* అమాత్యులపైనే భారం
* పంచాయతీ ఎన్నికల ఫలితాల వేళ..
* కొందరికి సీఎం క్లాస్!
* మునిసిపాలిటీలపై ఎక్కువగా ఫోకస్..
ఆకేరు న్యూస్, స్పెషల్ స్టోరీ
తెలంగాణ రాష్ట్రంలో మరో ఎన్నికల సమరానికి రాజకీయ పార్టీలు కసరత్తును ముమ్మరం చేశాయి. ఫిబ్రవరి 11న రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలకు పోలింగ్ జరగనుంది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 116 మున్సిపాలిటీలు, 7కార్పొరేషన్ల ఎన్నికలకు ఒకే విడతలో ఎన్నికలు జరగనున్నాయి. షెడ్యూల్ విడుదలకు ముందే స్థానికంగా బలోపేతం కావడానికి ప్రయత్నాలు చేస్తున్న పార్టీల నేతలు ఇప్పుడు మరింత ఎక్కువగా తమ కార్యాచరణ అమలుపై దృష్టి పెడుతున్నారు. ఇతర పార్టీల సంగతి ఎలాగున్నా.. అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి ఈ ఎన్నికలు సవాలుగా మారాయి. వరుస ఎన్నికల్లో దూకుడు మీదున్న పార్టీ.. ఇప్పుడు కూడా గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నా.., అప్రమత్తంగా ఉండాలని అధిష్ఠానం మంత్రులకు ఆదేశించినట్లు తెలిసింది.
అమాత్యులకు బాధ్యతలు
అధికారం చేపట్టిన నాటి నుంచీ రాష్ట్రంలో కాంగ్రెస్ మరింత బలోపేతం అవుతూనే ఉంది. ఎన్నిక ఏదైనా హస్తం హవా కొనసాగుతోంది. వరుస ఉప ఎన్నికలు, పంచాయతీ ఎన్నికల్లోనూ పై చేయి సాధించింది. మున్సిపల్ ఎన్నికల్లో కూడా విజయపరంపర కొనసాగించాలని ఉవ్విళ్లూరుతోంది. మరోవైపు ప్రతిపక్షం బీఆర్ ఎస్ స్థానికంగా కూడా మెజారిటీ స్థానాలను సాధించాలని వరుస సమావేశాలు నిర్వహిస్తోంది. దీంతో కాంగ్రెస్ పార్టీ కూడా దూకుడు పెంచింది. పంచాయతీ ఎన్నికల్లో సత్తా చాటామని, మున్సిపోల్స్‌లో కూడా జెండా ఎగురవేయాలని భావిస్తోంది. ఇందుకోసం అమాత్యులకు ఇంచార్జ్ బాధ్యతలు అప్పగించింది.
వర్గాలు కొంప ముంచేనా?
మున్సిపల్ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా ఎన్నికల బాధ్యులను ప్రకటించింది పార్టీ. మున్సిపల్ ఎన్నికలు జరగనున్న 15 పార్లమెంట్ నియోజకవర్గాలకు 15 మంది మంత్రులను ఇంచార్జ్‌లను గతంలోనే నియమించారు ముఖ్యమంత్రి రేవంత్. నియోజకవర్గాల వారీగా మంత్రులు సన్నాహక సమావేశాలు పెట్టాలని సూచించారు. అయితే.. మంత్రులకు అభ్యర్థుల ఎంపిక తలనొప్పిగా మారింది. మున్సిపల్ ఎన్నికల్లో ఎమ్మెల్యే వర్గం, ఎంపీ వర్గం, డీసీసీ అధ్యక్షుడి వర్గం, పీసీసీ వర్గం, ఇంచార్జ్ మంత్రి వర్గం, మున్సిపల్ ఎన్నికల ఇంచార్జ్ మంత్రి వర్గం అంటూ డజన్ల మంది ఆశావహులు టికెట్ రేసులో ఉన్నారు. ఇక ఫిరాయింపు ఎమ్మెల్యేలు ఉన్న నియోజకవర్గాల్లో ఈ సమస్య మరింత ఇబ్బందికరంగా ఉంది.
బాస్ సీరియస్ కావడంతో..
పంచాయతీ ఎన్నికల్లో తక్కువ స్థానాలు వచ్చిన చోట పార్టీ నేతల తప్పిదాలపై సీఎం రేవంత్ బాధ్యులపై సీరియస్ అయినట్లు సమాచారం. దీంతో మున్సిపల్ ఎన్నికల్లో ఎలాంటి మిస్టేక్ జరిగినా తమపై ఎఫెక్ట్ పడుతుందని మంత్రులు ఆందోళన చెందుతున్నట్లు పార్టీలో ప్రచారం జరుగుతోంది. పార్టీ ఇచ్చిన టార్గెట్ రీచ్ అయ్యేందుకు కష్టపడి పని చేయడానికి తాము సిద్ధంగా ఉన్నప్పటికీ, టికెట్ కోరుతున్న ఆశావహుల సంఖ్యను చూసి నేతలందరూ తలలు పట్టుకుంటున్నారట. ఒక్కో స్థానానికి డజను మంది నేతలు టికెట్ కోసం ట్రై చేస్తుండటం..మరోవైపు గ్రూప్ వార్ నేపథ్యంలో అభ్యర్థుల ఎంపిక అతిపెద్ద సమస్యగా మారినట్లు కనిపిస్తోంది.
……………………………………………………
