* కౌంట్‌డౌన్.. “షేక్”పేట్‌తో మొదలు
* మొత్తం 10 రౌండ్లలో లెక్కింపు
* ఎర్రగడ్డ డివిజన్‌తో ముగింపు
* 2వ రౌండ్ తర్వాత 2,995 ఓట్ల ఆధిక్యంలో కాంగ్రెస్
ఆకేరు న్యూస్, ప్రత్యేక ప్రతినిధి
జూబ్లీహిల్స్ లో ఎమ్మెల్యేగా చక్రం తిప్పేదెవరో కాసేపట్లోనే తేలిపోనుంది. హోరాహోరీగా సాగిన ఎన్నిక ఫలితాలు నేడు వెల్లడికానున్నాయి. ఈరోజు ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది. ఉప ఎన్నిక కౌంటింగ్ ప్రక్రియకు అధికారులు పక్కాగా ఏర్పాట్లు పూర్తి చేశారు. యూసుఫ్‌గూడ కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో మొత్తం 10 రౌండ్లలో అభ్యర్థుల భవితవ్యం తేలనుంది. మొత్తం 42 టేబుల్స్ ద్వారా ఓట్ల లెక్కింపు కొనసాగనుంది. ఒకటో నెంబర్ పోలింత్ బూత్ షేక్‌పేట డివిజన్ నుంచి ప్రారంభమై కౌంటింగ్ ప్రక్రియ ఎర్రగడ్డతో ముగుస్తుంది. ఫ మొదటగా షేక్‌పేట్ డివిజన్ ఓట్ల లెక్కింపు.. తర్వాత వరుసగా వెంగళ్రావునగర్, రహమత్‌నగర్, యూసఫ్‌గూడ, సోమాజిగూడ, బోరబండ చివరగా ఎర్రగడ్డ డివిజన్ల ఓట్లను లెక్కిస్తారు. 58 మంది అభ్యర్థులు బరిలో ఉండగా, ముగ్గురు మధ్యే టగ్ ఆఫ్ వార్ నడిచింది. ఇప్పటి వరకు నడిచిన కౌంటింగ్ లో 2వ రౌండ్ తర్వాత 2,995 ఓట్ల ఆధిక్యంలో కాంగ్రెస్ కొనసాగింది. నాలుగో రౌండ్ వచ్చేసరికి 9 వేలకు పైగా ఆధిక్యంలో ఉన్నట్లు సమాచారం.
మహిళలదే హవా..
ఉప పోలింగ్ లో మొత్తం 48.49 శాతం పోలింగ్ నమోదైంది. వీరిలో పురుషుల ఓటింగ్ శాతం 47.83 శాతం, మహిళల ఓటింగ్ 49.20 శాతం ఉంది. మహిళల ఓట్లే ఎక్కువగా ఉన్నాయి. అదే కాకుండా పోలింగ్ శాతం 60 కంటే ఎక్కువ నమోదైన 34 కేంద్రాల్లో కూడా 18 చోట్ల మహిళలే ఎక్కువ సంఖ్యలో ఓటింగ్‌లో పాల్గొన్నారు. పోలింగ్ అత్యధికంగా నమోదైన కేంద్రాల్లో 53 శాతం ఎక్కువ కేంద్రాల్లో మహిళలు ఓటు హక్కును సద్వినియోగం చేసుకున్నారు. ఈ గణాంకాలను గమనిస్తే మహిళలే ఎమ్మెల్యేను డిసైడ్ చేసే స్థితిలో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి నవీన్ యాదవ్, బీఆర్ ఎస్ నుంచి మాగంటి సునీత, బీజేపీ నుంచి లంకల దీపక్ రెడ్డి పోటాపోటీగా ప్రచారం చేశారు. ఓటర్లను ఆకట్టుకునేందుకు విశేషంగా శ్రమించారు. వీరిలో గెలిచే ఎమ్మెల్యే ఎవరో కాసేపట్లో తేలనుంది.
అటూ.. ఇటూ సెంటిమెంటే!
ప్రచారపర్వంలో ముగ్గురు పోటీ పడినా.. ఓటింగ్ లో ఇద్దరి మధ్యే ప్రధాన పోటీ నడిచినట్లు ఎగ్జిట్ పోల్స్ ద్వారా తెలుస్తోంది. వారే నవీన్ యాదవ్, మాగంటి సునీత. ఆ ఇద్దరికీ ఒకటి కామన్ పాయింట్ ఉంది. నవీన్ యాదవ్ వరుసగా రెండు సార్లు పోటీ ఓడిపోయారు. దీంతో ఆయనపై స్థానికంగా కొంత సానుభూతి ఉంది. మాగంటి సునీత భర్త గోపీనాథ్ ఇటీవలే మరణించారు. అందుకే ఇక్కడ ఉప ఎన్నిక జరిగింది. భర్త మరణంతో ఆ సీటును సునీతకు ఇచ్చారు. ఈక్రమంలో ఈమె వైపు కూడా సానుభూతి పవనాలు వీచే అవకాశాలు ఉన్నాయి. ఈక్రమంలో ఎవరి సానుభూతికి ఎక్కువ ఓట్లు పడతాయో అన్నది ఉత్కంఠగా మారింది.
మొక్కులు.. పూజలు
విజయం తమనే వరించాలంటూ అభ్యర్థులు మొక్కని దేవుడు లేడని, ఎక్కని గుడి లేడని తెలుస్తోంది. జూబ్లీహిల్స్ ఉపఎన్నిక గతంలో ఎన్నడూ లేని విధంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర ఆసక్తికరంగా మారిన విషయం తెలిసిందే. ఎన్నికను ఇటు అధికార కాంగ్రెస్, అటు ప్రతిపక్ష బీఆర్ఎస్, బీజేపీలు ప్రతిష్టాత్మకంగా తీసుకుని జోరుగా ప్రచారం నిర్వహించాయి. అయితే షెడ్యూల్ విడుదల కాకముందు ఉన్న పరిస్థితికి.. పోలింగ్ రోజున ఉన్న పరిస్థితికి చాలా తేడా ఉండడంతో ఓ పార్టీ నాయకులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఓటర్లపై నమ్మకం పెట్టుకున్న అభ్యర్థులు రెండు రోజులుగా ఇష్టదైవాలను కూడా గట్టిగా మొక్కుతున్నట్లు తెలిసింది. తమను ఎలాగైనా గెలిపించాలని కొందరు ముడుపులు కట్టినట్లు సమాచారం. గతంలో కంటే ఈసారి జరిగిన ఎన్నిక తమకు చాలా ప్రతిష్టాత్మకంగా మారాయని.. గెలుపోటములు తమ భవిష్యత్‌ను నిర్ణయిస్తాయంటూ దేవతామూర్తులను వేడుకుంటున్నారు. ఎవరి పూజలు ఫలిస్తాయో ఈరోజు మధ్యాహ్నం అనంతరం కొలిక్కి వచ్చే అవకాశం ఉంది.
…………………………………………
