TGSRTC Mahalaxmi Smart Card Telangana
ఆకేరు న్యూస్, హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ‘మహాలక్ష్మి’ ఉచిత బస్సు ప్రయాణ పథకంలో త్వరలోనే ఒక కీలక మార్పు రాబోతోంది. మహిళా ప్రయాణికులకు మరింత సౌకర్యవంతమైన, పారదర్శకమైన సేవలు అందించేందుకు వీలుగా తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TGSRTC) కీలక కసరత్తు ప్రారంభించింది. ఇప్పటివరకు ఉచిత ప్రయాణం కోసం స్థానికత గుర్తింపుగా వాడుతున్న ఆధార్ కార్డుల స్థానంలో.. ప్రత్యేకంగా ‘మహాలక్ష్మి స్మార్ట్ కార్డ్స్’ ప్రవేశపెట్టేందుకు ఆర్టీసీ సిద్ధమైంది.
జూన్ 2న తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ స్మార్ట్ కార్డుల పంపిణీని ప్రభుత్వం లాంఛనంగా ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది.
* స్మార్ట్ కార్డులు ఎందుకు అంటే..
ప్రస్తుతం మహిళలు తమ ఆధార్ కార్డు లేదా ఇతర ప్రభుత్వ గుర్తింపు కార్డులను చూపించి జీరో టికెట్లను పొందుతున్నారు. అయితే, దీనివల్ల కండక్టర్లు ప్రతి ఒక్కరి గుర్తింపు కార్డును క్షుణ్ణంగా పరిశీలించడం, వివరాలను నమోదు చేయడం కొంత ఇబ్బందిగా మారింది. రద్దీ సమయాల్లో ఇది ప్రయాణికులకు, సిబ్బందికి మధ్య సమయ వృధాకు, వాగ్వాదాలకు దారితీస్తోంది. ఈ ప్రక్రియను సరళతరం చేయడంతో పాటు, పథకంలో ఎలాంటి దుర్వినియోగం జరగకుండా పూర్తిగా పారదర్శకంగా ఉంచేందుకు ఆర్టీసీ ఈ నిర్ణయం తీసుకుంది. స్మార్ట్ కార్డ్స్ అందుబాటులోకి వస్తే.. కేవలం కార్డును స్కాన్ చేయడం ద్వారా సెకన్ల వ్యవధిలోనే జీరో టికెట్ జారీ చేసే అవకాశం ఉంటుంది.
* ‘సీజన్ పాస్’ తరహాలోనే పంపిణీ…
ప్రస్తుతం ఆర్టీసీ ద్వారా విద్యార్థులు, ఉద్యోగులు మరియు సాధారణ ప్రయాణికులకు ఇస్తున్న సీజన్ పాస్‌ల (Season Passes) మాదిరిగానే ఈ ‘మహాలక్ష్మి స్మార్ట్ కార్డుల’ను కూడా డిజైన్ చేయనున్నారు. ఈ కార్డుల కోసం మహిళలు ఆన్లైన్ లేదా నిర్దేశిత ఆర్టీసీ కౌంటర్ల ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
దరఖాస్తు సమయంలో స్థానికత గుర్తింపు కార్డులను సమర్పించాల్సి ఉంటుంది. ఒకసారి స్మార్ట్ కార్డ్ పొందిన తర్వాత, బస్సుల్లో ప్రయాణించేటప్పుడు ఆధార్ కార్డు చూపించాల్సిన అవసరం ఉండదు. కేవలం ఈ స్మార్ట్ కార్డ్ చూపిస్తే సరిపోతుంది.
* త్వరలోనే పూర్తి వివరాలు..
జూన్ 2న ఈ పథకాన్ని ప్రారంభించిన అనంతరం, విడతల వారీగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అర్హులైన మహిళలందరికీ ఈ కార్డులను పంపిణీ చేయనున్నారు. కార్డుల జారీ ప్రక్రియ, దరఖాస్తు విధానం, కావాల్సిన పత్రాల గురించిన పూర్తి వివరాలను ఆర్టీసీ అధికారులు త్వరలోనే అధికారికంగా వెల్లడించనున్నారు. స్మార్ట్ కార్డుల పంపిణీ పూర్తయిన తర్వాత, ఉచిత ప్రయాణానికి కేవలం మహాలక్ష్మి కార్డులను మాత్రమే అనుమతిస్తారని, ఆధార్ కార్డుల చెల్లుబాటును నిలిపివేస్తారని సమాచారం. కాబట్టి మహిళలు ఈ మార్పును గమనించి, కార్డుల జారీ ప్రక్రియ ప్రారంభం కాగానే దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.
Please tell us what is wrong. Your report will be sent to the website team.
