
* ఎలాన్ మస్క్ కొత్త పార్టీ ప్రకటన
* ఇకపై అమెరికాలో ‘ త్రి ‘ పార్టీ పోరు
* సరికొత్త రాజకీయ క్రీడకు మస్క్ నాంది
* శత్రువైన మిత్రుడిపై కోపం..
* ట్రంప్‌ను గద్దె దించేందుకు మస్క్ ఎత్తులు
* మధ్యంతర ఎన్నికలు తప్పవా?
* అసలు మస్క్ ను దేశంలోనే లేకుండా చేసేందుకు ట్రంప్ ప్లాన్
* ప్రస్తుత అధ్యక్షుడి ఎత్తులు పారేనా?
* రసవత్తరంగా అమెరికా రాజకీయం
ఆకేరు న్యూస్, ప్రత్యేక ప్రతినిధి
అగ్రరాజ్యం అమెరికాలో సరికొత్త రాజకీయ క్రీడ ప్రారంభమైంది. మరోకొత్త పార్టీ ఆవిష్కృతం కాబోతోంది. రిపబ్లికన్, డెమొక్రాట్లకు ప్రత్యామ్నాయంగా మూడో రాజకీయ పార్టీ ఆవిర్భవించింది. అపర కుబేరుడు, టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ (Elon Musk) అన్నట్లుగానే అంత పనీ చేశారు. మస్క్ కు శత్రువుగా మారిన మిత్రుడు, ప్రస్తుత అధ్యక్షుడు ట్రంప్ పై కోపంతో రాజకీయ రంగ ప్రవేశం చేశారు. ది అమెరికా పేరుతో పార్టీని ప్రకటించారు. అంతేకాదు.. వచ్చే అధ్యక్ష ఎన్నికల వరకు ఆగక ముందే ట్రంప్‌ను గద్దె దించేందుకు ఎత్తులు వేస్తున్నారు. కొత్త పార్టీ ప్రకటనలోనే 2026 మధ్యంతర ఎన్నికల్లో తమ పార్టీ పోటీ చేస్తుందని పేర్కొనడమే అందుకు నిదర్శనంగా కనిపిస్తోంది. 2024 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్‌ను అధికారంలోకి తెచ్చేందుకు విశేషంగా కృషి ఎలాన్ మస్క్ కొత్త పార్టీ పెట్టడానికి కారణాలేంటి? ట్రంప్, మస్క్ మధ్య వివాదం ఎలా మొదలైంది.? అమెరికా రాజకీయ ముఖచిత్రం మున్ముందు ఎలా ఉండబోతోంది.. ఆకేరు న్యూస్ ప్రత్యేక కథనం..
ట్రంప్ ను అధికారంలోకి తెచ్చేందుకు..
వాస్తవానికి డొనాల్డ్ ట్రంప్, ఎలాన్ మస్క్ మధ్య బంధం చాలా బలమైనది. స్నేహపూర్వకమైనది. ఆర్థిక, వాణిజ్య దిగ్గజాలైన ఇద్దరూ గత అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో కలిసి మెలిసి తిరిగారు. ట్రంప్ గెలుపు కోసం ఎలాన్ మస్క్ విస్తృతంగా ప్రచారం చేశారు. ఎంతో విలువైన తన సమయాన్ని కేటాయించారు. 2024 ఎన్నికల సమయంలో ట్రంప్‌కు మద్దతుగా నిలిచారు. ఆయన మళ్లీ అధికారంలోకి రావడం కోసం ఏకంగా 250 మిలియన్ డాలర్లు (సుమారు 2,137 కోట్ల రూపాయలు) ఖర్చు చేసినట్లుగా తెలుస్తోంది. ట్రంప్ కూడా ఎలాన్ మస్క్ కు ప్రాధాన్యం ఇచ్చారు. గెలిచిన అనంతరం ఆయనను డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫీషియెన్సీ (డోజ్) అధిపతిగా నియమించారు.
ట్రంప్-మస్క్.. ఎందుకు చెడింది..
దోస్త్ మేరా దోస్త్ తు హై మేరీ జాన్.. వాస్తవం రా దోస్తు.. నువ్వే నా ప్రాణం అన్నట్లుగా అధ్యక్ష ఎన్నికల ముందు ట్రంప్-మస్క్ బంధం ఉండేది. మే నెలలో ప్రభుత్వానికి దూరంగా జరగడంతో పాటు వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్లు విషయంలో ట్రంప్ ను ఎలోన్ మస్క్ బహిరంగంగా విమర్శించారు. ఈ బిల్లు జాతీయ ఆర్థిక వ్యవస్థకు ఆత్మహత్యాసదృశమని అన్నారు. ఇది ప్రభుత్వ వ్యయం, అసమర్థతను ప్రోత్సహిస్తుందన్నారు. ఇది టెక్ కంపెనీలు, స్టార్టప్ లపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుందని మండిపడ్డారు. దీనికి ప్రతిస్పందనగా, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా మస్క్ ను హెచ్చరించారు. మస్క్ కంపెనీలకు ఇచ్చే ఫెడరల్ సబ్సిడీని రద్దు చేస్తామని బెదిరించాడు. మస్క్ ఇమ్మిగ్రేషన్ స్థితిపై దర్యాప్తు చేస్తామని కూడా ఆయన హెచ్చరించారు. దీంతో ‘వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్లు’ను (Big Beautiful Bill) ఆమోదించిన మరుక్షణమే తాను రాజకీయ పార్టీని ఏర్పాట్లు చేస్తానని మస్క్ ప్రకటించారు. ఆ బిల్లును అమెరికా ఉభయ సభలు ఆమోదించడం, ట్రంప్ ఆ బిల్లుపై సంతకం చేయడం, అది చట్టం రూపం దాల్చడంతో ‘ది అమెరికా పార్టీ’ ని (The America Party) ఏర్పాటు చేస్తున్నట్లు మస్క్ ప్రకటించారు.
రసవత్తరంగా రాజకీయం
ఎలాన్ మస్క్ కొత్త పార్టీ ప్రకటనతో అమెరికాలో రాజకీయం రసవత్తరంగా మారింది. అమెరికా సంయుక్త రాష్ట్రాల రాజకీయాలు ఒక సమాఖ్య రాజ్యాంగ గణతంత్ర వ్యవస్థగా ఉంటాయి. ఇక్కడ అధ్యక్షుడు, కాంగ్రెస్ (సెనేట్, కాంగ్రెస్ ఆఫ్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్) మరియు న్యాయవ్యవస్థ అధికారాలను పంచుకుంటారు. సమాఖ్య ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలతో సార్వభౌమత్వాన్ని పంచుకుంటుంది. లిబరల్ ప్రజాస్వామ్య సూత్రాలపై ఆధారపడిన రాజ్యాంగం ఉంది. ఉదారవాద ప్రజాస్వామ్యం, పెట్టుబడిదారీ విధానం చుట్టూ తిరుగుతాయి. ఇప్పటి వరకు డెమోక్రటిక్, రిపబ్లికన్ పార్టీలే ప్రధాన రాజకీయ పార్టీలుగా ఉన్నాయి. ఇతర పార్టీలు కూడా ఉన్నప్పటికీ నామమాత్రం. ఇప్పుడు ఎలాన్ మస్క్ ది అమెరికా పార్టీ ఏర్పాటుతో ఇకపై అమెరికాలో ‘ త్రి ‘ పార్టీ పోరు ఉండనుంది.
మధ్యంతర ఎన్నికలా.. ఎలానే ఔటా?
సాధారణంగా ప్రతీ నాలుగు సంవత్సరాలకు అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు జరుగుతాయి. 2024లోనే గత ఎన్నికలు జరిగాయి. ప్రస్తుతం ప్రజాస్వామ్యం లేదని, ప్రజలకు స్వేచ్ఛ ఇచ్చేందుకే పార్టీ ఏర్పాటు చేశానని ప్రకటించిన మస్క్ 2026 మధ్యంతర ఎన్నికల్లో పార్టీ పోటీస్తుందని, 2 లేదా మూడు సెనేట్ సీట్లు, 8 నుంచి 10 ప్రతినిధుల స్థానాలపై ది అమెరికా పార్టీ లేజర్ ఫోకస్ చేస్తుందని ప్రకటించారు. అలాగే, జూలై 4 అమెరికా స్వాత్రంత్య దినోత్సవం రోజున పార్టీ వ్యవస్థాపనపై మస్క్ నిర్వహించిన పోల్ లో 1.2 మిలియన్ల మంది పాల్గొన్నారు. వారిలో 65.4 శాతం మంది మస్క్ పార్టీకి ఓటు వేశారు. 34.6 మంది వ్యతిరేకించారు. పోల్‌లో పాల్గొన్నవారిలో మెజారిటీకి మించి కొత్త పార్టీకి ఓటు వేసిన నేపథ్యంలో 2028 వరకు ఆగకుండా అంతలోనే ట్రంప్ ను దించేందుకు అపర కుబేరుడైన ఎలాన్ మస్క్ ఎత్తులు వేస్తున్నారని కథనాలు వెలువడుతున్నాయి. మరి ట్రంప్ ఏమైనా తక్కువ వాడా? ఏకంగా ఎలాన్ మస్క్ ను అసలు దేశంలోనే లేకుండా చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. మస్క్ రాజకీయంగా బలోపేతం అయ్యేలోపే.. అతడి ఆర్థిక మూలాలపై దెబ్బకొట్టాలని ప్లాన్ చేస్తునట్లు తెలుస్తోంది. గతంలోనే ట్రంప్ మాట్లాడుతూ అమెరికా ప్రభుత్వం నుంచి సబ్సిడీలు నిలిపివేస్తే దెబ్బకు సౌత్ ఆఫ్రికా వెళ్లిపోతాడంటూ మస్క్ ను ఉద్దేశించి ఓ సందర్భంలో వ్యాఖ్యానించారు. ఈక్రమంలో ఇద్దరు సమఉజ్జీల మధ్య పోరు ఎటు దారి తీస్తుందో, అలాగే అమెరికన్లకు కలిసి వస్తుందా, శాపంగా మారుతుందా అన్న ఉత్కంఠ ఏర్పడింది.
………………………………………………………