* సీనియర్ ప్రొఫెసర్ లే సూపరింటెండెంట్‌గా కొనసాగుతున్నారు
* అలంకార ప్రాయం .. ఎంజీఎం సూపరింటెండెంట్ పదవి
ఆకేరు న్యూస్ , వరంగల్ : ప్రతిష్టాత్మక వరంగల్ మహాత్మా గాంధీ మెమోరియల్ ఆస్పత్రిని (MGMH) దశాబ్దాల తరబడి నిర్లక్షం నీడ వెంటాడుతోంది. ఉత్తర తెలంగాణలో అతి పెద్ద ఆస్పత్రిగా పేరున్న ఎంజీఎం ఆస్పత్రి లో 1350 పడకల కెపాసిటీకి ఉన్నతీకరించారు. అనధికారికంగా రెండువేల మంది రోగులు ఈ ఆస్పత్రిలో ఉంటారు. ఇంత పెద్ద ఆస్పత్రికి అస్సలు సూపరింటెండెంట్ (Superintendent) పోస్టే లేదంటే ఆశ్చర్యం కలిగించగ మానదు. ఇపుడున్న సూపరింటెండెంట్ పదవి కేవలం అలంకార ప్రాయంగానే మారింది. అధికారాలు మాత్రం అంతంత మాత్రమే..
* సూపరింటెండెంట్ పోస్టేది..?
1954 లో ఎంజీఎం ఆస్పత్రిని ఏర్పాటు చేశారు. 1960లో కాకతీయ మెడికల్ కళశాలతో (KMC) అనుసంధానించబడింది. ఆకాలంలో సివిల్ సర్జన్ స్థాయి డాక్టర్‌ను సూపరింటెండెంట్‌గా నియమించారు. దశల వారిగా ఎంజీఎం ఉన్నతీకరించబడింది. అయినప్పటికీ సూపరింటెండెంట్ పోస్ట్‌ను మాత్రం అప్ గ్రేడ్ చేయలేదు. నిజానికి ఎంజీఎం ఆస్పత్రికి అడిషనల్ డీఎంఈ స్థాయి వైద్యుడిని ఎంజీఎం ఆస్పత్రికి సూపరింటెండెంట్ గా నియమించాల్సి ఉంటుంది. ప్రభుత్వం ఆ పోస్ట్ ను మంజూరి చేయక పోవడంతో కేవలం సీనియర్ ప్రొఫెసర్లల్లో ఎవరో ఒకరు ఇంచార్జీ సూపరింటెండెంట్‌గా కొనసాగుతున్నారు.
* సూపరింటెండెంట్ పోస్ట్ లేకపోతే ..?
ఎంజీఎం లాంటి అతిపెద్ద ఆస్పత్రికి సూపరింటెండెంట్ అంటే అన్ని రకాల అధికారాలు ఉన్నప్పుడే సిబ్బందితో పనిచేయించగలుగుతారు. సిబ్బంది విధులకు హాజరు కాక పోయినా, అవినీతికి, అక్రమాలకు పాల్పడినప్పటికీ చర్యలు తీసుకునే అధికారం ఉండదు. ఇపుడున్న స్థాయి పోస్ట్ వల్ల కేవలం క్లాస్ పోర్త్ ఉద్యోగులను మాత్రమే సస్పెండ్ చేయగలిగే అధికారం ఉంటుంది. అంతకు మించి స్థాయి అధికారి ఎలాంటి అవకవతవకలకు పాల్పడినప్పటికీ కూడా నేరుగా చర్యలు తీసుకునే అధికారం ఉండదు. అడిషన్ డీఎంఈ స్థాయి అధికారి స్థాయి సూపరింటెండెంట్ అయితే అసిస్టెంట్ ప్రొఫెసర్ స్థాయి ఉద్యోగిపై కూడా చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. అదే విదంగా ఆస్పత్రి కి సంబందించిన అభివృద్ధి ప్రతిపాదనలు , ఆర్థిక అంశాలు, నిధుల విడుదల లాంటి అనేక అంశాలు అడిషనల్ డీఎంఈ అధికారికి మాత్రమే ఉంటాయని ఎంజీఎం సీనియర్ వైద్యులు చెబుతున్నారు. మంజూరి పోస్ట్ కాకపోవడం వల్ల ఆస్పత్రి పాలన మీద నియంత్రణ వచ్చే అవకాశం లేకుండా పోతుంది.
* ఆ ఐదు జిల్లాలకు మంజూరి పోస్ట్‌లు
ఉమ్మడి వరంగల్ జిల్లాలోని మిగిలిన ఐదు జిల్లాలకు కూడా రాష్ట్ర ప్రభుత్వం అడిషనల్ డీఎంఈ స్థాయి అధికారులు సూపరింటెండెంట్ లుగా ఉండే విదంగా పోస్ట్‌లను మంజూరి చేసింది. భూపాలపల్లి, ములుగు, నర్సంపేట. మహబూబాబాద్, జనగాం వైద్య కళాశాలలకు అనుబందంగా ఉండే ఆస్పత్రులకు సూపరింటెండెంట్ పదవి అడిషనల్ డీఎంఈ స్థాయి అధికారులే ఉంటారు..
సీఎం రేవంత్ రెడ్డి దృష్టి సారించాలి.
రేపు ( 28 – 06- 2024 ) వరంగల్ పర్యటనకు వస్తున్నసందర్భంగా ఎంజీఎం ఆస్పత్రిపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని ఎంజీఎం ఆస్పత్రి వైద్యులు కోరుతున్నారు.
—————-