*స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గం మత్స్య సంపదలో ముందంజలో ఉంది..
*రిజర్వాయర్ కు 32.60 కోట్లతో డబుల్ రోడ్డు నిర్మాణ పనులు..
*మల్లన్నగండి రిజర్వాయర్‌లో చేప పిల్లలను విడుదల చేసిన ఎమ్మెల్యే కడియం శ్రీహరి
ఆకేరు న్యూస్, స్టేషన్ ఘన్పూర్ : రాష్ట్ర ప్రభుత్వం మత్స్యశాఖ ఆధ్వర్యంలో వందశాతం సబ్సిడీతో చేపట్టిన ఉచిత చేప పిల్లల పంపిణీ కార్యక్రమం లో భాగంగా చిల్పూర్ మండలం, మల్లన్నగండి రిజర్వాయర్‌లో మాజీ ఉపముఖ్యమంత్రి, స్టేషన్ ఘనపూర్ శాసనసభ్యులు కడియం శ్రీహరి శుక్రవారం చేప పిల్లలను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కడియం శ్రీహరి మాట్లాడుతూ…
ముదిరాజ్ సమాజాన్ని ఆర్థికంగా బలపరచడం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యం అన్నారు. అందుకే రిజర్వాయర్లలో ఉచితంగా చేప పిల్లల పంపిణీ చేపట్టాండం జరిగిందన్నారు. రాజకీయాలు పక్కనబెట్టి అందరూ ఏకతాటిపై ఉండి ఉపాధిని సృష్టించుకోవాలి అన్నారు. స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గం మత్స్య సంపదలో ముందంజలో ఉందని, 320 చెరువులు, 7 రిజర్వాయర్లు ఈ ప్రాంతంలో ఉన్నాయని తెలిపారు. మత్స్యకారులందరికీ అందుబాటులో ఉన్న రిజర్వాయర్లలో చేప పిల్లల పెంపకాన్ని విస్తృతంగా చేపడతాం అని స్పష్టం చేశారు. గండిరామారం రిజర్వాయర్‌తో తనకు ప్రత్యేక అనుబంధం ఉందని గుర్తుచేసుకున్న ఎమ్మెల్యే కడియం శ్రీహరి గారు భారీ నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్నప్పుడు 1.60 కోట్ల వ్యయంతో గండిరామారం రిజర్వాయర్ నిర్మాణంచేయడం జరిగిందన్నారు. ఈ రిజర్వాయర్ కింద రైతులు ఇప్పుడు రెండు పంటలు పండించి ఆర్థికంగా బలపడుతున్నారు అన్నారు.అలాగే మల్లన్నగండి రిజర్వాయర్‌కు వచ్చే రెండు వైపులా 32.60 కోట్లతో డబుల్ రోడ్డు నిర్మాణ పనులు త్వరలో ప్రారంభమవుతున్నాయని తెలిపారు. ఈ ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దే దిశగా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
