Bathini Fish Prasadam History
* లక్షలాది మందికి చేప ప్రసాదం
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : ఐదు తరాల విశ్వాసం.. బత్తిని సోదరుల వైద్యం.. ఏటా లక్షలాది మందికి చేప ప్రసాదం పేరుతో అందిస్తారు.
హైదరాబాద్ సంస్కృతిలో భాగమైన చేప ప్రసాదం” (Bathini Fish Prasadam) కు దాదాపు 180 ఏళ్ల సుదీర్ఘ చరిత్ర ఉంది. ప్రతి సంవత్సరం మృగశిర కార్తె ప్రవేశించే రోజున ఆస్తమా, శ్వాసకోశ వ్యాధిగ్రస్తుల కోసం ఈ ప్రసాద పంపిణీ కార్యక్రమాన్ని బత్తిని గౌడ్ కుటుంబం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తుంది.
ప్రజల్లో ఇంతటి విశ్వాసం పొందిన ఈ చేప ప్రసాదం మొదలైన తీరు చాలా ఆసక్తికరంగా ఉంటుంది.
* సాధువు ఉపదేశం
చేప ప్రసాదం ప్రజలకు అందించే ఈ సంప్రదాయం 1845 లో నాటి నిజాం కాలంలో ప్రారంభమైంది. బత్తిని కుటుంబ పూర్వీకుడైన బత్తిని వీరన్న గౌడ్ కాలంలో మొదలైంది. ఆయన పాతబస్తీలోని దూద్ బౌలి ప్రాంతంలో ఆయన కుటుంబం నివాసం ఉండేది. ఒకరోజు వీరన్న గౌడ్ ఇంటికి ఒక హిమాలయాల నుంచి సాధువు వచ్చారు. వీరన్న గౌడ్ ప్రజలకు అనేక రూపాల్లో సేవలు అందించే వారు. ఆయన సేవా గుణానికి సంతోషించిన ఆ సాధువు, శ్వాసకోశ వ్యాధులను నయం చేసే ఒక రహస్య మూలికల ఫార్ములాను ఆయనకు ఉపదేశించారు.
అయితే ఆ సాధువు ఒక కఠినమైన నిబంధన పెట్టారు. “ఈ విద్యను కేవలం మీ కుటుంబ సభ్యులకే పరిమితం చేయాలి, దీనిని ఎట్టి పరిస్థితుల్లోనూ వ్యాపారం చేయకుండా ప్రజలకు ఉచితంగా అందించాలి. ఒకవేళ దీనిని విక్రయిస్తే ఆ మందు పని చేయదని హెచ్చరించారు.
* హైదరాబాద్లో ఎలా విస్తరించిందంటే..?
వీరన్న గౌడ్ తర్వాత ఆయన కుమారుడు శివరామ్ గౌడ్, ఆపై శంకర్ గౌడ్ ఈ సంప్రదాయాన్ని కొనసాగించారు. ఆధునిక కాలంలో ఈ ప్రసాదాన్ని ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యంలోకి తెచ్చింది మాత్రం బత్తిని హరినాథ్ గౌడ్ ఆయన సోదరులు అనంతయ్య గౌడ్, ఉమామహేశ్వర్ గౌడ్ తదితరులు ఉన్నారు. అందుకే వీరు “బత్తిని సోదరులు” గా ప్రసిద్ధి చెందారు. ప్రారంభంలో పాతబస్తీ దూద్ బౌలిలోని వారి పూర్వీకుల ఇంట్లోనే ఈ పంపిణీ జరిగేది. కాలక్రమేణా దేశం నలుమూలల నుండి, విదేశాల నుంచి కూడా లక్షలాది మంది ప్రజలు రావడం ప్రారంభించారు. దాంతో ట్రాఫిక్, శాంతిభద్రతల సమస్యలు తలెత్తాయి.
జనం రద్దీని తట్టుకోవడానికి నాటి ప్రభుత్వం జోక్యం చేసుకుని, ఈ కార్యక్రమాన్ని నాంపల్లిలోని ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ కు మార్చింది. అప్పటి నుండి ప్రతి ఏటా ప్రభుత్వమే ఆర్టీసీ బస్సులు, మంచినీరు, పోలీసు బందోబస్తు, మత్స్య శాఖ ద్వారా చేప పిల్లల సరఫరా వంటి ఏర్పాట్లను పర్యవేక్షిస్తోంది.
* చేప పిల్లతో పాటు మూలిక
ఈ ప్రసాదంలో ప్రధానంగా ఉపయోగించేది “ముర్రెల్” (కొర్రమీను – Murrel Fish) చేప పిల్లలను.
బత్తిని కుటుంబం తయారు చేసిన రహస్య పసుపు రంగు మూలిక ముద్దను (Herbal Paste) 2-3 అంగుళాల పొడవున్న బతికున్న కొర్రమీను చేప పిల్లను నోట్లో పెడతారు. ఆ చేప పిల్లను రోగి నోట్లో వేసి మింగిస్తారు.
బతికున్న చేప లోపలికి వెళ్లేటప్పుడు తోక ఆడిస్తూ గొంతు, శ్వాసనాళాల గోడలపై పేరుకుపోయిన కఫాన్ని (Phlegm) శుభ్రం చేస్తుందని, అదే సమయంలో మూలిక ఔషధం ఊపిరితిత్తుల్లోకి చేరి ఆస్తమాను నివారిస్తుందని ప్రజల నమ్మకం.
* శాఖాహారులకు ప్రత్యేకం
చేపలు తీసుకోని వారి కోసం బెల్లం (Jaggery) లో ఈ మూలికను కలిపి ప్రసాదంగా ఇస్తారు.
ఈ ప్రసాదం తీసుకున్న తర్వాత 45 రోజుల పాటు నిర్దేశిత ఆహార నియమాలను (పథ్యం) కచ్చితంగా పాటించాల్సి ఉంటుంది. అలాగే వరుసగా మూడు సంవత్సరాలు ఈ ప్రసాదం తీసుకోవాలని చెబుతారు.
కొన్నేళ్ల క్రితం హేతువాద సంఘాలు (Rationalists), జనవిజ్ఞాన వేదిక (JVV) వంటి సంస్థలు ఈ విధానాన్ని సవాలు చేస్తూ కోర్టుకెళ్లాయి. ఇందులో శాస్త్రీయత లేదని, ల్యాబ్ టెస్టులు చేయించాలని డిమాండ్ చేశాయి. కోర్టు ఆదేశాల ప్రకారం, బత్తిని కుటుంబం దీనిని శాస్త్రీయమైన “మందు” (Medicine) అని ప్రచారం చేయకుండా, తమ నమ్మకం ప్రకారం ఇచ్చే “చేప ప్రసాదం” (Fish Prasadam) గా పేరు మార్చారు. నాటి నుంచి దీనిని అధికారికంగా ‘చేప ప్రసాదం’ గానే పిలుస్తున్నారు. ల్యాబ్ పరీక్షల్లో ఇందులో ఎటువంటి హానికర రసాయనాలు లేవని తేలింది.
———————–
