Student Crime Raises Concerns Over Teachers Safety
* గురువును బలిగొన్న నేటి నేర ప్రవృత్తి
* పెచ్చు మీరుతున్న విద్యార్థుల ప్రవర్తన
* గురువు భయం గుప్పిట్లో బతికే దుస్థితా…. ?
ఆకేరు న్యూస్, కమలాపూర్
చదువులమ్మ తోటలో అక్షరాల స్థానంలో కత్తులు మొలుస్తున్నాయి. 15 ఏళ్ల చిరు ప్రాయంలోనే కక్షలు తీర్చుకుంటున్నాయి. నల్గొండ జిల్లా కొండమల్లేపల్లిలో జరిగిన నాగార్జున గ్రామర్ కాన్సెప్ట్ స్కూల్ ప్రిన్సిపాల్ రూపా రెడ్డి హత్య ఉదంతం కేవలం ఒక వార్త కాదు. ఇది మన విద్యా వ్యవస్థ, సమాజం కుటుంబ వ్యవస్థల గుండెల్ని పిండేస్తున్న ఒక విషాదకర సత్యం. ఒకటి కాదు రెండు కాదు, ఏకంగా 27 కత్తిపోట్లతో ప్రాణాలు తీసిన ఆ హేయమైన తీరు చూసి పోలీసులే విస్మయానికి గురయ్యారంటే, నేటి సమాజంలో పిల్లల మానసిక స్థితి ఏ స్థాయికి దిగజారిందో అర్థం చేసుకోవచ్చు.
* గురువు చేసిన నేరం ఏమిటి ?
చదువు నేర్పి, మంచి చెడు వివరిస్తూ సన్మార్గంలో నడిపించాల్సిన ఒక గురువు చేసిన నేరం ఏమిటి ? స్కూల్‌కి సెల్ ఫోన్ తీసుకురావద్దని చెప్పడమే ఆమె చేసిన తప్పా? ఈ చిన్న నిబంధనే ఆమెకు మరణశిక్షగా మారుతుందని ఎవరూ ఊహించి ఉండరు. గంజాయికి అలవాటుపడి, వ్యసనాలకు బానిసైన ఆ ఇద్దరు విద్యార్థులు డబ్బు కోసం, విలాసాల కోసం తమను విద్యాబుద్ధులు నేర్పించిన గురువు ప్రాణాలనే బలిగొన్నారు. గురువును గౌరవించాల్సిన లేత చేతులు, క్రమశిక్షణను భరించలేక కత్తులు పట్టడం చూస్తుంటే రేపటి తరాల భవిష్యత్తు ఎంత అంధకారంలోకి వెళ్తుందోనని ప్రతి పౌరుడూ వణికిపోతున్నాడు.
ఈ దారుణ సంఘటన మన సమాజంపై ఒక పెద్ద ప్రశ్నార్థకం వేస్తోంది. తల్లిదండ్రులు ఉపాధి కోసం పిల్లలను సరిగ్గా పట్టించుకోకపోవడం, సోషల్ మీడియా ప్రభావం, క్షణికావేశంలో తీసుకుంటున్న వినాశకర నిర్ణయాలు లేత మనసులను ఎలా విషపూరితం చేస్తున్నాయో ఈ ఘటనే సాక్ష్యం. గురువు భయం గుప్పిట్లో బతికే దుస్థితి వస్తే, ఇక బడులలో విద్యార్థులు నేర్చుకోవాల్సిన మంచి, చెడు ,న్యాయం , నైతికత, మానవత్వం ఎక్కడ మిగులుతాయి? ప్రపంచ దేశాలు కాంక్షిస్తున్న శాంతిని నెలకొల్పే సమాజం ఎలా తయారవుతుంది. ఇలాంటి అనేక ప్రశ్నల పట్ల ప్రభుత్వాలు సరైన నిర్ణయం తీసుకొని మార్గదర్శకాలను అమలు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
ఇలాంటి దారుణం పునరావృతం కాకుండా ఉండాలంటే ప్రభుత్వాలు, పాఠశాల యాజమాన్యాలు, తల్లిదండ్రులు సమష్టిగా కదలాల్సిన సమయం ఆసన్నమైంది. పాఠశాలల్లో కౌన్సిలింగ్ సెషన్స్ నిర్వహించడం, డ్రగ్స్ రహిత వాతావరణాన్ని సృష్టించడం, ఉపాధ్యాయులకు పూర్తి స్థాయి చట్టపరమైన రక్షణ కల్పించడం తక్షణ కర్తవ్యం. అప్పుడే మరో రూపా రెడ్డి బలి కాకుండా ఉంటారు, అక్షరాల తోటలో మళ్లీ మానవత్వం మొలకెత్తుతుంది.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
