Rayaparthy
Rayaparthy| ఆకేరు న్యూస్, రాయపర్తి: నేటి విద్యార్థులే భావి భారత నిర్మాణంలో కీలక పాత్ర పోషించాలని రాయపర్తి తహసిల్దార్ ముల్కనూరి శ్రీనివాస్ అన్నారు. రాయపర్తి మండలం కొత్తూరు గ్రామంలోని జెడ్పీ ఉన్నత పాఠశాల ప్రాంగణంలో మంగళవారం ‘స్వచ్ఛత హి సేవా’ కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి తహసిల్దార్ ముల్కనూరి శ్రీనివాస్, ఎంపీడీవో పాక శ్రీనివాసులు, ఎంపీవో కూచన ప్రకాష్, గ్రామ సర్పంచ్ కందికట్ల స్వప్న సంతోష్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా తహసిల్దార్ శ్రీనివాస్ మాట్లాడుతూ.. పరిసరాల పరిశుభ్రతను కేవలం కార్యక్రమానికే పరిమితం చేయకుండా ప్రతి ఒక్కరూ తమ జీవనశైలిలో భాగం చేసుకోవాలని సూచించారు. చిన్నతనం నుంచే విద్యార్థుల్లో పరిశుభ్రతపై అవగాహన కల్పిస్తే స్వచ్ఛమైన సమాజాన్ని నిర్మించవచ్చన్నారు. పాఠశాలలతో పాటు తమ గ్రామాలను పరిశుభ్రంగా ఉంచడంలో విద్యార్థులు, యువత ముందుండాలని పిలుపునిచ్చారు.
ఎంపీడీవో పాక శ్రీనివాసులు మాట్లాడుతూ.. గ్రామాల అభివృద్ధికి పరిశుభ్రత ఎంతో ముఖ్యమన్నారు. ‘స్వచ్ఛత హి సేవా’ స్ఫూర్తితో ప్రతి ఒక్కరూ కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలని కోరారు. చెత్తను బహిరంగ ప్రదేశాల్లో వేయకుండా తడి, పొడి చెత్తగా వేరు చేసి గ్రామ పంచాయతీ సిబ్బందికి అందించాలని సూచించారు. ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించి పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని తెలిపారు.
అనంతరం పాఠశాల ప్రాంగణంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు, గ్రామ పంచాయతీ సిబ్బంది, ప్రజాప్రతినిధులు శ్రమదానం నిర్వహించారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయ బృందం, విద్యార్థినీ విద్యార్థులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
