
* హైదరాబాద్లో మహిళ మృతి..
* స్వల్పగాయాలతో బయటపడ్డ రెండున్నరేళ్ల బాలుడు
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : బంగారం చోరీకి గురైందని తీవ్రంగా మనస్తాపానికి గురైంది. ఎంత వెదికినా కనిపించకపోవడంతో కుంగిపోయింది. తన రెండున్నరేళ్ల బాలుడితో కలిసి భవనంపై నుంచి ఆత్మహత్య చేసుకుంది. బాలుడు స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. హైదరాబాద్ (Hyderabad) లో ఈ దుర్ఘటన జరిగింది. వనస్థలిపురం పోలీసుల కథనం ప్రకారం.. వనస్థలిపురం చింతల్కుంటకు చెందిన సుధేష్ణ (28)కు నాలుగేళ్ల కిందట అమ్మదయ కాలనీకి చెందిన నోముల ఆశీష్ కుమార్తో వివాహమైంది. వీరు ఆగమయ్య నగర్ కాలనీలో అద్దె ఇంట్లో నివసిస్తున్నారు. వీరికి రెండున్నరేళ్ల కుమారుడు ఆరుష్ కుమార్ ఉన్నాడు. మే 16న సుధేష్ణ నాచారంలో బంధువుల ఇంటికి ఓ శుభకార్యానికి హాజరైంది. తిరిగి వచ్చే సరికి ఇంట్లో ఉన్న ఏడు తులాల బంగారు ఆభరణాలను గుర్తు తెలియని వ్యక్తులు చోరీ (Gold Missing) చేశారు. ఎంత వెదికినా అవి దొరక్కపోవడంతో సుధేష్ణ తీవ్ర మనస్తాపానికి గురైంది. మంగళవారం ఆగమయ్య నగర్లోని తన ఇంటి మూడో అంతస్తు్కు కుమారుడితో పాటు వెళ్లింది. అక్కడి నుంచి కుమారుడిని ఎత్తుకుని కిందకు దూకింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన సుదేష్ణ ను స్థానికులు ఆస్పత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆమె మృతి చెందింది. ఆమె కుమారుడు ఆరుష్ స్వల్పగాయాలతో బయట పడ్డాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
………………………………………………