* మూసీ పునరావాస మహిళా సంఘాలకు రూ.3.44కోట్ల విలువైన నగదు చెక్కులు పంపిణీ
* మంత్రి సీతక్క
ఆకేరున్యూస్, హైదరాబాద్: మూసీ పరివాహక ప్రాంతాల్లో నివసిస్తున్న వారికి పునరావాసం కల్పించి, వారి ఆర్థిక అభివృద్ధికి ప్రభుత్వం పూర్తి న్యాయం చేస్తుందని మంత్రి ధనసరి అనసూయ (సీతక్క) పేర్కొన్నారు. శుక్రవారం ప్రజా భవన్లో నిర్వహించిన కార్యక్రమంలో మూసీ పరివాహక ప్రాంతాల స్వయం సహాయక సంఘాల మహిళలకు ఆర్థిక సహాయం అందించారు. ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ… ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి వెళ్ళేటప్పుడు జరిగే బాధను గుర్తుచేస్తూ, ఇటీవల ఖమ్మం, మహబూబాబాద్ వంటి ప్రాంతాలు వరదల వల్ల నష్టపోయాయని, అలాగే మూసీ మురికి నీటి కారణంగా అనారోగ్య సమస్యలు వచ్చాయన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఆ నీటిని త్రాగదగిన స్థాయికి తీసుకు రావడానికి కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. బాధిత మహిళలకు రూ. 2 లక్షల ఆర్థిక సహాయం అందిస్తున్నామని, అందులో రూ. 1.40 లక్షలు సబ్సిడీగా ఉంటాయని, మిగిలిన రూ. 60 వేల రూపాయలు మూడు సంవత్సరాల్లో చెల్లించాల్సి ఉంటుందని వివరించారు. ఇందిరా మహిళా శక్తి పథకం ద్వారా వివిధ ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామన్నారు. అనుకోకుండా వరదలు వచ్చినప్పుడు ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించేందుకు సన్నద్ధంగా ఉంటామని తెలిపారు. పునరావాసం పొందిన బాధిత కుటుంబాలకు ఉచిత విద్య, అంగన్వాడీ కేంద్రాలలో ప్రవేశం, అలాగే రెండు పడకల గదుల నిర్మాణం ఉచితంగా అందించామని పేర్కొన్నారు. మూసీ రివర్ పరిరక్షణలో జిహెచ్ఎంసి అర్బన్ డెవలప్మెంట్ విభాగం ఆధ్వర్యంలో బాధితులకు న్యాయం చేకూర్చే విధంగా బాగా కృషి చేశారని మంత్రి సీతక్క ప్రశంసించారు. ప్రభుత్వ నిర్ణయం మేరకు జిహెచ్ఎంసి కమిషనర్ కృషి మేరకు బాధిత కుటుంబాలకు న్యాయం చేకూర్చడం ముఖ్య భూమిక పోషించినట్లు పేర్కొన్నారు. ఇక నుండి కూడా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మూసీ ప్రక్షాళన జిహెచ్ఎంసి పాత్ర కీలకమని మంత్రి సీతక్క ప్రశంసించారు.
మలక్పేట్ ఎమ్మెల్యే అహ్మద్ బిన్ బలాల మాట్లాడుతూ… మలక్ పేట్ నియోజకవర్గంలో మూసీ పరివాహక ప్రాంతంలో వరదలు వచ్చినప్పుడు పునరావస కేంద్రాలకు తరలించేవారమని, ఇప్పుడు ఆ పరిస్థితి లేదని, మూసీ నిర్వాసితులకు పిల్లి గుడిసె 2 BHK కాలనీలో 130 కుటుంబాలకు పునరావాసం కల్పించామని తెలిపారు. మూసీలో చాలా మంది బాధ పడ్డారని ఇప్పుడు ఏ బాధ ఉండదని తెలిపారు. వాటర్ సమస్యను పరిష్కరించడానికి ఆర్ ఓ ప్లాంట్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా మంత్రి మూసీ పునరావాస మహిళా సంఘాలకు రూ.3.44కోట్లను 172 మంది మహిళలకు ఒక్కొక్కరికి 2 లక్షల చొప్పున ఆర్థిక సహాయాన్ని మలక్ పేట్, కార్వాన్ శాసన సభ్యులు అహ్మద్ బిన్ బలాల, కౌసర్ మొహమందిన్, డిప్యూటీ మేయర్ శ్రీలత శోభన్ రెడ్డిలతో కలిసి పంపిణీ చేసారు. ఈ కార్యక్రమంలో సేర్ప్ సి ఇ ఓ దివ్య దేవరాజ్, మూసీ జె డీఎం గౌతమి, శ్రీనివాస్ రెడ్డి, మూసీ ఈ డి, ఎస్.సి కార్పొరేషన్ ఎండి మల్లయ్య భట్టు, డి ఈ ఓ తదితరులు పాల్గొన్నారు.
……………………………………..