Avinash Mohanty TG SAFE Telanagana
* నాసిరకం ఔషధాల నియంత్రణ కూడా..
* టీజీ సేఫ్ కమిషనర్గా అవినాశ్ మొహంతి
ఆకేరు న్యూస్, హైదరాబాద్:
తెలంగాణలో ఆహార కల్తీ అరికట్టేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అలాగే నాసిరకం ఔషధాల విక్రయాలకు అడ్డుకట్టకు ముందడుగు వేసింది. ప్రజారోగ్య పరిరక్షణే ధ్యేయంగా ఆహార భద్రత, డ్రగ్స్ కంట్రోల్ విభాగాలను విలీనం చేస్తూ TG SAFE పేరుతో నూతన ఏకీకృత వ్యవస్థను అందుబాటులోకి తెచ్చింది. దీనికి ఐపీఎస్ అధికారిని ఇన్చార్జిగా నియమించింది.
* రంగంలోకి పోలీసు బలగాలు
ఆహారకల్తీ నిరోధానికి ఇకపై పోలీసు బలగాలు రంగంలోకి దిగనున్నాయి. కల్తీదారులపై సత్వర చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు TG SAFE విభాగానికి ప్రత్యేక పోలీస్ బలగాలను కేటాయిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా హోటళ్లు, రెస్టారెంట్లు, బేకరీలు, మెడికల్ షాపులపై ఆకస్మిక దాడులు నిర్వహించనున్నాయి. ఆహారం, మందుల నాణ్యతను త్వరితగతిన పరీక్షించేందుకు మొబైల్ ల్యాబొరేటరీలను ప్రవేశపెట్టడమే కాకుండా ప్రాంతీయ ల్యాబ్ల సామర్థ్యాన్ని పెంచుతున్నామని ప్రభుత్వం చెబుతోంది. గడువు ముగిసిన పదార్థాలు, విషపూరిత రసాయనాలు వాడే వ్యాపారులపై కేసులు నమోదు చేసి, వారి లైసెన్సులను తక్షణమే రద్దు చేయనున్నారు. ఆహార నాణ్యతలో లోపాలున్నా లేదా కల్తీ జరుగుతున్నట్లు అనుమానం వచ్చినా వినియోగదారులు ఫిర్యాదు చేయవచ్చని అధికారులు తెలిపారు.
* తొలుత క్యూర్ పరిధిలో..
తొలుత TG SAFE క్యూర్ ప్రాంతంలో పనిచేయనుంది.ఆహార వ్యాపారాలు, డ్రగ్స్ సంస్థలు అధికంగా ఉన్నందున ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తోంది. ఫుడ్, డ్రగ్స్ నియంత్రణ వ్యవస్థ ఆధునీకరణకు రాష్ట్రస్థాయి కమిటీ ఏర్పాటు చేయనుంది. టెస్టింగ్, ఇంటెలిజెన్స్, డేటా అనాలిసిస్, లీగల్ సపోర్ట్, ల్యాబ్ మౌలిక వసతులపై ఈ కమిటీ దృష్టి సారించనుంది. కాగా, టీజీ సేఫ్ కమిషనర్గా అవినాశ్ మొహంతిని ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు అవినాశ్ మొహంతికి అదనపు బాధ్యతలను రాష్ట్ర సర్కార్ అప్పగించింది. ప్రస్తుతం డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ డీజీగా అవినాశ్ మొహంతి ఉన్నారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
