
* అమిత్ షా ట్వీట్ తో కేశవరావు మృతి పై స్పష్టత
* నక్సలైట్ ఉద్యమ చరిత్రలో ఇంత పెద్ద నేత చనిపోవడం ఇదే మొదటి సారి
* వరంగల్లో ఎన్ ఐటీ లో ఎంటెక్
* మావోయిస్టు అగ్రనేతగా ఎదిగిన నంబాల కేశవరావు
* గెరిల్లా యుద్ధ వ్యూహాలు రచించడంలో దిట్ట
* ఏపీ సీఎం చంద్రబాబుపై బాంబుదాడి ప్రధాన సూత్రధారి
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : ఛత్తీస్గఢ్ నారాయణపూర్ జిల్లాలో జరిగిన భారీ ఎన్కౌంటర్లో 28 మావోయిస్టులు మృతి చెందినట్లుగా భద్రతా దళాలు ప్రకటించాయి. వీరిలో మావోయిస్టు అగ్రనేత నంబాల కేశవరావు అలియాస్ బసవరాజు (Nambala Keshava Rao) (67) ఉన్నట్లు స్పష్టమైంది. కేంద్ర హోం మంత్రి అమిత్ షా మావోయిస్ట్ పార్టీ అగ్రనేత నంబళ్ల కేశవ రావు ఎన్ కౌంటర్ లో చనిపోయాడని ప్రకటించారు. ఈ మేరకు ఆయన ఎక్స్ లో ట్వీట్ చేశారు.. ఆయన ఉన్నారన్న సమాచారంతోనే బలగాలు మాధ్ ప్రాంతాన్ని చుట్టుముట్టాయి. ఈ క్రమంలోనే మావోయిస్టులు, భద్రతా బలగాలకు ఎదురుకాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో బసవరాజు మృతి చెందారని తెలుస్తోంది. నంబాల కేశవరావు స్వస్థలం శ్రీకాకుళం జిల్లా (Srikakulam District) జియ్యన్నపేట. ఈయన తండ్రి ఉపాధ్యాయుడు. వరంగల్ (Warangal) ఆర్ఈసీలో ఇంజినీరింగ్ చదివారు. 1974లో B.Tech చదువుతున్న సమయంలో పీపుల్స్ వార్ సిద్ధాంతాల పట్ల ఆకర్షితులయ్యారు. పీపుల్స్ వార్ వ్యవస్థాపకుల్లో నంబాల కేశవరావు ఒకరు. తూర్పు, విశాఖ జిల్లాలో మావోయిస్టు పార్టీలో పని చేశారు. 2018లో గణపతి రాజీనామాతో మావోయిస్టు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారు. 2010లో ఛత్తీస్గఢ్లో 76 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు మృతి ఘటనకు నంబాల సూత్రధారి. గెరిల్లా యుద్ధ వ్యూహాలు రచించడంలో కేశవరావు దిట్ట. ఐఈడీల వినియోగంలోనూ ఆయన నిపుణుడు. కేశవరావుపై రూ. 1.5 కోట్ల రివార్డు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో చంద్రబాబు(Chandrababu)పై అలిపిరిలో జరిగిన బాంబు దాడి ప్రధాన సూత్రధారి కేశవరావు అని వెల్లడించారు.
……………………………………….