Telangana Seed Fairs 2026
* రేపటి నుంచే రైతు వేదికల్లో విత్తన మేళాల సందడి
* జూన్ 23 నుండి 30 వరకు రాష్ట్రవ్యాప్తంగా విత్తన పండుగ
* ఎల్‌నినో ముప్పున్నా దిగుబడులకు ఢోకా లేదు.. 2,601 రైతు వేదికల్లో విత్తన మేళాలు ప్రారంభం!
* ఒకే వేదికపై నాణ్యమైన విత్తనాలు..
* ఎంపిక చేసిన ఏడు రకాల వరిసన్నరకాలు పప్పుధాన్యాలు, నూనెగింజలు, చిరుధాన్యాల,కూరగాయ విత్తనాలు రైతులకు అందుబాటులో
ఆకేరు న్యూస్, కమలాపూర్:
ఎల్‌నినో ముప్పు, వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో అన్నదాతలకు అండగా నిలిచేందుకు తెలంగాణ ప్రభుత్వం సరికొత్త కార్యాచరణతో ముందుకు వచ్చింది. ప్రస్తుత వాతావరణ సవాళ్లను తట్టుకుని, తక్కువ నీటితో అధిక దిగుబడులు సాధించే ఆరుతడి పంటలను ప్రోత్సహించే లక్ష్యంతో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 2,601 రైతు వేదికల్లో జూన్ 23 నుండి 30 వరకు ఘనంగా విత్తన మేళాలు నిర్వహించనున్నారు. నాణ్యమైన విత్తనం – అధిక దిగుబడికి పునాది అనే నినాదంతో వ్యవసాయ శాఖ ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది.
ఈ మేళాల ద్వారా రైతులకు అవసరమైన అన్ని రకాల నాణ్యమైన, ధ్రువీకరించిన విత్తనాలను ఒకే వేదికపై, అత్యంత సరసమైన ధరలకే అందుబాటులో ఉంచనున్నారు. మార్కెట్ డిమాండ్‌కు అనుగుణంగా బీపీటీ–5204, ఆర్ఎన్ఆర్–15048 (తెలంగాణ సోనా), జైశ్రీరామ్, కేఎన్ఎం–1638, కేఎన్ఎం –7715, డబ్ల్యూజీఎల్–44, హెచ్ఎంటీ సోనా వంటి ప్రముఖ ఏడు రకాల వరి సన్నరకాలతో పాటు పెసర, మినుము, కంది వంటి పప్పుధాన్యాలు, నువ్వులు, వేరుశెనగ వంటి నూనెగింజలు, వివిధ రకాల చిరుధాన్యాలు, కూరగాయల విత్తనాలను సిద్ధం చేశారు. వీటితో పాటు ఆధునిక వ్యవసాయంలో కీలకమైన నానో యూరియా, నానో డీఏపీ వంటి ఎరువులను కూడా ఇక్కడ విక్రయించనున్నారు.
కేవలం విత్తనాల అమ్మకాలకే పరిమితం కాకుండా, ఈ ఎనిమిది రోజుల పాటు వ్యవసాయ, ఉద్యానవన శాఖల అధికారులు, శాస్త్రవేత్తలు రైతులకు అందుబాటులో ఉండి ప్రత్యేక అవగాహన సదస్సులు నిర్వహిస్తారు. ఎల్‌నినో పరిస్థితుల్లో తక్కువ నీటితో సాగు చేయగల ప్రత్యామ్నాయ పంటల ఎంపిక, విత్తన శుద్ధి, సమగ్ర పోషక, నీటి యాజమాన్యం, చీడపీడల నివారణపై రైతులకు అమూల్యమైన మార్గదర్శకాలను అందించనున్నారు. రాష్ట్రంలోని రైతాంగమంతా ఈ సువర్ణావకాశాన్ని సద్వినియోగం చేసుకొని, శాస్త్రీయ పద్ధతుల్లో సాగు చేస్తూ అధిక లాభాలు గడించాలని వ్యవసాయ సంచాలకులు డాక్టర్ బి. గోపి (ఐఏఎస్) పిలుపునిచ్చారు.
Please tell us what is wrong. Your report will be sent to the website team.
