TGNPDCL CMD Varun Reddy Warangal RO Plant Service
ఆకేరు న్యూస్, వరంగల్: విద్యుత్ సరఫరా ద్వారా ప్రతి ఇంటా వెలుగులు నింపడం తమ వృత్తి అయితే, సేవా కార్యక్రమాల ద్వారా పేదల జీవితాల్లో వెలుగులు నింపడం తమ ప్రవృత్తి అని టీజీఎన్పీడీసీఎల్ సీఎండీ కర్నాటి వరుణ్ రెడ్డి స్పష్టం చేశారు. బుధవారం వరంగల్ కేఎంసీ ప్రాంగణంలోని పీఎంఎస్ఎస్వై (PMSSY) సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో ‘హోప్ఫుల్ హార్ట్స్ సొసైటీ’ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 250 ఎల్పిహెచ్ (LPH) సామర్థ్యం గల అత్యాధునిక పూర్తి ఆటోమేటిక్ రివర్స్ ఆస్మోసిస్ (ఆర్వో) వాటర్ ప్లాంట్ను ఆయన ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా సీఎండీ వరుణ్ రెడ్డి మాట్లాడుతూ.. ఆసుపత్రికి వచ్చే పేద రోగులకు, వారి సహాయకులకు ఏడాది పొడవునా స్వచ్ఛమైన తాగునీరు అందించాలనే ఉద్దేశంతో ఈ ప్లాంట్ను ఏర్పాటు చేయడం సొసైటీ సేవా దృక్పథానికి నిదర్శనమని కొనియాడారు. విద్యుత్ శాఖ ఉద్యోగులు విధి నిర్వహణలో ఎంత బిజీగా ఉన్నప్పటికీ, సామాజిక బాధ్యతతో సేవలో ముందుండటం గర్వకారణమన్నారు. కేవలం 30 మందితో ప్రారంభమైన ఈ సొసైటీ, నేడు అనేక సేవా కార్యక్రమాలతో ఆదర్శంగా నిలుస్తోందని ప్రశంసించారు.
* అలుపెరుగని సేవలు…
వేసవి తాపాన్ని దృష్టిలో ఉంచుకుని హనుమకొండ నక్కలగుట్టలోని ఎస్ఈ కార్యాలయం ఎదుట వరుసగా మూడో ఏడాది చలివేంద్రాన్ని ఏర్పాటు చేసి ప్రజల దాహార్తిని తీరుస్తున్నారని ఆయన గుర్తు చేశారు. విధి నిర్వహణలో వినియోగదారుల మన్ననలు పొందుతూనే, మరోవైపు అనాథలు, వృద్ధులు, దివ్యాంగుల సంక్షేమం కోసం పాటుపడటం అభినందనీయమని పేర్కొన్నారు.
* వైద్య ప్రముఖుల ప్రశంసలు
కాకతీయ మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ సంధ్యారాణి, ఎంజీఎం ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ మురళీధర్ రెడ్డి, డాక్టర్ హరిశ్చంద్రారెడ్డి తదితరులు మాట్లాడుతూ.. రోగుల సౌకర్యార్థం ఆర్వో ప్లాంట్ ఏర్పాటు చేసిన హోప్ఫుల్ హార్ట్స్ సొసైటీకి కృతజ్ఞతలు తెలిపారు. ప్రతి ఒక్కరూ ఇలాగే సామాజిక సేవలో భాగస్వాములు కావాలని ఆకాంక్షించారు.
* సొసైటీ నేపథ్యం…
వరంగల్, హన్మకొండ ఆపరేషన్ సర్కిళ్లకు చెందిన 25 మంది ఎన్పీడీసీఎల్ ఉద్యోగులు, వారి ఐదుగురు మిత్రులు కలిసి 2023 మే నెలలో ఈ సొసైటీని స్థాపించారు. గతంలో కొండాయి వరద బాధితులకు గృహోపకరణాల పంపిణీ, చలికాలంలో నిరుపేదలకు దుప్పట్ల పంపిణీ వంటి ఎన్నో కార్యక్రమాలను ఈ సంస్థ చేపట్టింది.
* పాల్గొన్న ప్రముఖులు…
ఈ కార్యక్రమంలో టీజీఎన్పీడీసీఎల్ డైరెక్టర్లు వి. మోహన్ రావు, వి. తిరుపతి రెడ్డి, పి. మధుసూదన్, సి. ప్రభాకర్, ఆసుపత్రి ఆర్ఎంఓ డాక్టర్ ప్రతాప్ కల్లోగి, పీడియాట్రిక్ సర్జరీ హెచ్ఓడీ డాక్టర్ అనిల్ బాలరాజ్ పాల్గొన్నారు. అలాగే సొసైటీ అధ్యక్షులు కె.వి. జాన్సన్, సెక్రటరీ ఫాతిమా రెడ్డి, ట్రెజరర్ నరేంద్ర పాల్, అడ్వైజర్ ఆర్. రఘు, వైస్ ప్రెసిడెంట్ పి. అనిల్ కుమార్, అసిస్టెంట్ సెక్రటరీ సిహెచ్. సమత మరియు ఇతర సభ్యులు, వివిధ ట్రేడ్ యూనియన్ల ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
