* పిఠాపురం నియోజకవర్గంలో వేర్వేరుగా సంక్రాంతి సంబరాలు
* జనసేన, టీడీపీ పోటాపోటీ వేదికలు
ఆకేరు న్యూస్, పిఠాపురం : ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి వచ్చేందుకు తెలుగుదేశం(Telugudesam), జనసేన(Janasena) కలిసి పనిచేశాయి. సీట్ల పంపకాల సమయంలో అక్కడక్కడా పొరపచ్చాలు బయటపడ్డా.. అనంతరం ప్రచారంలో మాత్రం ఇబ్బందులు లేకుండా ముందుకు సాగాయి. కలిసికట్టుగా ఎన్నికల్లో పనిచేసి బ్రహ్మాండమైన విజయం సొంతం చేసుకున్నాయి. ఫలితంగా ఏపీలో టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చింది. అనంతరం కూడా ఇరు పార్టీల అధినాయకులు నారా చంద్రబాబునాయుడు(Nara ChanrababuNaidu), పవన్ కల్యాణ్ (Pavan Kalyan) ఒకరికొకరు గౌరవం ఇచ్చిపుచ్చుకుంటూ ఐక్యతను చాటారు. ముఖ్యమంత్రిగా ఒకరు, ఉప ముఖ్యమంత్రిగా మరొకరు కొనసాగుతున్నారు. పాలనలో ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. చాలా సందర్భాల్లో బాబు, పవన్ మాట్లాడుతూ.. కూటమి ఐక్యత కొనసాగుతుందని ప్రకటించారు. నియోజకవర్గాల్లో కూడా టీడీపీ, జనసేన శ్రేణులు కలిసికట్టుగానే కార్యక్రమాలు నిర్వహించాలని పిలుపునిస్తూ వస్తున్నారు. కానీ, క్షేత్రస్థాయిలో అధినాయకుల ఆదేశాలను, సూచనలను పాటించడం లేదు. ఉపముఖ్యమంత్రి సొంత నియోజకవర్గమైన పిఠాపురమే అందుకు నిదర్శనంగా చెప్పుకోవచ్చు.
పిఠాపురం నియోజకవర్గంలో గెలుపు కోసం జనసేన అభ్యర్థి పవన్ కల్యాణ్, టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జి వర్మ (Varma) విశేషంగా కష్టపడ్డారు. కలిసిమెలిసి ప్రచారం చేశారు. పవన్ అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తూ తొలుత టీడీపీ శ్రేణులు భగ్గుమన్నా, అనంతరం అధినేత హామీతో ఎన్నికల్లో ఇరుపార్టీలు కలిసి పనిచేశాయి. కూటమి విజయానికి బాటలు వేశాయి. ఇక్కడి వరకు బాగానే ఉంది కానీ.. ప్రస్తుతం పరిస్థితి అందుకు విరుద్ధంగా ఉంది. చాలా సందర్భాల్లో టీడీపీ, జనసేన మధ్య లుకలుకలు బయటపడ్డాయి. అధికారంలోకి వచ్చిన తర్వాత జనసేన తమకు సరైన ప్రాధాన్యం ఇవ్వడం లేదని టీడీపీ(Tdp) ఆరోపిస్తోంది. దీంతో ప్రభుత్వ ప్రచార కార్యక్రమాలను వేర్వేరుగానే నిర్వహిస్తున్నాయి. తాజాగా సంక్రాంతి సంబురాలను కూడా వేర్వేరుగా నిర్వహించాయి. గతంలో టీడీపీ, ఆ తర్వాత వైసీపీ అధికారంలోకి ఉన్నప్పుడు పిఠాపురం(Pithapuram)లో ఒకే చోట సంక్రాంతి సంబరాలు జరిగాయి. ఈ ఏడాది టీడీపీ బరి(కోళ్ల పందాలకు చెందినది), జనసేన బరి అంటూ వేర్వేరుగా నిర్వహించడం చర్చనీయాంశంగా మారింది. ఇక్కడి వైఎస్ఆర్ గార్డెన్స్ లో కొద్దిపాటి దూరంలోనే ఇరు పార్టీలు సంక్రాంతి సంబురాలను వేర్వేరుగా నిర్వహించాయి. ఆయా పార్టీల నేతల ఆధ్వర్యంలో కోళ్ల పందాలు, గుండాటలు కొనసాగాయి. ఏటా ఒకేచోట జరిగే సంక్రాంతి సంబురాలు ఈసారి నేనిక్కడ.. నువ్వక్కడ.. అంటూ కార్యకర్తలు, ప్రజలు కూడా విడిపోయి వేర్వేరుగా పాల్గొనడం గమనార్హం. కొందరు మాత్రం రెండు చోట్లా కార్యక్రమాలను వీక్షిస్తూ ఎంజాయ్ చేశారు. ఏదేమైనా సంక్రాంతి పండుగ నేపథ్యంలో డిప్యూటీ సీఎం ఇలాకాలో కూటమిలో బీటలు బట్టబయలు కావడం గమనించాల్సిన విషయం.
…………………………………….