Minister Seethakka
* మంత్రి సీతక్క
Minister Seethakka| ఆకేరు న్యూస్, ములుగు: రైతులు పండించిన ధాన్యం, ఇతర వ్యవసాయ ఉత్పత్తులను సురక్షితంగా నిల్వ చేసేందుకు ప్రభుత్వం గోదాముల నిర్మాణానికి ప్రాధాన్యం ఇస్తోందని రాష్ట్ర మంత్రి దనసరి అనసూయ సీతక్క అన్నారు. బుధవారం తాడ్వాయి మండల కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర గిడ్డంగుల సంస్థ ఆధ్వర్యంలో రూ.7 కోట్ల వ్యయంతో నిర్మించనున్న 10 వేల మెట్రిక్ టన్నుల సామర్థ్య గోదాముకు ఐటీడీఏ పీవో లెనిన్ వత్సల్ టోప్పోతో కలిసి ఆమె భూమిపూజ చేశారు.
ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ.. నిల్వ సదుపాయాలు లేక రైతులు ధాన్యాన్ని రహదారులపై ఆరబెట్టాల్సి వస్తోందని, అకాల వర్షాలతో పంటలు తడిసి నష్టపోయే పరిస్థితులు ఎదురవుతున్నాయని తెలిపారు. రైతుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని గోదాము నిర్మిస్తున్నట్లు చెప్పారు. మరో గోదాము నిర్మాణానికి కూడా ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు వెల్లడించారు.
నిర్మాణ పనులను వేగంగా పూర్తి చేసి ఆరు నెలల్లో రైతులకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. నాణ్యతా ప్రమాణాలను తప్పనిసరిగా పాటించాలని సూచించారు.
గిరిజన ఆవాసాలు, ఎస్సీ కాలనీల్లో మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని మంత్రి తెలిపారు. మారుమూల గూడాల్లో విద్యుత్, తాగునీటి సౌకర్యాల కోసం సౌర విద్యుత్ వ్యవస్థలను ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. మహిళా సంఘాలు ముందుకొస్తే 5 నుంచి 10 ఎకరాల్లో సౌర విద్యుత్ కేంద్రాల ఏర్పాటుకు సహకరిస్తామని, తద్వారా సంఘాలకు నెలకు రూ.5 లక్షల వరకు ఆదాయం వచ్చేలా చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు.
ఉపాధి హామీ పథకం కింద గ్రామ పంచాయతీల వారీగా ప్రజలకు ఉపయోగపడే పనులను చేపట్టేందుకు అవకాశం కల్పిస్తున్నట్లు సీతక్క వెల్లడించారు. జల సంరక్షణ, ఇంకుడు గుంతలు, వ్యవసాయ భూముల్లో పనులు, బోర్ల వద్ద నీటి పునరుద్ధరణ వంటి పనులకు ప్రాధాన్యం ఇవ్వాలని సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులకు సూచించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ బానోతు రవిచందర్, మార్కెట్ కమిటీ చైర్పర్సన్ రేగ కళ్యాణి, పంచాయతీరాజ్ డైరెక్టర్ సోమయ్య, అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
