
* జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్.
ఆకేరు న్యూస్ ములుగు: గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాల, కళాశాలలో విద్యను అభ్యసిస్తున్న విద్యార్థినీ, విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు మంచి పౌష్టికాహారం అందజేయాలని జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్. అధికారులకు సూచించారు. శుక్రవారం ఏటూర్ నాగారం మండలం చిన్న బోయినపల్లి గిరిజన సంక్షేమ శాఖ ఆశ్రమ ఉన్నత బాలుర పాఠశాలను కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ పరిసరాలను పరిశీలించడంతో పాటు వంట గదిని పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఆయన విద్యార్థులతో కలిసి ముచ్చటిస్తూ భోజనం చేశారు. పరిసరాలు నిత్యం పరిశుభ్రంగా ఉంచుకోవాలని, సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని కోరారు. ప్రతి విద్యార్థి పై ఉపాధ్యాయులు నిత్యం పరిశీలిస్తూ ఉన్నత చదువులు చదివే విధంగా నాణ్యమైన బోధన చేయాలని ఉపాధ్యాయులకు సూచించారు. ప్రతిరోజు మెనూ పాటించాలని, సమయానికి ఆహారం అందించడంతో పాటు విద్యను బోధించాలని అన్నారు. ప్రభుత్వ పాఠశాలలో విద్యను అభ్యసిస్తున్న విద్యార్థిని విద్యార్థులకు నూతన పరిజ్ఞానంతో కూడిన విద్యా బోధన ను, కార్పొరేట్ స్థాయి పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలో విద్యను అందించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏ టి డి ఓ క్షేత్రయ్య, తహసిల్దార్ జగదీశ్వర్, ఎం పి డి ఓ కుమార్ యాదవ్, పాఠశాల ప్రధానో ఉపాధ్యాయులు ఈసం రమేష్, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.
……………………………………………….