Minister Ponnam Prabhakar TGSRTC New Buses
*సంస్థను మరింత బలోపేతం చేస్తున్నాం
* 2,932 కొత్త బస్సులతో సరికొత్త రవాణా
* మంత్రి పొన్నం ప్రభాకర్
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీజీఎస్ఆర్టీసీ) కేవలం ఒక రవాణా వ్యవస్థ మాత్రమే కాదని, అది రాష్ట్రంలోని పేద, మధ్యతరగతి ప్రజల జీవితాల్లో విడదీయరాని జీవనాడి అని కాంగ్రెస్ ప్రభుత్వం స్పష్టం చేసింది. రోజువారీ విద్య, ఉద్యోగ, వైద్య, వ్యాపార అవసరాల కోసం గమ్యస్థానాలకు చేరుకునే లక్షలాది మంది ప్రజలకు విశ్వసనీయమైన ప్రజా రవాణాను అందించడమే తమ ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని పేర్కొంది. గత ప్రభుత్వ హయాంలో సరైన ప్రణాళికలు లేక, నిర్వహణ లోపాల వల్ల తీవ్ర నిర్లక్ష్యానికి గురైన ఆర్టీసీని పునరుజ్జీవింపజేసేందుకు, సంస్థను ఆర్థికంగా నిలబెట్టేందుకు సరికొత్త వ్యూహాలతో సమగ్ర చర్యలు చేపడుతున్నట్లు వెల్లడించింది. ప్రస్తుతం ప్రతిరోజూ సుమారు 65 లక్షల మంది ప్రయాణికులకు ఆర్టీసీ సమర్థవంతంగా సేవలు అందిస్తోందని ప్రభుత్వం తెలిపింది.
* మహాలక్ష్మి పథకంతో మహిళా సాధికారత..
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఇచ్చిన హామీ మేరకు ‘మహాలక్ష్మి’ పథకాన్ని ప్రవేశపెట్టింది. పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పించడం ద్వారా రాష్ట్ర రవాణా చరిత్రలో ఒక కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టింది. ఈ పథకం అమల్లోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు 347.47 కోట్ల మంది మహిళలు ఉచితంగా ప్రయాణించారు. దీని ద్వారా మహిళా ప్రయాణికులు ఏకంగా రూ.12,171 కోట్ల మేర ప్రయాణ ఖర్చులను ఆదా చేసుకోలిగారు. ఉచిత బస్సు ప్రయాణం వల్ల మహిళల ఆర్థిక భారం తగ్గడమే కాకుండా, వారి స్వేచ్ఛాయుత రాకపోకలు పెరిగి సామాజిక, ఆర్థిక సాధికారతకు బాటలు పడ్డాయి. అదే సమయంలో ఆర్టీసీ బస్సుల్లో ఆక్యుపెన్సీ రేషియో (OR) ఊహించని రీతిలో పెరిగి సంస్థకు సరికొత్త ఉత్సాహం వచ్చింది.
* 2,932 కొత్త బస్సుల ప్రవేశం..
పెరుగుతున్న ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా ఆర్టీసీ రవాణా సామర్థ్యాన్ని పెంచేందుకు ప్రభుత్వం చర్యలు వేగవంతం చేసింది. అందులో భాగంగా మొత్తం 2,932 కొత్త బస్సులను ప్రవేశపెట్టేందుకు ప్రణాళికలు సిద్ధం చేసి, దశలవారీగా రోడ్డెక్కిస్తోంది. కాలంచెల్లిన పాత బస్సుల స్థానంలో అత్యాధునిక సౌకర్యాలున్న కొత్త బస్సులను తీసుకురావడం ద్వారా ప్రయాణికులకు సురక్షితమైన, హాయిగా ఉండే ప్రయాణ అనుభవాన్ని అందిస్తోంది. ముఖ్యంగా మారుమూల గ్రామీణ ప్రాంతాల నుంచి జిల్లా కేంద్రాలకు, నగరాలకు అనుసంధానాన్ని మెరుగుపరచడంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది.
* పర్యావరణ పరిరక్షణకు ఎలక్ట్రిక్ బస్సులు
భవిష్యత్తు అవసరాలను, పెరుగుతున్న వాయు కాలుష్యాన్ని దృష్టిలో ఉంచుకుని పర్యావరణహిత రవాణా వ్యవస్థకు ప్రభుత్వం పెద్దపీట వేస్తోంది. ఇందులో భాగంగా టీజీఎస్ఆర్టీసీ fleetలోకి భారీగా ఎలక్ట్రిక్ బస్సులను (e-Buses) ప్రవేశపెడుతోంది. కాలుష్య రహిత ప్రయాణంతో పాటు ఇంధన వ్యయాన్ని గణనీయంగా తగ్గించుకోవడం, శబ్దం లేని ఆధునిక ప్రయాణ సౌకర్యాన్ని పౌరులకు అందించడమే దీని ముఖ్య ఉద్దేశం. గ్రేటర్ హైదరాబాద్ పరిధితో పాటు ఇతర ప్రధాన నగర ప్రాంతాల్లో ఈ ఎలక్ట్రిక్ బస్సులను విస్తరింపజేస్తోంది.
* ప్రయాణికుల భద్రతకు పటిష్ట చర్యలు
బస్సుల్లో ప్రయాణించే పౌరుల, ముఖ్యంగా మహిళలు, విద్యార్థినులు, వృద్ధుల భద్రతకు కాంగ్రెస్ ప్రభుత్వం అత్యున్నత ప్రాధాన్యతనిస్తోంది. ప్రతి బస్సులోనూ సీసీటీవీ (CCTV) కెమెరాలు, అత్యవసర సమయాల్లో ఉపయోగపడే పానిక్ బటన్లు ఏర్పాటు చేస్తోంది. సాంకేతిక పరిజ్ఞానాన్ని విస్తృతంగా వినియోగించుకుంటూ డిపోలు, బస్ స్టేషన్లలో ప్రత్యేక కంట్రోల్ రూమ్ల ద్వారా భద్రతను నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. దీనివల్ల ప్రయాణికులు ఎటువంటి భయాందోళనలు లేకుండా ప్రయాణించగలుగుతున్నారు.
* కొత్త రూట్లు, గ్రామీణ మార్గాల విస్తరణ
ప్రజల డిమాండ్ కు అనుగుణంగా రవాణా సేవలు అందని ప్రాంతాలను గుర్తించి కొత్త రూట్లను అందుబాటులోకి తెస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల ప్రజలు విద్యాసంస్థలు, ఆసుపత్రులు, వ్యవసాయ మార్కెట్లు, ప్రభుత్వ కార్యాలయాలకు చేరుకోవడానికి అనువుగా బస్సు వేళలను, మార్గాలను పునర్వ్యవస్థీకరిస్తున్నారు. రాష్ట్రంలోని ఏ ఒక్క మారుమూల గ్రామం కూడా రవాణా సౌకర్యానికి దూరం కాకూడదనే లక్ష్యంతో రవాణా శాఖ పనిచేస్తోంది.
* ఆధునిక వసతులతో అభివృద్ధి
బస్సుల సంఖ్య పెంచడంతో పాటు ప్రయాణికులకు మౌలిక వసతులు కల్పించేందుకు బస్ స్టేషన్లను ఆధునీకరిస్తున్నారు. పరిశుభ్రమైన వేచి ఉండే గదులు, ప్రయాణికుల సౌకర్యార్థం తాగునీరు, నూతన శౌచాలయాల నిర్మాణం, ప్రయాణ వేళలను తెలియజేసే డిజిటల్ డిస్ప్లే బోర్డులను బస్ స్టేషన్లలో ఏర్పాటు చేస్తున్నారు. బస్ స్టేషన్లను కేవలం ఆగమన స్థలాలుగా కాకుండా ప్రయాణికులకు ఆహ్లాదకరమైన అనుభవాన్ని ఇచ్చే కేంద్రాలుగా తీర్చిదిద్దుతున్నారు.
* కార్మికుల సమస్యల పరిష్కారం
ఆర్టీసీ పురోగతిలో డ్రైవర్లు, కండక్టర్లు, గ్యారేజ్ సిబ్బంది పాత్ర అత్యంత కీలకమైందని ప్రభుత్వం గుర్తించింది. కార్మికుల సంక్షేమానికి ప్రాధాన్యమిస్తూ, వారి బకాయిల విడుదల, ఉద్యోగ భద్రత, పని వేళల్లో అనుకూల వాతావరణాన్ని కల్పించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. సిబ్బంది సంక్షేమం, ప్రయాణికుల అవసరాలు, సంస్థ లాభదాయకత మధ్య సమతుల్యత పాటిస్తూ యాజమాన్యం నిర్ణయాలు తీసుకునేలా మార్గదర్శకాలు జారీ చేసింది.
* సంస్థను కాపాడటం మాత్రమే కాదు..
ఆర్టీసీని పరిరక్షించడం అంటే కేవలం ఒక ప్రభుత్వ రవాణా సంస్థను కాపాడటం మాత్రమే కాదని, తెలంగాణలోని పేద, మధ్యతరగతి ప్రజల సామాజిక, ఆర్థిక భద్రతను కాపాడటమేనని ప్రభుత్వం స్పష్టం చేసింది. నాణ్యమైన, సురక్షితమైన, ఆధునిక ప్రజా రవాణాను ప్రజలకు తక్కువ ఖర్చుతో అందించడం ద్వారా రాష్ట్ర సమగ్ర అభివృద్ధికి ఆర్టీసీని మూలస్తంభంగా మార్చేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేసింది.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
