* రేపు విచారణకు హాజరు కావాలని పవర్ కమిషన్ ఆదేశం
* ఇప్పటికే ఈ అంశంపై కోర్టుకెళ్లిన కేసీఆర్
ఆకేరు న్యూస్ డెస్క్ : గత ప్రభుత్వంలో జరిగిన విద్యుత్ కొనుగోలు ఒప్పందంపై ఈనెల 27లోపు స్వయంగా వచ్చి వివరణ ఇవ్వాలని తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కు (KCR) జస్టిస్ నరసింహారెడ్డి (Justice Narasimha Reddy) నేతృత్వంలోని పవర్ కమిషన్ మరోసారి నోటీసులు జారీ చేసింది. ఇదే అంశంపై మాజీ మంత్రి జగదీష్రెడ్డితోపాటు మరికొంత మందికి సైతం నోటీసులు జారీ చేసినట్లు తెలిసింది. గతంలోనే జూన్ రెండోవారంలో కేసీఆర్కు పవర్ కమిషన్ నోటీసులు జారీ చేసిన విషయం విధితమే. బీఆర్ఎస్ (BRS) ప్రభుత్వ హయాంలో ఛత్తీస్గఢ్ ప్రభుత్వంతో చేసుకున్న విద్యుత్ ఒప్పందాల్లో మీ ‘పాత్ర’ గురించి తెలియజేయాలని ఆ నోటీసుల్లో కేసీఆర్కు పవర్ కమిషన్ స్పష్టం చేసింది. ఈ నోటీసుల ప్రకారం జూన్ 15వ తేదీలోపు సమాధానం ఇవ్వాలని పేర్కొంది. కానీ ఈ విషయంలో తనకు జులై 30వ తేదీ వరకు సమయం ఇవ్వాలని పవర్ కమిషన్ను మాజీ సీఎం కేసీఆర్ కోరారు. అందుకు కమిషన్ అంగీకరించలేదు. దీంతో కేసీఆర్ ఓ సుదీర్ఘమైన లేఖ రాశారు. అందులో పవర్ కమిషనర్ (Power Commission) తీరుపై విమర్శలు గుప్పించారు. మరోవైపు ఇదే అంశంపై కేసీఆర్ హైకోర్టును మంగళవారం ఆశ్రయించారు. జస్టిస్ నరసింహారెడ్డి నేతృత్వంలోని పవర్ కమిషన్ను రద్దు చేయాలని, నిబంధనలకు విరుద్ధంగా కమిషన్ తీరు ఉందని ఆరోపించారు. అయితే తాజాగా ఇచ్చిన నోటీసులపై మాజీ సీఎం కేసీఆర్ ఎలా స్పందిస్తారనేది ఇప్పుడు ఆసక్తిగా మారింది.
——————–