* వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో పలు అంశాలపై చర్చ
* అన్ని జిల్లాల్లో కంట్రోల్రూంల ఏర్పాటుకు ఆదేశాలు
* సీఎం పర్యవేక్షిస్తున్నారని సూచన
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : కొద్దిరోజులుగా కురుస్తున్న వర్షాలు.. మరో మూడు రోజుల పాటు వర్షాలు కొనసాగుతాయన్న వాతావరణ శాఖ హెచ్చరికల (Warnings of the Department of Meteorology) నేపథ్యంలో ప్రభుత్వం అప్రమత్తమైంది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి (Shantikumari, Chief Secretary to Govt) కలెక్టర్ల (Collectors) తో సమావేశమయ్యారు. వారం రోజులుగా విస్తారంగా కురుస్తున్న వర్షాలపై సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy)సమీక్షిస్తున్నారని, ఎక్కడా ప్రాణ, ఆస్తినష్టం లేకుండా జాగ్రత్త వహించాలని కలెక్టర్లను హెచ్చరించారు. ప్రభావిత ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించాలని, ఇందుకు అవసరమైన సహకారాలు అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు.
ప్రధానంగా పోలీస్ (Police), ఇరిగేషన్ (Irrigation), పంచాయతీరాజ్ (Panchayat Raj), అగ్నిమాపక శాఖ (Fire Department), ఎన్డీఆర్ఎఫ్ (NDRF), ఎస్డీఆర్ఎఫ్ (SDRF) శాఖలు అలర్ట్ (Alert) గా ఉండాలని, సమన్వయంతో పని చేయాలని కలెక్టర్లకు సూచించారు. వర్షాలకు చెరువులు కుంటలు నిండాయని.. తెగకుండా ముందుజాగ్రత్త చర్యలు తీసుకోవాలన్నారు. ముందుజాగ్రత్తగా భద్రాద్రి కొత్తగూడెం (Bhadradri Kothagudem), ములుగు జిల్లా (Mulugu district)ల్లో ఎన్డీఆర్ఎఫ్ టీం (NDRF teams) లను ఏర్పాటు చేశామన్నారు. అన్ని జిల్లాల్లో ప్రత్యేకంగా కంట్రోల్ రూమ్ (Control room) లను ఏర్పాటు చేసుకోవాలన్నారు. పారే వాగులను ఎవరూ దాటకుండా ఆయా ప్రాంతాలలో తగు బందోబస్తు ఏర్పాటు చేయాలని చెప్పారు.
భద్రాచలం వద్ద మూడో ప్రమాద హెచ్చరిక
సమావేశంలో పాల్గొన్న డీజీపీ జితేందర్ (DGP Jitender) మాట్లాడుతూ రాష్ట్రంలోని అందరు పోలీస్ కమిషనర్లు (Police Commissioners), ఎస్పీలు (SPs), కలెక్టర్ల (Collectors) తో పాటు ఇతర అధికారులతో సమన్వయం చేస్తూ పని చేస్తున్నారన్నారు. ఇప్పటివరకు అవాంఛనీయ సంఘటనలు జరుగలేదని, పోలీస్ అధికారులందరూ క్షేత్రస్థాయిలో పర్యవేక్షిస్తున్నారన్నారు. ప్రణాళికాశాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ సుల్తానియా (Planning Department Principal Secretary Sandeep Sultania) మాట్లాడుతూ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మరో మూడు రోజుల పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. భద్రాచలం వద్ద ఇప్పటికే రెండవ ప్రమాద హెచ్చరికను జారీ చేశామని.. 53 అడుగులకు చేరితే మూడో ప్రమాద హెచ్చరికను జారీ చేయనున్నట్లు భద్రాద్రి కొత్తగూడెం కలెక్టర్ చెప్పారు. ఇప్పటికే జిల్లాల్లో దెబ్బతిన్న నివాస గృహాలు, ఇతర నష్టాలపై ప్రభుత్వానికి ప్రాథమిక నివేదిక సమర్పిస్తున్నామని తెలిపారు.
ముంపు నేపథ్యంలో ముందస్తు చర్యలు
సమావేశంలో పాల్గొన్న పలువురు కలెక్టర్లు మాట్లాడుతూ వరదల నేపథ్యంలో తీసుకున్న ముందస్తు చర్యలను వివరించారు. ములుగు జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ దాదాపు వంద కిలోమీటర్ల విస్తీర్ణంలో ములుగు జిల్లాలో గోదావరి పరీవాహక ప్రాంతం ఉందని, 77 గ్రామాలను సమస్యాత్మక గ్రామాలుగా గుర్తించి ముందస్తు జాగ్రత్తలను చేపట్టామని చెప్పారు. అధికారులంతా క్షేత్రస్థాయిలోనే ఉండి పరిస్థితులకు అనుగుణంగా తక్షణ చర్యలు చేపడుతున్నామని వివరించారు.
———————-