MLA Yashaswini Reddy Palakurthi CMRF Aid Distribution
* పేదవాడి గుండె నిబ్బరం..పాలకుర్తి ‘సహాయ’ హస్తం!
ఆకేరు న్యూస్ పాలకుర్తి : పాలన అంటే సింహాసనం కాదు.. ప్రజల కష్టాల్లో తోడుగా నిలబడే హృదయం కావాలి అని ఎమ్మెల్యే యశస్విని రెడ్డి స్పష్టం చేశారు కష్టం ఎప్పుడూ ముందస్తు హెచ్చరికలతో రాదు. ముఖ్యంగా పేద, మధ్యతరగతి ఇంట అనారోగ్యం వస్తే.. అది కేవలం శరీరానికి మాత్రమే కాదు, ఆ కుటుంబ ఆర్థిక పునాదులకే పెద్ద గాయం చేస్తుంది. ఆసుపత్రి బిల్లులు చూసి, ఆస్తులు అమ్ముకోలేక, భవిష్యత్తుపై ఆశలు వదులుకునే సగటు మనిషి వేదనకు అద్దం పడుతూ, పాలకుర్తి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం గురువారం ఒక గొప్ప మానవీయ వేదికగా మారింది. రాజకీయ ప్రచారాల కంటే మనుషుల ప్రాణాలకు, వారి ఆత్మగౌరవానికి పెద్దపీట వేస్తూ..ఎమ్మెల్యే యశస్విని రెడ్డి చేతులమీదుగా వివిధ మండలాలకు చెందిన 124 మంది లబ్ధిదారులకు రూ. 56,21,200 విలువైన ముఖ్యమంత్రి సహాయనిధి (CMRF) చెక్కులను పంపిణీ చేశారు. ఆసుపత్రి ఖర్చుల భారంతో, భవిష్యత్తుపై బెంగతో వచ్చిన ఆ కుటుంబాల ముఖాల్లో చెక్కులు అందుకున్న తర్వాత కనిపించిన నిశ్చంతే ఈ పాలనకు అసలైన గెలుపుగా నిలిచింది.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే యశస్విని రెడ్డి మాట్లాడుతూ, అధికారం అంటే సింహాసనం కాదు.. ప్రజల ఆపదలో తోడుగా నిలబడే ఒక హృదయపూర్వక బాధ్యత అని స్పష్టం చేశారు. “రాజకీయాలు, పదవుల కంటే ప్రజలు అత్యంత నిస్సహాయ స్థితిలో ఉన్నప్పుడు వారి వెనుక నిలబడటమే ఒక ప్రజాప్రతినిధికి అసలైన సార్థకత. భారీ వైద్య ఖర్చులతో దిక్కుతోచని స్థితిలో ఉన్న కుటుంబాలకు ఈ సీఎం సహాయనిధి ఒక సంజీవని లాంటిది. ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం ఎమ్మెల్యే కార్యాలయాన్ని ఆశ్రయిస్తే, అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు అందేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నామని, త్వరితగతిన చెక్కులు అందేలా నిరంతరం కృషి చేస్తున్నామని” ఆమె పేర్కొన్నారు. తమ క్లిష్ట సమయంలో కొండంత అండగా నిలిచిన ముఖ్యమంత్రికి, ఎమ్మెల్యే యశస్విని రెడ్డి కి లబ్ధిదారులు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు , ఈ కార్యక్రమంలో వివిధ మండలాల అధ్యక్షులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, వివిధ గ్రామ సర్పంచులు, అధికారులు మరియు లబ్ధిదారులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
Please tell us what is wrong. Your report will be sent to the website team.
