
* పులివెందుల, ఒంటిమిట్టలో టెన్షన్.. టెన్షన్..
* ఎంపీ అవినాష్ రెడ్డి హౌస్ అరెస్ట్
ఆకేరు న్యూస్, డెస్క్ : అక్కడ జరుగుతున్నది జడ్ పీటీసీ ఉప ఎన్నికల పోలింగ్. కానీ.. ఆయా పోలింగ్ బూత్ లు రణరంగంగా మారాయి. దాడులు, ప్రతిదాడులతో దద్దరిల్లాయి. వైఎస్ ఆర్ కడపజిల్లా (YSR KADAPA DISTRICT) పులివెందుల, ఒంటిమిట్ట లో టెన్షన్ వాతావరణం ఏర్పడింది. ఒంటిమిట్ట చిన్నకొత్తపల్లి బూత్ నంబర్ 7 వద్ద గుర్తుతెలియని దుండగులు వైసీపీ ఏజెంట్‌పై దాడి చేశారు. పోలింగ్ బూత్ కు వచ్చిన ఏజెంట్ ను లోపలకు వెళ్లకుండా అడ్డగించి చితక్కొట్టారు. చొంకా చించేసి పిడిగుద్దులు గుద్దారు. కాలితో తన్నారు. ఇది టీడీపీ కార్యకర్తల పనేనని వైసీపీ ఆరోపిస్తోంది. మంత్రి రాంప్రసాద్‌రెడ్డి (MINISTER RAMPRASAD) సమక్షంలోనే దాడి జరిగినట్లు తెలుస్తోంది. దీంతో మంత్రిపై వైసీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. పోలీసులు మంత్రిని అక్కడి నుంచి పంపించేశారు. అనంతరం మంత్రి రాంప్రసాద్ రెడ్డి మంటపం పల్లె పోలింగ్ బూత్ వద్దకు వెళ్లగానే అక్కడ కూడా ఉద్రిక్తత జరిగింది. టీడీపీ, వైసీపీ నేతల మధ్య ఘర్షణ జరిగింది. పులివెందులలో కూడా తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది. ఎంపీ అవినాష్ రెడ్డి(MP AVINASH REDDY)ని, వేంపల్లిలో సతీష్ రెడ్డిని అరెస్టు చేయడం ఉద్రిక్తతకు దారి తీసింది. నల్లగొండువా పల్లెలో ఓటు వేయడానికి వెళ్లనీయండి సారూ.. అంటున్న ఓటరు పోలీసు కాళ్లు మొక్కడం వైరల్ గా మారింది. ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధంగా టీడీపీ, పోలీసులు వ్యవహరిస్తున్నారంటూ వైసీపీ ఆరోపిస్తోంది. ప్రజాస్వామ్య బద్ధంగా ఓటింగ్ జరుగుతోందని, వైసీపీ అనవసర రాద్దాంతం చేస్తోందని టీడీపీ అంటోంది.
…………………………………………….