Dr.B Gopi (IAS) Crop Residue Burning Ban
* పంట అవశేషాలు కాల్చితే భారీ జరిమానా..
* నిబంధనలు ఉల్లంఘిస్తే రూ.25,000 వరకు పర్యావరణ రుసుము
ఆకేరు న్యూస్, హైదరాబాద్:
తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుత యాసంగి (రబీ) సీజన్లో రికార్డు స్థాయిలో వరి సాగైంది. ప్రస్తుతం కోతలు దాదాపు పూర్తి కావచ్చాయి. అయితే, రాబోయే వానాకాలం (ఖరీఫ్) సీజన్ కోసం భూములను సిద్ధం చేసే క్రమంలో రైతులు తమ పొలాల్లోని పంట వ్యర్థాలను, మోడులను సులభంగా వదిలించుకోవడానికి తగలబెడుతున్నారు. ఈ అలవాటుపై తెలంగాణ వ్యవసాయ శాఖ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. పంట అవశేషాలను బహిరంగంగా కాల్చడం వల్ల కలిగే నష్టాలపై వ్యవసాయ శాఖ సంచాలకులు డా. బి. గోపి, ఐఏఎస్ రైతులకు కీలక విజ్ఞప్తి చేశారు.
* పంట వ్యర్థాల దహనంతో జరిగే నష్టాలు…
పంట అవశేషాలను కాల్చడం వల్ల రైతులకు తాత్కాలికంగా శ్రమ తగ్గినట్లు అనిపించినా, దీర్ఘకాలంలో భారీ నష్టాలు వాటిల్లుతాయని అధికారులు స్పష్టం చేశారు.
భూసార క్షీణత: మంటల తీవ్రతకు నేలలోని అత్యంత కీలకమైన సేంద్రియ కర్బనం (Organic Carbon) నశిస్తుంది.
పోషకాల నష్టం: మొక్కకు అవసరమైన నత్రజని, భాస్వరం, పొటాష్ వంటి ప్రధాన పోషకాలతో పాటు సూక్ష్మ పోషకాలు పూర్తిగా బూడిదవుతాయి. దీనివల్ల భవిష్యత్తులో రసాయన ఎరువులపై పెట్టుబడి మరింత పెరుగుతుంది.
మిత్ర పురుగుల మరణం: రైతుకు మేలు చేసే ఉపయోగకరమైన జీవులు, వానపాములు, సూక్ష్మజీవులు ఈ మంటల్లో కాలిపోతాయి.
కాలుష్యం మరియు ఆరోగ్య సమస్యలు: దట్టమైన పొగ వల్ల గాలి కాలుష్యం పెరిగి, గ్రామీణ ప్రజల్లో శ్వాసకోశ ఇబ్బందులు తలెత్తుతాయి.
ప్రాణ, ఆస్తి నష్టం: వేసవి కాలంలో ఈ మంటలు పక్క పొలాలకు, గడ్డి వాములకు లేదా ఇళ్లకు వేగంగా వ్యాపించి భారీ ఆస్తి నష్టం, ప్రాణ నష్టానికి దారితీస్తున్నాయి.
* తీవ్ర విచారం కలిగించిన భూపాలపల్లి ఘటన….
ఇటీవల జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో పంట వ్యర్థాలను తగలబెట్టే క్రమంలో ప్రమాదవశాత్తు మంటల్లో చిక్కుకుని చాగర్ల చంద్రమౌళి, భాగ్యమ్మ అనే రైతులు మృతి చెందడంపై వ్యవసాయ శాఖ తీవ్ర దిగ్భ్రాంతిని, విచారాన్ని వ్యక్తం చేసింది. ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలని, క్షేత్రస్థాయిలో రైతులకు విస్తృతంగా అవగాహన కల్పించాలని జిల్లా అధికారులకు, సిబ్బందికి మెమోలు జారీ చేసినట్లు డా. బి. గోపి తెలిపారు.

* ప్రభుత్వ నిషేధాజ్ఞలు – భారీ జరిమానాలు (G.O. Ms No. 27)…
పర్యావరణ పరిరక్షణలో భాగంగా పంట వ్యర్థాలను మరియు ఇతర చెత్తను బహిరంగంగా కాల్చడాన్ని పర్యావరణ, అటవీ, శాస్త్ర సాంకేతిక శాఖ పూర్తిగాv నిషేధించింది. జీవో నెం. 27 ప్రకారం ఈ నిబంధనలను ఉల్లంఘించే వారిపై కఠినమైన పర్యావరణ పరిహార రుసుము (Environment Compensation Fee) విధించబడుతుంది.
దీని ప్రకారం, సాధారణంగా చెత్త లేదా వ్యర్థాలను బహిరంగంగా కాల్చితే రూ. 5,000/- పర్యావరణ పరిహార రుసుము విధిస్తారు. అదేవిధంగా, పొలాల్లో భారీ స్థాయిలో పంట వ్యర్థాలను కాల్చినట్లయితే రూ. 25,000/- వరకు భారీ జరిమానా విధించబడుతుంది.
* వ్యవసాయ శాఖ సూచిస్తున్న శాస్త్రీయ మార్గాలు…
రైతులు పంట వ్యర్థాలను కాల్చడానికి బదులుగా కింది పద్ధతులను పాటించాలని శాస్త్రవేత్తలు, అధికారులు సూచిస్తున్నారు:
నేలలో కలియదున్నడం: రొటవేటర్ లేదా ఇతర ఆధునిక యంత్రాల సహాయంతో పంట అవశేషాలను చిన్న ముక్కలుగా చేసి నేలలోనే కలియదున్నాలి.
సేంద్రియ ఎరువుగా మార్చడం: అవశేషాలను ఒకచోట చేర్చి కంపోస్ట్ (మగ్గిన ఎరువు) గా మార్చుకోవచ్చు. దీనికోసం వ్యర్థాలను త్వరగా కుళ్ళింపజేసే పూసల (Decomposers) ను వాడవచ్చు.
భూసార పెంపు: ఈ విధంగా చేయడం వల్ల భూమిలో సేంద్రియ కర్బన శాతం పెరిగి, భూమి తేమను పట్టి ఉంచే సామర్థ్యం పెరుగుతుంది. తద్వారా రసాయన ఎరువుల వాడకం తగ్గి, దిగుబడులు పెరుగుతాయి.
* రైతులు సహకరించాలి…
పర్యావరణాన్ని కాపాడుకుంటూ, మన భూముల సారాన్ని రక్షించుకోవడానికి రైతులంతా సహకరించాలని వ్యవసాయ శాఖ కోరింది. మంటలు పెట్టి ప్రాణాలను, భూమిని నష్టపోవద్దని, శాస్త్రీయ పద్ధతులను అవలంబించి సురక్షితమైన వ్యవసాయాన్ని సాగించాలని డా. బి. గోపి, ఐఏఎస్ విజ్ఞప్తి చేశారు.
Please tell us what is wrong. Your report will be sent to the website team.
