* మూసీ మాటున మూటలు వెనకేస్తున్నారు
* బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : మూసీ పునరుజ్జీవం పేరుతో కాంగ్రెస్ సర్కారు రియల్ ఎస్టేట్ వ్యాపారానికి ప్రాధాన్యం ఇస్తోందని , అసలు ఉద్దేశం అదేనని బీఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ ఆరోపించారు. తాము మూసీ అభివృద్ధికి వ్యతిరేకంకాదని, లూటిఫికేషన్ కే వ్యతిరేకమని స్పష్టం చేశారు. హైదరాబాద్ నాచారంలో బీఆర్ ఎస్ హయాంలో చేపట్టి, నిర్మించిన ఎస్టీపీని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలిసి కేటీఆర్ పరిశీలించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. పదేళ్లపాటు ఎంతో కష్టపడి నగరాన్ని అభివృద్ధిపథంలో నిలిపామని చెప్పారు. ఇంటింటికీ నీళ్లు ఇచ్చే తొలి రాష్ట్రంగా తెలంగాణను మార్చామని వెల్లడించారు. ‘హైదరాబాద్లో తాగునీరు, కరెంటు కష్టాలు లేకుండా చేశామన్నారు.
వర్షాలతో వరదలు పోటెత్తకుండా చర్యలు తీసుకున్నాం. నగరంలోని నాలాలు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీని అభివృద్ధి చేశాం. ఎస్టీపీలు ఏర్పాటు చేసి, దాదాపు 20 కోట్ల లీటర్ల మురుగు నీటిని రోజూ శుద్ధి చేసేలా చర్యలు తీసుకున్నామని వివరించారు. సుమారు నాలుగు వేల కోట్లతో ఎస్టీపీలు ఏర్పాటు చేశాంమన్నారు. బీఆర్ఎస్ హయాంలో కట్టిన ఎస్టీపీలతోనే మురుగునీరు శుద్ధి అవుతున్నదని తెలిపారు. ఎల్బీనగర్లో భారతదేశంలోనే అతిపెద్ద ఎస్టీపీని నిర్మించామని, మూసీపై 14 బ్రిడ్జిలు కట్టడానికి ప్రణాళిక రచించాం. మొత్తం రూ.20 వేల కోట్లతో మూసీ అభివృద్ధికి ప్రణాళిక రచించాం. ఇప్పుడు రేవంత్ లక్షన్నర కోట్లతో మూసీ సుందరీకరణ అంటున్నారు. ఢిల్లీకి మూటలు పంపేందుకు మూసీ మాటున మూటలు వెనకేస్తున్నారని విమర్శించారు.
………………………………………………..