ఆకేరు న్యూస్, స్టేషన్ ఘన్ పూర్:
ప్రతి వాహనదారుడు రోడ్డు నిబంధనలు పాటిస్తే ప్రమాద రహిత స్టేషన్ ఘన్ పూర్ గా మారుతుందని జనగామ డిసిపి రాజమహేంద్ర నాయక్ పిలుపునిచ్చారు. జనగామ జిల్లా
స్టేషన్ ఘన్ పూర్ పోలీస్ స్టేషన్ లో సోమవారం ద్విచక్ర వాహనదారులకు ఐఆర్ఏ ఎడ్యుకేషనల్ ట్రస్ట్, ఉప్పుగల్ ఆయిల్ కంపెనీ సహకారంతో హెల్మెట్ల పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన అవగాహన సదస్సుకు స్థానిక సీఐ జి.వేణు అధ్యక్షత వహించగా డిసిపి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జాతీయ రహదారిపై ఉన్న జనగామ జిల్లా పరిధిలో రఘునాథపల్లి, నిడుగొండ, రాఘవపూర్, మీదికొండ క్రాస్, తాటికొండ క్రాస్, పల్లగుట్ట క్రాస్, చిన్న పెండ్యాల, కరుణాపురం వద్ద రోడ్డు ప్రమాదాలు జరిగి పలువురు మృతిచెందినట్లు తెలిపారు. ఈ ప్రమాదాలకు ప్రధాన కారణం నిర్లక్ష్యం, డ్రంక్ అండ్ డ్రైవ్, రోడ్డు భద్రత నిబంధనలు పాటించకపోవడమే అన్నారు. ఉద్యోగం, వృత్తి, వివిధ పనుల కోసం వాహనాలను వినియోగించే వాహన దారులు మీపై భార్య, పిల్లలు, కుటుంబం ఆధారపడి ఉందనే విషయాన్ని మర్చిపోవద్దన్నారు. ద్విచక్ర వాహనదారులు విధిగా లైసెన్స్, ఆర్ సి కలిగి ఉండి హెల్మెట్ ధరించాలన్నారు. ఇతర వాహనాలు నడిపేవారు లైసెన్స్, ఆర్ సి ఉండాలన్నారు, సీటు బెల్టు పెట్టుకోవాలని సూచించారు. రోడ్డుపైన ఏ ప్రాంతంలో ఎంత వేగంగా వెళ్లాలి సిగ్నల్స్, హెచ్చరిక బోర్డులను గమనిస్తూ వాహనాన్ని నడపాలని కోరారు. ఇలా రోడ్డు నిబంధనలు పాటించినప్పుడే ప్రమాద రహిత స్టేషన్ ఘన్ పూర్ గా మార్చవచ్చు అన్నారు. ఈ అవగాహన సదస్సులో ట్రైనీ ఐపీఎస్ మనీషా నెహ్ర, ఏసిపి భీమ్ శర్మ, ఎస్సైలు బి.వినయ్ కుమార్, పి.రాజేష్, డోనర్ సుబ్బారెడ్డి సిబ్బంది పాల్గొన్నారు. అనంతరం వాహనదారులకు హెల్మెట్లు పంపిణీ చేసి పోలీస్ స్టేషన్ నుండి గాంధీ చౌరస్తా, శివాజీ సెంటర్ బైక్ ర్యాలీ నిర్వహించారు.
