* ఇచ్చిన హామీల అమలుకు కేంద్ర సహకారం కోసం వినతులు
* కేంద్రమంత్రులతో భేటీలు
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Telangana CM Revanth Reddy) ఇచ్చిన హామీల అమలుకోసం విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. రైతు రుణమాఫీతో సంచలనం సృష్టించిన రేవంత్.. మిగతా హామీల అమలుకోసం కేంద్ర సహకారం కోసం కూడా ప్రయత్నిస్తున్నారు. ఈమేరకు ఢిల్లీలో బిజీబిజీగా గడుపుతున్నారు. కేంద్ర మంత్రులతో వరుసగా భేటీ అయ్యారు. పెట్రోలియం, సహజ వాయువుల శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరీ (Natural Gas Minister Hardeep Singh Puri) ని కలిసి, రూ. 500కే గ్యాస్ సిలిండర్ పథకం గురించి చర్చించారు. వినియోగదారులకు ఇచ్చే రాయితీని ముందుగానే ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలకు చెల్లించే అవకాశాన్ని కల్పించాలని కేంద్రమంత్రికి విజ్ఞప్తి చేశారు. అనంతరం జల్‌శక్తి మంత్రి సీఆర్ పాటిల్ (Jal Shakti Minister CR Patil) తో సమావేశమై.. మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్కి సహకరించాలని కోరారు. హైదరాబాద్ (Hyderabad) లోని మురికి నీరు అంతా మూసీలో చేరుతోందని, దానిని శుద్ధి చేయాలని సంకల్పించినట్లు కేంద్రమంత్రికి తెలిపారు. జాతీయ నది పరిరక్షణ ప్రణాళిక కింద మూసీలో మురికి నీటి శుద్ధి పనుల కోసం 4 వేల కోట్లు కేటాయించాలని కోరారు. ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్‌ను గోదావరి నీటితో నింపే పనుల కోసం 6 వేల కోట్లు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. దీంతో హైదరాబాద్ ప్రజలకు నీటికష్టాలు తీరుతాయన్నారు. 2019లో జల్ జీవన్ మిషన్ ప్రారంభమైనా… తెలంగాణకు ఈ పథకం కింద నిధులు ఇవ్వలేదన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఇటీవల శేరిలింగంపల్లి నియోజకవర్గంలో ఫ్లైఓవర్‌ను ప్రారంభించిన అనంతరం మాట్లాడిన రేవంత్.. మూసీ పరీవాహక అభివృద్ధికి లక్షన్నర కోట్లు వెచ్చిస్తామని ప్రకటించారు. ఈవిషయమై ఆయన కేంద్రంతో కూడా చర్చలు జరుపుతున్నారు.
——————