిషేధిత మావోయిస్టులు రక్షణ పేరు తో తమ ఉనికిని చాటు కోవడం కోసం పోలీస్ ల ప్రాణాలని తీయాలనే ఉద్దేశంతో అడవి మొత్తం ప్రెషర్ బాంబులు, ల్యాండ్ మైన్లు అమర్చి, అటవీ ఉత్పత్తుల మీద ఆధారపడి జీవించే అమాయకులైన ఆదివాసీల ప్రాణాలను హరిస్తున్నారని అన్నారు. ములుగు జిల్లా పోలీస్ యంత్రాంగం ఎల్లప్పుడూ ప్రజల రక్షణకు కట్టుబడి ఉంటుందని, ఎల్లవేళలా ప్రజలకు అందుబాటులో ఉంటూ అండగా, తోడుగా ఉంటుందని గ్రామస్తులలో ధైర్యాన్ని నింపారు. మావోయిస్టులు అమర్చిన బాంబులను ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి నిర్వీర్యం చేస్తున్నామని,తెలిపారు.ఈ కార్యక్రమంలో ఏటూరునాగారం ఏఎస్పి శివం ఉపాధ్యాయ , వెంకటాపురం సిఐ కుమార్ , వెంకటాపురం ఎస్ఐ తిరుపతిరావు , సివిల్, సిఆర్పిఎఫ్ సిబ్బంది గ్రామస్తులు పాల్గొన్నారు.
……………………………………….