Warangal Development Works Review
* ఖాజీపేట దర్గా ఉర్స్ ఉత్సవాలకు ఏర్పాట్లు చేయాలి
అకేరు న్యూస్ వరంగల్ : గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ టి. వెంకన్న శనివారం నగరంలో కొనసాగుతున్న, చేపట్టబోయే పలు అభివృద్ధి పనులను ఇంజినీరింగ్ అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఆయా పనుల పురోగతిని సమీక్షిస్తూ, నాణ్యతతో పాటు నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని అధికారులకు సూచించారు.
ముందుగా హనుమకొండ బస్ స్టేషన్ పునరుద్ధరణ పనులను పరిశీలించిన కమిషనర్, ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేలా పనులను వేగవంతం చేయాలని ఆదేశించారు. అవసరమైన సాంకేతిక సూచనలు చేస్తూ, పనుల నాణ్యతలో ఎలాంటి రాజీ ఉండరాదని స్పష్టం చేశారు.
జవహర్లాల్ నెహ్రూ స్టేడియం పరిసరాలను సందర్శించి, జేబీఎస్ బస్ స్టేషన్ వద్ద పెరుగుతున్న ట్రాఫిక్‌ను దృష్టిలో ఉంచుకుని స్టేడియం రహదారి విస్తరణ పనులను పరిశీలించారు. ట్రాఫిక్ సమస్యకు శాశ్వత పరిష్కారం లభించేలా రహదారి విస్తరణ పనులను త్వరితగతిన చేపట్టేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు.
హనుమకొండ అశోక థియేటర్ ఎదురుగా ప్రతిపాదించిన మల్టీ లెవల్ పార్కింగ్ స్థలాన్ని పరిశీలించిన కమిషనర్, టెండర్ ప్రక్రియను త్వరగా పూర్తి చేసి, పనులను వెంటనే ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
ఆగస్టు నెలలో నిర్వహించనున్న ఖాజీపేట దర్గా ఊర్స్ ఉత్సవాల నేపథ్యంలో కమిషనర్ వెంకన్న, దర్గా పీఠాధిపతి అఫ్జల్ బియాబానీ ఖుస్రో పాషాతో కలిసి దర్గా ప్రాంగణం, పరిసర ప్రాంతాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఉత్సవాల సందర్భంగా భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా తాగునీరు, పారిశుద్ధ్యం, విద్యుత్ వెలుగులు, రహదారుల మరమ్మతులు, ఇతర మౌలిక సదుపాయాలను ముందస్తుగా పూర్తి చేయాలని ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు.
ఈ పరిశీలనలో సూపరింటెండింగ్ ఇంజనీర్ రాజ్‌కుమార్, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ రవికుమార్, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ రాజ్ కుమార్, అసిస్టెంట్ ఇంజనీర్లు, తదితరులు పాల్గొన్నారు.
