
– ఎవరితో పెట్టుకున్నా టీచర్లతో పెట్టుకోవద్దు
– మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్
ఆకేరు న్యూస్, కమలాపూర్ : ప్రజల ఆలోచన విధానంను మార్చే సత్తా ఉపాధ్యాయులదే అని మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు. ఆదివారం కమలాపూర్ మండలంలో ఉమామహేశ్వర ఫంక్షన్ హాల్లో నిర్వహించిన ఉపాధ్యాయుడు అచ్చే మురళి పదవీ విరమణ కార్యక్రమంలో ఈటల రాజేందర్ పాల్గొని మాట్లాడారు. హుజూరాబాద్ కార్యకర్తలు 15 రోజులకు ఒకసారి నియోజకవర్గానికి వచ్చి పోవాల్సిందేనని హుకుం జారీచేశారనీ, అందుకే వస్తున్నానని అన్నారు.ఎవరితో పెట్టుకున్నా టీచర్లతో పెట్టుకోవద్దు అని, ప్రజల ఆలోచనలపై ముద్ర వేయగల శక్తి ఉన్నవారు టీచర్లనీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వ పాఠశాలల గురించి ఈ మధ్య ఎక్కువ చర్చ జరుగుతోందనీ, పిల్లలను ప్రైవేట్ పాఠశాలలకు కి పంపించిన తల్లిదండ్రులు అప్పులపాలై మళ్లీ ప్రభుత్వ పాఠశాలలవైపే చూస్తున్నారన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న పిల్లలు సరిగ్గా చదువుకోకపోతే సమసమాజం సాధ్యం కాదని పేదరికం పోదనీ ఆయన అన్నారు.భూమి ఉన్న అన్ని గవర్నమెంట్ స్కూల్స్ ను సెమీ రెసిడెన్షియల్ స్కూల్స్ గా అప్ గ్రేడ్ చేయాలని అన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పిల్లల్లో ఉండే సామాజిక స్పృహ, మానవ సంబంధాలు, ఏదన్నా చేయాలనే తపన కాన్వెంట్ స్కూల్స్ లో చదివే పిల్లలకు ఉండదన్నారు.గవర్నమెంట్ స్కూల్ విద్యార్థులు జీవితాంతం వారి గురువుల్ని గుర్తుపెట్టుకుంటారన్నారు. ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేయడానికి తన వంతు కృషి చేస్తానని అన్నారు.
………………………………