
* పలకరింపేనా.. మతలబు ఏమైనా ఉందా..?
ఆకేరు న్యూస్, జనగామః ఇరువురు వైరి వర్గాలు.. ఒకరు ఉప్పు.. ఒకరు నిప్పు.. ఒకరు ఉత్తర దృవం.. మరొకరు దక్షిణ దృవం.. ఇరువురు ఎదురెదురుగా ఎమ్మెల్యేలుగా పోటీ చేశారు. ఒకరు ఓడారు.. ఒకరు గెలిచారు. రాజకీయ విమర్శలతో ఇరువురు తూలనాడుకోవడం.. విమర్శలు చేసుకోవడం.. దూషణలు చేసుకోవడం నిత్యకృత్యం. ఇది రాజకీయం.. మరి ఇప్పుడు ఇద్దరు కలుసుకున్నారు.. ఇది ఎవ్వరు ఊహించని కలయిక. మరి ఈ కలయిక కేవలం పరామర్శకేనా.. లేక ఇందులో ఏదైన మతలబు ఉందా అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. వారే జనగామ ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, డీసీసీ అధ్యక్షుడు కొమ్మూరి ప్రతాప్‌రెడ్డిలు. ఇరువుర గత ఎన్నికల్లో జనగామ ఎమ్మెల్యే స్థానం కోసం పల్లా రాజేశ్వర్‌రెడ్డి బీ ఆర్ ఎస్ నుంచి, కొమ్మూరి ప్రతాప్‌రెడ్డి కాంగ్రెస్ నుంచి పోటీ చేశారు. 15783 ఓట్లతో కొమ్మూరిపై పల్లా రాజేశ్వర్‌రెడ్డి గెలుపొందారు. ఇరువురు రెండు పార్టీలకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇటీవల పల్లా రాజేశ్వర్‌రెడ్డి ప్రమాదానికి గురయ్యారు. గత కొంతకాలంగా దావాఖానాలో చికిత్స పొంది హైదరాబాద్‌లోని తన స్వగృహంలో విశ్రాంతి తీసుకుంటున్నారు. ఈ రోజు పల్లాను పరామర్శించేందుకు కొమ్మూరి పల్లా ఇంటికి వెళ్ళడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. వైరి వర్గాల నేతలు పరామర్శల పేరుతో పకలరించుకోవడం కేవలం పరామర్శ వరకే పరిమితమా.. లేక రాజకీయ మతలబు ఏమైదా ఉందా అనేది అటు బీ ఆర్ ఎస్, ఇటు కాంగ్రెస్ కార్యకర్తల మదిని తొలుస్తున్న మిలియన్ డాలర్ల ప్రశ్న. కొమ్మూరి ప్రతాప్‌రెడ్డి గతంలో బీ ఆర్ ఎస్ ఆధినేత కేసీఆర్ కు ప్రియమైన శిష్యుడు. కేసీఆర్ ఆశీస్సులతో కొమ్మూరి వరంగల్ జిల్లా టీ ఆర్ ఎస్ అధ్యక్షుడిగా పనిచేశారు. చేర్యాల ఎమ్మెల్యేగా కే సీ ఆర్ చలువతో గెలిచారు. ఆ తరువాత జరిగిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో కొమ్మూరి కేసీఆర్‌ను వీడి పలు రాజకీయ పార్టీల్లో చేరారు. ఇప్పుడు కాంగ్రెస్ జనగామ జిల్లా అధ్యక్షుడిగా ఉన్నారు. రాబోవు రోజుల్లో అసెంబ్లీ నియోజకవర్గాలు పెరుగుతున్న నేపథ్యంలో జనగామ జిల్లాలో చేర్యాల నియోజకవర్గం మళ్ళీ ఏర్పడుతుందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ తరుణలో చేర్యాల నియోజకవర్గంలో పాగా వేసేందుకు కొమ్మూరి ఏమైనా కేసీఆర్‌తో టచ్‌లోకి వెళుతున్నాడా.. అందుకు కేసీఆర్‌కు అత్యంత సన్నిహితుడైన పల్లా రాజేశ్వర్‌రెడ్డి ని పరామర్శ పేరుతో మచ్చిక చేసుకుంటున్నాడా అనే గుసగుసలు వినిపిస్తున్నాయి. కొమ్మూరి, పల్లా రాజేశ్వర్‌రెడ్డిలు ఇకే సామాజికవర్గం కావడంతో, పరామర్శ పేరుతో ఏకంగా పల్లా ఇంటికే వెళ్ళడంతో ఏదైనా రాజకీయ ప్రాధాన్యత ఉంటుందనేది టాక్. తన కొడుకు రాజకీయ భవిష్యత్ కోసమే పల్లాను కలిసినట్లు మరోవైపు చర్చలు సాగుతున్నాయి. ఏదేమైనా పల్లాను పరామర్శించిన కొమ్మూరి చర్య ఇప్పుడు జనగామ నియోజకవర్గంలో హాట్ టాపిక్ అని చెప్పవచ్చు. ఏదైమి జరిగినా కాలమే సమాధానం చెపుతుందనేది సత్యం.
……………………………………………………….