MLA Akbaruddin Owaisi Telangana Scholarship Dues
* డీబీటీతో ఇబ్బందులెందుకు..?
* అసెంబ్లీలో అక్బర్ తీవ్ర ఆగ్రహం
ఆకేరు న్యూస్, హైదరాబాద్: తెలంగాణ శాసనసభ వేదికగా విద్యార్థుల స్కాలర్షిప్లు, ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిల అంశం తీవ్ర చర్చనీయాంశమైంది. మైనారిటీ సంక్షేమం, విద్యార్థుల హక్కుల సాధనపై ఎంఐఎం శాసనసభా పక్ష నేత అక్బర్ ఉద్దీన్ ఒవైసీ ప్రభుత్వం ముందు కీలక ప్రశ్నలను ఉంచారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన గణాంకాలలో పారదర్శకత లోపించిందని, లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియలో ఉన్న లోపాలను సరిదిద్దాలని ఆయన డిమాండ్ చేశారు.
* అర్హత ప్రమాణాలపై ప్రశ్నలు..
ప్రభుత్వం విడుదల చేసిన నివేదికలలో కేవలం నమోదు చేసుకున్న, మంజూరైన దరఖాస్తుల వివరాలు మాత్రమే ఉన్నాయని అక్బర్ ఉద్దీన్ పేర్కొన్నారు. అసలు మొత్తం ఎన్ని దరఖాస్తులు వచ్చాయి, వాటిలో స్క్రూటినీ ద్వారా సరియైనవిగా తేలినవేవి, సాంకేతిక లేదా ఇతర కారణాలతో తిరస్కరించిన దరఖాస్తులు ఎన్ని అనే వివరాలను ప్రభుత్వం స్పష్టంగా బయటపెట్టాలని కోరారు. అంతేకాకుండా, వర్తమాన ఆర్థిక పరిస్థితులకు అనుగుణంగా ఆదాయ పరిమితుల నిబంధనలను సవరించాల్సిన అవసరం ఉందని ఆయన ఉద్ఘాటించారు.
ప్రస్తుతం ఉన్న కనీస వేతన చట్టం ప్రకారం కార్మికుల వేతనాలు నెలకు రూ. 16,500 నుండి రూ. 18,500 వరకు ఉన్నాయని, ఈ లెక్కన గ్రామీణ ప్రాంతాల్లో రూ. 1.5 లక్షలు, పట్టణ ప్రాంతాల్లో రూ. 2 లక్షల వార్షిక ఆదాయ పరిమితి పెట్టడం వల్ల అనేకమంది పేద విద్యార్థులు లబ్ధికి దూరమవుతున్నారని వివరించారు. నిజమైన లబ్ధిదారులను గుర్తించి, నకిలీ సర్టిఫికెట్ల అక్రమాలను అరికట్టేందుకు కృత్రిమ మేధస్సు (AI) లేదా ఆధునిక సాఫ్ట్వేర్ సాంకేతికతను ఉపయోగించాలని సూచించారు.
* ప్రీ-మెట్రిక్ స్కాలర్షిప్లలో వివక్ష అడ్డుకోవాలి..
5 నుంచి 8వ తరగతి వరకు ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు అందించే ప్రీ-మెట్రిక్ స్కాలర్షిప్లలో కేంద్రం మరియు రాష్ట్ర ప్రభుత్వాల వాటాల వివరాలను స్పష్టం చేయాలని ఆయన కోరారు. కేంద్రంలోని బిజేపి ప్రభుత్వం మైనారిటీలకు ప్రీ-మెట్రిక్ స్కాలర్షిప్లను నిలిపివేసిందని, గత బిఆర్ఎస్ ప్రభుత్వం కూడా దీనిపై సరైన చర్యలు తీసుకోలేదని విమర్శించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులతో సమానంగా మైనారిటీ విద్యార్థులకు కూడా రాష్ట్ర ప్రభుత్వమే సొంతంగా ప్రీ-మెట్రిక్ స్కాలర్షిప్లను పునరుద్ధరించి అందించాలని గట్టిగా డిమాండ్ చేశారు. కాగా, 5-8 తరగతుల ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు బకాయి ఉన్న రూ. 16.27 కోట్లను తక్షణమే విడుదల చేయాలన్నారు.
* రూ. 8,820 కోట్ల భారీ బకాయిలు..
9, 10వ తరగతులకు సంబంధించి బీసీ, ఎస్సీ, ఎస్టీ ప్రీ-మెట్రిక్ బకాయిలు రూ. 16.12 కోట్లు ఉన్నాయని, వాటిని ఎప్పుడు చెల్లిస్తారో ప్రభుత్వం చెప్పాలని నిలదీశారు. దీనికితోడు, పోస్ట్-మెట్రిక్ (RTF & MTF) మరియు ఓవర్సీస్ స్కాలర్షిప్ల కింద ప్రభుత్వం విద్యాసంస్థలకు, విద్యార్థులకు ఏకంగా రూ. 8,820.47 కోట్ల భారీ బకాయిలను చెల్లించాల్సి ఉందన్నారు. ఈ బకాయిల వల్ల కళాశాలల నిర్వహణతో పాటు విద్యార్థుల సర్టిఫికెట్లు నిలిచిపోయి వారి భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతోందని, ఈ నిధులను ఎప్పటిలోగా క్లియర్ చేస్తారో ఖచ్చితమైన గడువు విధించాలని కోరారు.
* విద్యార్థులపై పడే అదనపు భారం..
ఫీజు రీయింబర్స్మెంట్ సొమ్మును కళాశాలలకు కాకుండా నేరుగా విద్యార్థుల బ్యాంకు ఖాతాల్లోకి జమ చేసేందుకు (Direct Benefit Transfer) తెచ్చిన జీవో ఎంఎస్ నంబర్ 7, 8 లపై ఆయన తీవ్ర సందేహాలు వ్యక్తం చేశారు. ప్రవేశాల సమయానికే విద్యార్థులు స్వయంగా ఫీజులు చెల్లించాల్సి వస్తే పేద విద్యార్థులు అంత డబ్బు ఎక్కడి నుండి తెస్తారని ప్రశ్నించారు. ఒకవేళ ఆ తర్వాత ప్రభుత్వం సొమ్ము రీయింబర్స్ చేయడంలో జాప్యం చేస్తే విద్యార్థుల పరిస్థితి ఏంటని ఆందోళన వ్యక్తం చేశారు. పాత బకాయిల విడుదల మరియు ఈ నూతన విధాన అమలుపై హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను ప్రభుత్వం ఏ మేరకు పాటిస్తుందో సభకు తెలియజేయాలని అక్బర్ ఉద్దీన్ ఒవైసీ డిమాండ్ చేశారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
