* 15 రోజుల్లో పరకాలను క్లీన్ సిటీగా తీర్చిదిద్దుతాం
* 2027 డిసెంబర్ నాటికి అన్ని వార్డుల్లో సీసీ రోడ్లు, డ్రైనేజీల నిర్మాణమే లక్ష్యం
– ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి
అకేరు న్యూస్, పరకాల: పట్టణాన్ని ప్రత్యేక కార్యాచరణతో 15 నుంచి 20 రోజుల్లో క్లీన్ సిటీగా తీర్చిదిద్దేందుకు అన్ని శాఖల సమన్వయంతో ప్రత్యేక డ్రైవ్ చేపడుతున్నట్లు పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి తెలిపారు. వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకొని పారిశుద్ధ్యం, తాగునీటి సరఫరా, మురుగు నీటి పారుదల, అభివృద్ధి పనులపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు.
శనివారం పరకాల మున్సిపల్ కార్యాలయంలో నిర్వహించిన పురపాలక సంఘం సమావేశంలో ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ పావుశెట్టి సునీల్ కుమార్, హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయి, మున్సిపల్ కమిషనర్ పోతరాజు పవన్, కౌన్సిలర్లు పాల్గొన్నారు.
సమావేశంలో కౌన్సిలర్లు తమ వార్డుల అభివృద్ధి పనులు, పారిశుద్ధ్య నిర్వహణ, సిబ్బంది కొరత, డ్రైనేజీ సమస్యలు, తాగునీటి సరఫరా తదితర అంశాలను ప్రస్తావించారు. సభ్యులు లేవనెత్తిన సమస్యలపై ఎమ్మెల్యే, జిల్లా కలెక్టర్ స్పందించి సంబంధిత అధికారులకు తక్షణ చర్యలు చేపట్టాలని సూచించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, 2027 డిసెంబర్ నాటికి పరకాల పట్టణంలోని అన్ని వార్డుల్లో సీసీ రోడ్లు, డ్రైనేజీల నిర్మాణాన్ని పూర్తి చేయడమే లక్ష్యంగా పనిచేస్తామని తెలిపారు. స్లమ్ ప్రాంతాల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తూ జీ ప్లస్–2 విధానంలో ఇళ్ల నిర్మాణానికి చర్యలు తీసుకుంటామని, ఇందుకు ప్రజాప్రతినిధులు పూర్తి సహకారం అందించాలని కోరారు.
మున్సిపల్ సిబ్బంది హాజరు పర్యవేక్షణ కోసం రెండు బయోమెట్రిక్ యంత్రాలను వెంటనే కొనుగోలు చేయాలని, ప్రస్తుతం ఉన్న యంత్రాన్ని మరమ్మతు చేయించాలని ఆదేశించారు. ప్రతి ఉద్యోగి తప్పనిసరిగా బయోమెట్రిక్ ద్వారా హాజరు నమోదు చేయాలని స్పష్టం చేశారు.
వర్షాకాలంలో ఎక్కడా మురుగు నీరు నిల్వ ఉండకుండా చర్యలు చేపట్టాలని, అవసరమైన చోట్ల డ్రైనేజీ నిర్మాణానికి డీపీఆర్‌లు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. మురుగు నీరు, డ్రైనేజీ సమస్యలు ఉన్న ప్రాంతాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి వెంటనే పరిష్కరించాలని సూచించారు.
ప్రతి నెల అన్ని విభాగాల పనితీరును మున్సిపల్ కమిషనర్ సమీక్షించాలని, మున్సిపల్ కార్యాలయంపై సోలార్ విద్యుత్ వ్యవస్థ ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఎమ్మెల్యే సూచించారు.
సమావేశంలో పారిశుద్ధ్య నిర్వహణ పనుల కోసం రూ.4.68 లక్షల వ్యయానికి సభ్యులు ఆమోదం తెలిపారు. అదేవిధంగా మూడు స్వచ్ఛ ఆటోల కొనుగోలు, మున్సిపల్ కార్యాలయంపై సోలార్ పవర్ ఏర్పాటు ప్రతిపాదనలకు కూడా ఆమోదం లభించింది.
ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మిషన్ భగీరథ ద్వారా ప్రతి వార్డుకు నిరంతర తాగునీటి సరఫరా జరిగేలా చర్యలు చేపట్టాలని కమిషనర్‌కు ఎమ్మెల్యే ఆదేశించారు. మున్సిపల్ పన్నుల వసూళ్లను 90 శాతానికి పెంచేలా అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలని, తద్వారా కేంద్ర ప్రభుత్వ నిధులు అధికంగా పొందే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. ప్రజా సమస్యలపై అధికారులు వెంటనే స్పందించి పరిష్కారం చూపాలని సూచించారు.
ఎస్సీ కాలనీల్లో ఇంటి నంబర్లు లేని నివాస గృహాలకు ఇంటి నంబర్లు కేటాయించే ప్రక్రియపై ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాలని అధికారులను ఆదేశించారు. మార్కెట్, బస్టాండ్ ప్రాంతాల్లో ట్రాఫిక్ సమస్యల పరిష్కారానికి టౌన్ ప్లానింగ్, పోలీసు శాఖలు సమన్వయంతో చర్యలు తీసుకోవాలని సూచించారు.

* జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయి మాట్లాడుతూ..
మున్సిపల్ సిబ్బంది హాజరు కోసం రెండు బయోమెట్రిక్ యంత్రాలను కొనుగోలు చేయాలని కమిషనర్‌ను ఆదేశించారు. ఔట్సోర్సింగ్ సిబ్బంది మరణం లేదా ఆరోగ్య కారణాలతో విధులు నిర్వర్తించలేని పరిస్థితుల్లో వారి కుటుంబ సభ్యులకు అవకాశం కల్పించే అంశాన్ని పరిశీలించాలని సూచించారు. ప్రతి వార్డులో ప్రతిరోజూ పారిశుద్ధ్య నిర్వహణ చేపట్టాలని, స్వచ్ఛ ఆటోలకు జీపీఎస్ ట్రాకింగ్ వ్యవస్థ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఎస్సీ కాలనీల్లో ఇంటి నంబర్లు లేని ఇళ్ల అంశాన్ని రెవెన్యూ, మున్సిపల్ శాఖలు సమన్వయంతో పరిశీలించాలని తహసీల్దార్ విజయలక్ష్మి, మున్సిపల్ కమిషనర్ పవన్‌కు సూచించారు.
ఈ సమావేశంలో తహసీల్దార్ విజయలక్ష్మి, ఏసీపీ సతీష్ బాబు, వివిధ శాఖల అధికారులు, వార్డుల కౌన్సిలర్లు పాల్గొన్నారు.
