
* ముదిరిన వరంగల్ కాంగ్రెస్ వార్
* ఇది మాకు అవమానంగా ఉంది..
* క్రమశిక్షణ కమిటీ ముందుకు కాంగ్రెస్ వరంగల్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు
* రచ్చపై తేల్చేందుకే రమ్మన్నాం : మల్లు రవి
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : కాంగ్రెస్ పార్టీ వరంగల్ జిల్లా నేతల మధ్య రగులుతున్న చిచ్చును ఆర్పేందుకు క్రమశిక్షణ కమిటీ ప్రయత్నాలు కొనసాగిస్తోంది. కయ్యానికి ఆజ్యం పోసిన కొండా మురళి(konda murali)ని ఇప్పటికే రెండు సార్లు పిలిచిన కమిటీ ఆయన నుంచి లిఖితపూర్వక వివరణ తీసుకుంది. ఇప్పుడు అనూహ్యంగా జిల్లా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను గాంధీభవన్ కు పిలిపించి వివరణ కోరింది. గురువారం హైదరాబాద్(Hyderabad) కు చేరుకున్న నేతలు క్రమశిక్షణ కమిటీ ఛైర్మన్ మల్లు రవితో భేటీ అయ్యారు. ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి(kadiam srihari), నాయిని రాజేందర్‌రెడ్డి,(nayini rajederreddy) రేవూరి ప్రకాశ్‌రెడ్డి, కేఆర్ నాగరాజు, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య(Mlc baswaraju sarayya), కుడా ఛైర్మన్ వెంకట్రామిరెడ్డి ఈ భేటీలో ఉన్నారు. కొండా మురళి వ్యవహారం చర్చించేందుకు కమిటీయే వీరిని పిలిచినట్లు తెలుస్తోంది. ఈక్రమంలో వీరు అసహనం వ్యక్తం చేశారని సమాచారం. కొండా మురళిపై చర్యలు తీసుకోవాల్సింది పోయి..తమను క్రమశిక్షణ కమిటీ ముందుకు పిలవడాన్ని అవమానంగా ఫీలవుతున్నట్లు కమిటీ చైర్మన్ వద్ద పేర్కొన్నారని సమాచారం. ఇదిలాఉండగా.. వరంగల్ జిల్లా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మరోసారి మురళిపై తమ నిరసన గళాన్ని విప్పారు. తమపై అనుచిత వ్యాఖ్యలు చేసిన మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి పైన, మంత్రి కొండా సురేఖ(Konda Surekha) పైన క్రమశిక్షణ చర్యలు తీసుకోవాల్సిందే అని పట్టుబట్టినట్లు తెలిసింది. ఆయన చేసిన వ్యాఖ్యలకు తాము వరంగల్ లో తలెత్తుకొని తిరగలేక పోతున్నామని వాపోయినట్లు సమాచారం. ఆయనపై క్రమశిక్షణ కమిటీ చర్యలు తీసుకోకుండా తమను పిలవడంలో ఆంతర్యం ఏమిటని వారు ప్రశ్నించారు. కాంగ్రెస్ అధిష్టానానికి తాము ముఖ్యమో కొండా ఫ్యామిలీ ముఖ్యమో తేల్చుకోవాలి అంటూ మరోసారి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మరోమారు అల్టిమేటం జారీ చేశారు. ఇదిలాఉండగా కమిటీ చైర్మన్ మల్లు రవి మాట్లాడుతూ అసలు ఏం జరిగిందో తెలుసుకునేందుకే వీరిని రమ్మన్నామని, నేతల మధ్య రచ్చను తేల్చేందుకే పిలిపించామని మల్లు రవి మీడియాతో పేర్కొన్నారు.
……………………………………………………….