* కమీషన్ కోసమే కేసీఆర్ కాళేశ్వరం కట్టారు
* బీఆర్ ఎస్ దోపిడీ విధానానికి కాళేశ్వరం బలైంది
* లక్ష కోట్లు పెట్టి కడితే మేడిగడ్డ పియర్స్ 5 ఫీట్లు కుంగాయి
* ఈ ప్రాజెక్టుతో కొత్త ఆయకట్టు లక్ష ఎకరాలు కూడా పెరగలేదు
* ప్రాజెక్టును ఏం చేయాలో ఇంజనీర్లతో చర్చిస్తున్నాం
* జాతీయ డ్యామ్ భద్రతా అథారిటీ సూచన మేరకు ముందుకుపోతాం
– ఢిల్లీలో వెల్లడించిన తెలంగాణ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
ఆకేరు న్యూస్, న్యూఢిల్లీ :
కాళేశ్వరం ఉన్నప్పటికీ కూడా తుమ్మిడి హట్టీ వద్ద మరో ప్రాజెక్టు కడతామని, కాళేశ్వరం ప్రాజెక్ట్ ఇదే ప్రాంతంలో కడితే విద్యుత్ బిల్లుల ఖర్చు కేవలం వెయ్యి కోట్లు మాత్రమే ఉండేవని
తెలంగాణ సాగునీటి శాఖా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు ప్రస్తుత పరిస్థితి, తాము అనుసరించబోయే విధానాలపై ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. కేవలం ధన దాహంతోనే మేడిగడ్డ వద్ద కట్టారని విమర్శించారు. తాము తుమ్మిడి హట్టీ వద్ద మరో ప్రాజెక్టు కడతామని వివరించారు. అంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు కట్టి 16 లక్షల ఎకరాలకు సాగునీరు అందించామని తెలిపారు. కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన జాతీయ డ్యామ్ భద్రతా అథారిటీ సూచనల మేరకు కాళేశ్వరం ప్రాజెక్టు విషయంతో తగిన నిర్ణయాలు తీసుకుంటామన్నారు. లక్ష కోట్ల ప్రజాధనం వృథా కాకుండా ప్రాజెక్టును వినియోగంలోకి తేవడమే తమ తపన అన్నారు.
*కమీషన్ల కోసమే కాళేశ్వరం ప్రాజెక్ట్
కేవలం కమీషన్ల కోసమే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టు కట్టారని, బీఆర్ ఎస్ వాళ్ల దోపిడీ విధానానికి కాళేశ్వరం బలైపోయిందని మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. . ఈ సమావేశంలో కీలక అంశాలు వెల్లడించారు. ఎక్కువ నిధులు వెచ్చిస్తే.., ఎక్కువ కమీషన్లు వస్తాయని కేసీఆర్ భావించారని ఆరోపించారు. లక్ష కోట్లు పెట్టి కడితే మేడిగడ్డ పియర్స్ 5 ఫీట్లు కుంగాయని తెలిపారు. ఈ విషయాన్ని బీఆర్ ఎస్ వాళ్లు ఒప్పుకోవడం లేదని, ఎవరో బాంబు పెట్టి కూల్చారని సమీప పీఎస్ లో ఫిర్యాదు చేశారని వెల్లడించారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో కొత్త ఆయకట్టు లక్ష ఎకరాలు కూడా పెరగలేదని, ఐదేళ్లలో కేవలం 65 టీఎంసీలు మాత్రమే ఎత్తిపోశారని వివరించారు.
* ప్రస్తుతానికి గేట్లన్నీ ఎత్తేయాలన్నారు..
కాళేశ్వరం ప్రాజెక్టును ఏం చేయాలో ఇంజనీర్లతో చర్చిస్తున్నామని మంత్రి ఉత్తమ్ తెలిపారు. ప్రజాధనంతో కట్టిన ప్రాజెక్టును రిపేర్లు చేసైనా వినియోగంలోకి తేవాలని ప్రయత్నిస్తున్నామని తెలిపారు. జాతీయ డ్యామ్ భద్రతా అథారిటీ సూచన మేరకు ముందుకువెళ్తామని వివరించారు. కాళేశ్వరంపై మరోసారి ఇంజనీర్ల సమావేశం జరుగుతుందని వెల్లడించారు. ఇప్పటికే ప్రాజెక్టుపై పలు దఫాలు చర్చలు జరిపినట్లు తెలిపారు. ఎంత చేయగలిగితే అంత చేసి ప్రాజెక్టును బలపరచాలని ఇంజనీర్లను కోరామన్నారు. ఇప్పటికైతే ప్రాజెక్టులోని అన్ని బ్యారేజీల్లోని నీళ్లను కిందకు వదిలేయాలని ఇంజనీర్లు సూచించారని, ఈ మేరకు మూడు బ్యారేజీల గేట్లను ఎత్తినట్లు తెలిపారు. మేడిగడ్డలో ఒక గేటు ఎత్తడం కుదరలేదని, అందుకే కట్ చేయడం జరిగిందని వెల్లడించారు.
————————————————–