Supreme Court directs Karnataka to release Cauvery water to Tamil Nadu
* కర్ణాటక ప్రభుత్వానికి సుప్రీంకోర్టు ఆదేశం
* అథారిటీ ఆదేశాలు పాటించాల్సిందేనని వెల్లడి
ఆకేరు న్యూస్, డెస్క్ : కావేరీ జలాల పంపిణీకి సంబంధించి తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల మధ్య నడుస్తున్న వివాదాల నేపథ్యంలో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఇరు రాష్ట్రాల వాదనలు విన్న ధర్మాసనం 15 రోజులపాటు ప్రతిరోజూ తమిళనాడుకు 12వేల క్యూసెక్కుల కావేరీ జలాలను విడుదల చేయాలని ఆదేశించింది. కర్ణాటక ప్రభుత్వం కావేరీ వాటర్ మేనేజ్మెంట్ అథారిటీ ఆదేశాలను పాటించాల్సిందే అని పేర్కొంది. సుప్రీంకోర్టు తాజా తీర్పుతో కర్ణాటక ప్రభుత్వానికి షాక్ తగిలినట్లు అయింది. మరోవైపు విజయ్ ప్రభుత్వానికి ఊరట లభించినట్లుగా మారింది.
* ఇదీ వివాదం
తమిళనాడులోని కావేరీ డెల్టా ప్రాంతంలో పంటల సాగు మరియు తాగునీటి అవసరాల దృష్ట్యా తగినంత నీటిని విడుదల చేయడం లేదంటూ తమిళనాడు ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. నీటి కొరత కారణంగా తమ రాష్ట్రంలోని రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని వాదించింది. తక్షణమే తమకు 4.536 టీఎంసీల నీరు విడుదల చేసేలా ఆదేశాలు జారీ చేయాలని ధర్మాసనాన్ని అభ్యర్థించింది. కావేరీ జలాల నిర్వహణ ప్రాధికార సంస్థ జూలై 30న ఇచ్చిన ఆదేశాలను కర్ణాటక పాటించేలా చూడాలని కోరుతూ తమిళనాడు ప్రభుత్వం ఆగస్టు 3న సుప్రీంకోర్టును ఆశ్రయించింది. కపిల (కబిని), కృష్ణరాజసాగర్ జలాశయాల నుంచి రోజూ 3,500 క్యూసెక్కుల చొప్పున 15 రోజుల పాటు నీటిని విడుదల చేయాలని అథారిటీ కర్ణాటకను ఆదేశించిందని ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లింది.
* న్యాయస్థానం తీర్పు
తమిళనాడు, కర్ణాటక ప్రభుత్వాల వాదనలను విన్న సుప్రీంకోర్టు, కావేరీ అథారిటీ నిబంధనలను పాటించడం కర్ణాటక బాధ్యత అని స్పష్టం చేసింది. అథారిటీ జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం 15 రోజుల పాటు ప్రతిరోజూ 12 వేల క్యూసెక్కుల నీటిని తమిళనాడుకు పంపాలని తుది ఆదేశాలు జారీ చేసింది. మరోవైపు, కర్ణాటక ప్రభుత్వం తమ వద్ద నీటి లభ్యత తక్కువగా ఉందంటూ అభ్యంతరం వ్యక్తం చేసింది. వర్షాభావ పరిస్థితుల వల్ల కృష్ణరాజసాగర్ , కబిని తదితర జలాశయాల్లో నీటి మట్టాలు పడిపోయాయని, తమ సొంత తాగునీరు మరియు వ్యవసాయ అవసరాలకే నీరు చాలడం లేదని కోర్టు దృష్టికి తీసుకెళ్లింది. అథారిటీ సూచించిన ప్రకారం తాము ఇప్పటికే తమిళనాడుకు నీటిని విడుదల చేస్తున్నామని, కోర్టు ఆదేశాలను గౌరవిస్తామని తెలిపింది.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
